కరోనా నుంచి కోలుకున్న 99 ఏళ్ల బామ్మ - ప్రెస్ రివ్యూ

సీతారాత్నం

ఫొటో సోర్స్, Eenadu

కరోనా నుంచి కోలుకున్న 99 ఏళ్ల మహిళ

హైదరాబాద్ మియాపూర్ ప్రాంతంలో 99 ఏళ్ల మహిళ కరోనావైరస్ వ్యాధి నుంచి కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని ఈనాడు తెలిపింది.

ఆమె పేరు సీతారాత్నం. స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా తిరువూరు. ఆమె చాలా ఏళ్లుగా కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నారు.

ఏప్రిల్ 24న ఆమెకు దగ్గు, స్వల్పంగా జలుబు ఉండటంతో కరోనావైరస్ పరీక్ష చేయించారు. ఈ వైరస్ సోకినట్లు నిర్ధరణ కావడంతో ముందు జాగ్రత్తగా కుటుంబసభ్యులు ఆమెను మదీనాగూడలోని ప్రణమ్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ఆరు రోజుల వ్యవధిలోనే ఆమె వైరస్‌ నుంచి కోలుకోవడంతో శుక్రవారం డిశ్చార్జ్‌ చేశారు.

కరోనా సోకిందని ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండటమే ముఖ్యమని సీతారత్నం చెప్పారు.

సన్నీ లియోని

సన్నీ లియోని: అందరూ కరోనా వ్యాక్సీన్ తీసుకోండి

కోవిడ్19 మహమ్మారిని ఓడించేందుకు వ్యాక్సీన్ తీసుకోవాలని నటి సన్నీ లియోని పిలుపు ఇచ్చారని 'ద టైమ్స్ ఆఫ్ ఇండియా' తెలిపింది.

"మీరు వ్యాక్సీన్ వేయించుకోండి, మీ ఆత్మీయులకు వ్యాక్సీన్ వేయించండి" అని ఇన్‌స్ట్రాగ్రామ్ వేదికగా ఆమె సూచించారు.

కరోనావైరస్‌పై ఫ్రంట్‌లైన్ వర్కర్స్ సాగిస్తున్న పోరాటం విజయవంతమయ్యేందుకు అందరం వ్యాక్సీన్ వేయించుకోవడం అవసరమని చెప్పారు.

cowin.gov.in వెబ్‌సైట్‌లో టీకా వేయించుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

టీకా

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణ: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ రోజు, రేపు టీకాలు వేయరు

తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ శనివారం, ఆదివారం కోవిడ్ టీకాల పంపిణీని నిలిపివేసినట్లు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో చెప్పారని ఈనాడు రాసింది.

తెలంగాణకు టీకాల సరఫరా జరగలేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకొన్నామని ఆయన చెప్పారు.

మరోవైపు- తెలంగాణలో రవాణా సదుపాయం లేని మారుమూల ప్రాంతాలకు కోవిడ్ టీకాల పంపిణీకి డ్రోన్లను ఉపయోగించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర పౌరవిమానయానశాఖ అనుమతి ఇచ్చింది.

నరేంద్ర

ఫొటో సోర్స్, Facebook/DhulipallaNarendraOfficial

ఏసీబీ కస్టడీకి టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర

సంగం డెయిరీ కేసులో ప్రధాన నిందితుడైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌తోపాటు మరో ఇద్దరు నిందితులను అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ ఏసీబీ స్పెషల్ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చిందని సాక్షి తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీడీడీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ బాబు.ఎ. ఇచ్చిన ఫిర్యాదు మేరకు అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద నరేంద్రపై ఏసీబీ కేసు నమోదు చేసింది.

ఈ కేసులో నరేంద్రతోపాటు మరో ఇద్దరు నిందితులు పి.గోపాలకృష్ణన్, ఎం.గురునాథంలను ఏప్రిల్ 23న ఏసీబీ అరెస్టు చేసింది. కోర్టు రిమాండ్ విధించడంతో వీరిని రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. కేసులో లోతైన దర్యాప్తు చేయాల్సి ఉందని, నరేంద్ర సహా ముగ్గురు నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఏసీబీ కోరింది. తనకు బెయిల్ ఇవ్వాలని నరేంద్ర అభ్యర్థించారు. ఆయన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. మే 1 నుంచి 5 వరకు ఈ ముగ్గురిని ఏసీబీ విచారించనుంది.

ఇవి కూడా చ‌ద‌వండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)