75వ స్వాతంత్ర్య దినోత్సవం: 'పార్లమెంటు ప్రమాణాలు పడిపోతున్నాయి' - సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్‌.వి. రమణ

రమణ

ఫొటో సోర్స్, Getty Images

చట్టాలను రూపొందించడంలో పార్లమెంటు ప్రమాణాలు కొంతకాలంగా పడిపోతూ వస్తున్నాయని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ ఆందోళన వ్యక్తంచేశారు. చట్టసభల్లో చర్చలు జరిగే విధానంపైనా ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

సుప్రీం కోర్టు ఆవరణలో ఆదివారం 75వ స్వాతంత్ర్య దినోత్సవ నిర్వహణ సమయంలో రమణ మాట్లాడారు.

‘‘చట్టాల్లో చాలా అసందిగ్ధత, అస్పష్టత కనిపిస్తున్నాయి. వీటి వల్ల కోర్టులకు, సామాన్య ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.’’

‘‘నేటి పరిస్థితులను చూస్తుంటే బాధనిపిస్తోంది. చట్టాల్లో చాలా అసందిగ్ధత ఉంటోంది. అసలు ఈ చట్టాలను ఎందుకు రూపొందిస్తున్నారో అర్థంకావడం లేదు. ఇలాంటి చట్టాల వల్ల కోర్టులకు వచ్చే కేసుల సంఖ్య పెరుగుతోంది. సామాన్యులకూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.’’

ఎన్‌వీ రమణ

‘‘స్వాతంత్ర్య ఉద్యమంలో న్యాయవాదులు క్రియాశీల పాత్ర పోషించారు. స్వతంత్ర భారతదేశానికి తొలి నాయకులు కూడా లాయర్లే’’అని రమణ అన్నారు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ లాంటి స్వాతంత్ర్య ఉద్యమకారులు న్యాయవాదులేనని ఆయన గుర్తుచేశారు.

‘‘వారు తమ జీవితాలను దేశం కోసం త్యాగం చేశారు. కుటుంబాలు, ఆస్తులను వదిలి స్వాతంత్ర్యం కోసం పోరాడారు.’’

‘‘అప్పట్లో పార్లమెంటులో చర్చలు ఫలప్రదంగా సాగేవి. చట్టాలపై సుదీర్ఘ చర్చలు జరిపేవారు. కానీ, ఇప్పుడు పార్లమెంటులో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. చర్చల ప్రమాణాలు పడిపోయాయి. కొత్త చట్టాల లక్ష్యాలు, ఉద్దేశాలను కోర్టులు అర్థం చేసుకోలేకపోతున్నాయి’’అని రమణ అన్నారు.

రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామ్య హక్కులను ప్రజలకు అందేలా చూడటంలో గత కొన్నేళ్లుగా సుప్రీం కోర్టు కీలక పాత్ర పోషిస్తోందని రమణ వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)