ఆంధ్రప్రదేశ్: తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టనని సీఎం జగన్ వ్యాఖ్యలు – ప్రెస్ రివ్యూ

వైఎస్ జగన్

ఫొటో సోర్స్, facebook/ysjagan

'తెలంగాణ రాజకీయాల్లో నేను వేలు పెట్టలేదు. ఇకపైనా పెట్టను'అని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ వ్యాఖ్యలు చేసినట్లు ఆంధ్రజ్యోతి తెలిపింది.

''పొరుగు రాష్ట్రాల పాలకుల మధ్య సఖ్యత ఉండాలంటూ ఈ మాటలు చెప్పినప్పటికీ... సరిగ్గా తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీ ఆవిర్భావ సమయంలోనే జగన్‌ ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం.

గురువారం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకుని అనంతపురం జిల్లా రాయదుర్గంలో, కడప జిల్లా పులివెందులలో జరిగిన రైతు దినోత్సవ బహిరంగ సభల్లో జగన్‌ మాట్లాడారు.

'ఏ ఒక్క పొరుగు రాష్ట్రంతో విభేదాలు పెట్టుకోం. ఎవరితోనైనా సత్సంబంధాలు ఉండాలనే కోరుకుంటాం. పక్క రాష్ట్రంలో, ఇక్కడ ప్రజలు చల్లగా బాగుండాలని.. అలా ఉండాలంటే పాలకుల మధ్య సఖ్యత ఉండాలి.

అందుకే తెలంగాణ రాజకీయాల్లో నేను వేలు పెట్టలేదు. పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు రాజకీయాల్లోనూ వేలు పెట్టలేదు. రాబోయే రోజుల్లో కూడా పెట్టను'అని జగన్‌ తెలిపారు.

సఖ్యతతో సమస్యలను పరిష్కరించుకోవాలన్నదే తన అభిమతమని చెప్పారు''అని ఆంధ్రజ్యోతి తెలిపింది.

జికా వైరస్‌: కేరళలో ఒకరికి పాజిటివ్.. మరో 13 మందిలో లక్షణాలు

జికా వైరస్

ఫొటో సోర్స్, Getty Images

కేరళలో ప్రమాదకర జికా వైరస్‌ కేసులు వెలుగు చూస్తున్నాయని ఈనాడు ఓ కథనం ప్రచురించింది.

‘‘24 ఏళ్ల మహిళలో ఈ వ్యాధిని గుర్తించినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి గురువారం చెప్పారు. తిరువనంతపురంలో మరో 13 అనుమానిత కేసులు ఉన్నాయని, వాటికి సంబంధించి పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థ (ఎన్‌ఐవీ) నుంచి ధ్రువీకరణ కోసం ప్రభుత్వం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

‘తిరువనంతపురం నుంచి 19 నమూనాలు ల్యాబ్‌కు వెళ్లాయి. వారిలో వైద్యులు సహా 13 మంది ఆరోగ్య కార్యకర్తలకు జికా వైరస్‌ సోకి ఉంటుందని అనుమానిస్తున్నాం’అని ఆయన చెప్పారు.

ఇప్పటికే పాజిటివ్‌గా నిర్ధారణ అయిన మహిళ గురువారం ఒక బిడ్డకు జన్మనిచ్చిందన్నారు. ఆమె ప్రస్తుతం ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

జ్వరం, తలనొప్పి, చర్మంపై ఎర్రటి మచ్చలు వంటి లక్షణాలతో ఆమె జూన్‌ 28న ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది.

రాష్ట్రం వెలుపలికి ఆమె ప్రయాణించలేదు. ఆమె ఇల్లు తమిళనాడు సరిహద్దుల్లో ఉంది. వారం కిందట ఆమె తల్లిలోనూ ఇవే లక్షణాలు కనిపించాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

జికా వ్యాధి లక్షణాలు కూడా డెంగీ తరహాలోనే ఉంటాయి. జ్వరం, చర్మంపై దద్దుర్లు, కీళ్ల నొప్పులు కనిపిస్తాయి. దోమల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది’’అని ఈనాడు తెలిపింది.

ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎల్‌ రమణ

కేసీఆర్‌తోఎల్‌ రమణ భేటీ

టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ గురువారం భేటీ అయ్యారని నమస్తే తెలంగాణ తెలిపింది.

''రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి ఆయన ప్రగతిభవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా వీరి మధ్య దాదాపు గంటన్నరకుపైగా చర్చలు జరిగాయి.

అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి ఎల్‌ రమణ మీడియాతో మాట్లాడుతూ.. తాను సీఎం కేసీఆర్‌ను కలిసి, జగిత్యాలకు వైద్య కళాశాల ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపినట్టు వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ ప్రస్థానం, గత ఏడేండ్లలో స్వరాష్ట్రంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సీఎం కేసీఆర్‌తో సుదీర్ఘంగా చర్చించినట్టు వివరించారు.

దేశంలో వివిధ రాష్ర్టాలు ఏర్పడిన తర్వాత ఆయా రాష్ర్టాల్లో జరిగిన పరిణామాలు.. తెలంగాణలో జరుగుతున్న ప్రగతిపై సీఎం కేసీఆర్‌ విడమరచి చెప్పారని ఆయన తెలిపారు. సామాజిక తెలంగాణ సాధించాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని కొనియాడారు.

సీఎం కేసీఆర్‌ చేపట్టిన పాలనా సంస్కరణలు అద్భుత ఫలితాలిస్తున్నాయని ప్రశంసించారు. కొవిడ్‌ విషయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించిందని కితాబిచ్చారు''అని నమస్తే తెలంగాణ తెలిపింది.

ఒడిషా

నడి రోడ్డుపై మహిళ చీర లాగి అవమానం

ఉత్తరప్రదేశ్‌లోని బ్లాక్ ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు వెళుతున్న ఓ మహిళపై ప్రత్యర్థి పార్టీకి చెందిన వ్యక్తులు దాడి చేసి నడిరోడ్డుపై చీర లాగి అవమానించారని సాక్షి ఓ కథనం ప్రచురించింది.

‘‘ఆన్‌లైన్‌లో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇద్దరు వ్యక్తులు ఓ మహిళ చీరను నడిరోడ్డుపై లాగడం ఈ వీడియోలో స్పష్టంగా గమనించవచ్చు.

ఆమె సమాజ్ వాదీ పార్టీకి చెందిన నేత అని తెలుస్తోంది. స్థానిక లక్ష్మీపూర్ ఖేరి ప్రాంతంలో ఆమెపై ప్రత్యర్థులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేసిన పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్.. ‘యోగి ఆదిత్యనాథ్‌కు చెందిన అధికార మదాంధుల ప్రతాపం ఇది’ అని ట్యాగ్ పెట్టారు.

యూపీ బ్లాక్ ఎన్నికలు ఇప్పటికే మరికొన్ని చోట్ల హింసాత్మకంగా మారాయి. స్థానిక సీతాపూర్ జిల్లాలో బ్లాక్ ప్రముఖ్ ఎన్నికల సందర్భంగా తుపాకి కాల్పులు, బాంబు దాడులు హోరెత్తాయి.

జిల్లాలోని కమలాపూర్ ప్రాంతంలోని కాస్మాండా బ్లాక్‌లో గరువారం నామినేషన్ ప్రక్రియ సందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తిరుగుబాటు అభ్యర్థి నామినేషన్ వేయకుండా అడ్డుకునేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించాయి.

ఈ క్రమంలో బాంబు దాడులు, కాల్పులతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

పోలీసులు లాఠీ చార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు’’అని సాక్షి తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)