అయిదు రాష్ట్రాల ఎన్నికలు: ఏ పార్టీకి ఎంత లాభం, ఎంత నష్టం?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, షాదాబ్ నజ్మీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చాలామందిని ఆశ్చర్య పరిచాయి. బెంగాలీల మానసిక స్థితిని అంచనా వేయడంలో ఎగ్జిట్ పోల్స్ విఫలమైనట్లు స్పష్టంగా కనిపించింది.
తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరాటం ఉంటుందని ఎన్నికల అనంతర సర్వేలు అంచనా వేశాయి. కానీ ఫలితాలు మాత్రం మమతా బెనర్జీ వైపు ఏకపక్షంగా ఉన్నాయి.
ఇదిలా ఉంచితే, అసలు ఈ అయిదు రాష్ట్రాలలో ఎన్నికల ఫలితాలు ఏ పార్టీకి ఎంత మేరకు లాభం కలిగించాయి, ఎంత వరకు దెబ్బకొట్టాయి అన్నది అర్ధం చేసుకునేందుకు ప్రయత్నం చేద్దాం.
పశ్చిమ బెంగాల్
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు కొందరికి ఆశ్చర్యాన్ని, కొందరికి దిగ్భ్రాంతిని కలిగించాయి. అధికార పార్టీకి సహజంగా ఉండే వ్యతిరేకత కారణంగా సీట్లు తగ్గుతాయని అంతా భావించారు.
కానీ, 2016తో పోలిస్తే ఈసారి మరో రెండు సీట్లు అదనంగా వచ్చాయి. గతంతో పోలిస్తే ఓట్ల వాటా కూడా 3 శాతం పెరిగింది.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గెలిచి ఉండకపోవచ్చుగానీ, బలాన్ని మాత్రం గణనీయంగా పెంచుకుంది. 2016 ఎన్నికల్లో 10.16 శాతం ఓట్లను, 3 సీట్లను సాధించిన బీజేపీకి ఓట్లలో వాటా ఈసారి 38 శాతానికి పెరిగింది.

వామపక్షాలు
దశాబ్దాల పాటు బెంగాల్ రాజకీయాలలో ఆధిపత్యం చెలాయించిన లెఫ్ట్ పార్టీల పరిస్థితి ఇప్పుడు మరింత దయనీయంగా మారింది. ఈ ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్ ఒక్క సీటును కూడా గెలవలేక పోయింది.
2016 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎంకు 26 సీట్లు లభించగా, సీపీఐకి ఒక సీటు దక్కింది. గత ఎన్నికల్లో వామపక్షాలు గెలుచుకున్న చాలా సీట్లు ఈసారి తృణమూల్ ఖాతాలోకి వెళ్ళాయి.
Please wait
పశ్చిమ బెంగాల్‌లో ప్రాంతాల వారీగా సీట్ల లాభా నష్టాలను అంచనా వేస్తే, తృణమూల్ బెంగాల్ ఉత్తర సరిహద్దు ప్రాంతాలలో ఎక్కువ సీట్లు పొందినట్లు తేలింది.
గత ఎన్నికల్లో ఈ ప్రాంతంలో తృణమూల్ 22 సీట్లు గెలుచుకోగా, ఈసారి 43 సీట్లకు ఆ పార్టీ బలం పెరిగింది.
పశ్చిమ బెంగాల్ పర్వత ప్రాంతాలలో తృణమూల్ బాగా నష్టపోయింది. గతంలో ఇక్కడ 19 సీట్లు సాధించిన ఆ పార్టీ ఈసారి కేవలం 6 సీట్లను మాత్రమే సాధించగలిగింది.
బెంగాల్ ఉత్తర పర్వత ప్రాంతాలలో టీఎంసీ నష్టం బీజేపీకి లాభంగా మారింది. ఈ ప్రాంతంలో కాషాయ పార్టీ 21 సీట్లు సాధించింది. 2016తో పోలిస్తే ఆ పార్టీకి ఇక్కడ 20 సీట్లు పెరిగాయి.

తమిళనాడులో పరిస్థితి ఏంటి?
ప్రతిపక్ష డీఎంకే ఈ ఎన్నికల్లో 133 సీట్లు గెలుచుకుని అధికారం చేపట్టడానికి సిద్దమవుతోంది. గతంతో పోలిస్తే డీఎంకేకు 6 శాతం ఓట్లు పెరిగాయి.
అధికార అన్నాడీఎంకే కూటమి 66 సీట్లతో సరిపెట్టుకుంది. గత ఎన్నికల్లో ఆ పార్టీ 134 సీట్లు సాధించింది.
Please wait
తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ 2016లో కేవలం 8 సీట్లు మాత్రమే సాధించగా, ఈసారి పది సీట్లు పెంచుకోగలిగింది.
కావేరీ బేసిన్‌లో అన్నాడీఎంకే బాగా దెబ్బతింది. ఇక్కడ ఈసారి 19 సీట్లు నష్ట పోయింది. 2016లో ఇదే ప్రాంతంలో ఆ పార్టీ 23 సీట్లు సాధించింది.

ఉత్తర తమిళనాడులో కూడా అన్నాడీఎంకే కు నష్టమే జరిగింది. 2016లో ఇక్కడ 25 సీట్లు వస్తే, ఇప్పుడు ఆ సీట్లు 12 కు పడిపోయాయి.
అన్నా డీఎంకే దెబ్బతిన్న చోట్ల డీఎంకే బాగా లాభపడింది. కావేరీ ప్రాంతంలో ఆ పార్టీ 16 నుంచి 31 సీట్లకు బలాన్ని పెంచుకుంది.

ఫొటో సోర్స్, EPA/PIYAL ADHIKARY
కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఏం జరిగింది?
కేరళలో సీపీఎం అతి పెద్ద పార్టీగా అవతరించగా, లెఫ్ట్ డెమొక్రాటిక్ ఫ్రంట్ 62 సీట్లు, 26 శాతం ఓట్లు సాధించింది.
ఓట్ల శాతంలో కాంగ్రెస్ కూడా సీపీఎంకు చేరువగా వచ్చినప్పటికీ 21 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గతంలో ఒక సీటును గెలుచుకున్న బీజేపీకి ఈసారి అది కూడా దక్కలేదు.
అయితే, అస్సాం, పుదుచ్చేరిలలో మాత్రం బీజేపీ బాగా పుంజుకుంది. అస్సాంలో బీజేపీకి 69 సీట్లురాగా, కాంగ్రెస్‌కు 50 సీట్లు మాత్రమే వచ్చాయి.
పుదుచ్చేరిలో బీజేపీకి కూటమికి 16 సీట్లు రాగా, కాంగ్రెస్ 8 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2016లో కాంగ్రెస్ అక్కడ 17 స్థానాలు సాధించింది. కాంగ్రెస్ 9 సీట్లు కోల్పోతే, బీజేపీ 4 సీట్లు అదనంగా కూడగట్టుకుంది.
ఇవి కూడా చదవండి:
- సబ్బం హరి: అనకాపల్లి మాజీ ఎంపీ మృతి
- కరోనావైరస్: చైనాకు పాకిన ఇండియన్ వేరియంట్ B1617.. హై అలర్ట్ ప్రకటించిన అధికారులు
- కోవిడ్: ‘మా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 25 మంది చనిపోయారు.. ఏమీ చేయలేకపోయాను’.. ఐసీయూలో పనిచేసే ఓ నర్సు అనుభవాలు
- దీర్ఘకాలిక కోవిడ్: ‘రిపోర్టులన్నీ నార్మల్‌గానే వచ్చాయి. కానీ అడుగేస్తే నరకం కనిపించేది’
- టీకా ఉత్సవ్: విశాఖ జిల్లాలో వ్యాక్సీన్ల కోసం 14వేల మంది వస్తే.. 580 మందికి మాత్రమే ఇచ్చారు.. భారత్‌లో టీకాల కొరతకు కారణమేంటి..
- కరోనా కాలంలో విడాకులు, బ్రేకప్‌లు ఎందుకు పెరుగుతున్నాయి?
- కరోనావైరస్: సెకండ్ వేవ్‌లో పిల్లలు, యువతకు ఎక్కువగా వైరస్ సోకుతోందా?
- కరోనావైరస్ సెకండ్ వేవ్: 'గత ఏడాది లాక్డౌన్ వల్ల అడుక్కోవాల్సి వచ్చింది... మళ్లీ విధిస్తారా'
- న్యూజీలాండ్ ప్రభుత్వం 'తల్లుల' కోసం చేసిన చట్టంపై చర్చ ఎందుకు... భారత్‌లో పరిస్థితి ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








