కేసీఆర్: 'కాంగ్రెస్ సక్కగ ఉంటే గులాబీ జెండా ఎగిరేదా.. తెలంగాణను నాశనం చేసింది ఆ పార్టీయే'

కేసీఆర్

ఫొటో సోర్స్, Trsparty

కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ఏమీ చేయలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన హాలియా సమీపంలోని అనుములలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.

తన ప్రసంగంలో ఆయన ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ అభ్యర్థి జానారెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు.

కాంగ్రెస్ నేతలు పదవుల కోసం తెలంగాణను పట్టించుకోకుండా వదిలేస్తే.. ఆ తెలంగాణ కోసం టీఆర్ఎస్ నేతలు ఏకంగా పదవులనే వదులుకున్నారని కేసీఆర్ అన్నారు.

''కాంగ్రెస్ సక్కగా ఉంటే తెలంగాణ గడ్డపై గులాబీ జెండా ఎగరాల్సిన అవసరం ఎందుకు వస్తుంది' అని కేసీఆర్ ప్రశ్నించారు.

జానారెడ్డి తన 30 ఏళ్ల హయాంలో హాలియాకు ఒక డిగ్రీ కాలేజీ కూడా తేలకపోయారని కేసీఆర్ అన్నారు. ‘‘ఏమాయేనే న‌ల్ల‌గొండ‌.. ఏడుపే నీ గుండె నిండా’’ అని నేనే పాట రాశాను.. ఇక్కడి ప్రజల కష్టాలు నాకు తెలుసు అన్నారాయన.

జానారెడ్డి భిక్ష వల్లే తాను సీఎం అయ్యానని కొందరంటున్నారని.. అదే నిజమైతే ఆయనే సీఎం అయ్యుండేవారని కేసీఆర్ అన్నారు.

నా సభను అడ్డుకోవాలనుకున్నారు

నాగార్జున సాగర్ నియోజకవర్గంలో తన సభను అడ్డుకోవాలని చాలామంది ప్రయత్నించారని.. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభ నిర్వహించుకోవచ్చని అన్నారు.

కాంగ్రెస్ పాలకులు తెలంగాణను నాశనం చేస్తే తాము అనేక పథకాలతో పేదలను ఆదుకుంటున్నామని చెప్పారు.

జానారెడ్డి

ఫొటో సోర్స్, janareddy/fb

‘కేసీఆర్ వ్యూహం అదే’

జానారెడ్డి ఇంతకుముందు ఎన్నికల్లో ఓడిపోయి ఉండొచ్చు.. కానీ, ఆయనపై స్థానికంగా పెద్దగా వ్యతిరేకత లేదు. జానారెడ్డి 2018లో ఓడిపోయినా 2014లో గెలిచినప్పటి కంటే ఎక్కువ ఓట్లు సాధించారు. గతంలో ఇండిపెండెట్లు భారీగా ఓట్లను చీల్చారు. ఈసారి బీజేపీ కూడా ప్రధానంగా బరిలో నిలిచింది. ఈ నేపథ్యంలో తమ ఓట్లు చీలకుండా చూసుకోవడం టీఆర్‌ఎస్‌కు ముఖ్యం. అందుకే జానారెడ్డిని లక్ష్యంగా చేసుకుంటే లాభిస్తుందని కేసీఆర్ భావిస్తున్నారన్న విషయం ఈ రోజు హాలియా సభతో అర్థమవుతోంది. కాంగ్రెస్‌లో తమకు ఏదైనా ముప్పు ఉందంటే అది జానారెడ్డి వల్లేనన్న అభిప్రాయం కూడా టీఆర్ఎస్ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. పైగా దుబ్బాకలో బీజేపీ చేతిలో కొద్ది తేడాతో ఓడిపోవడంతో టీఆర్ఎస్ ఈసారి ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవాలనుకోవడం లేదు'' అని సీనియర్ పాత్రికేయులు జింకా నాగరాజు అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)