బొత్స సత్యనారాయణ: ’ఏ క్షణంలోనైనా విశాఖకు రాజధాని తరలింపు’ - ప్రెస్‌ రివ్యూ

విశాఖపట్నం

ఫొటో సోర్స్, ANI

పరిపాలనా రాజధానిని ఏ క్షణాన్నైనా విశాఖకు తరలిస్తామని పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించినట్లు ఆంధ్రజ్యోతి పత్రిక తన కథనంలో తెలిపింది.

తెలుగుదేశం పార్టీ మూడు రాజధానులపై కోర్టుకు వెళ్లి, అభివృద్ధిని అడ్డుకుంటోందని బొత్స ఆరోపించినట్లు కూడా ఈ కథనం పేర్కొంది. మూడు రాజధానులపై ఇప్పటికే చట్టం చేశామని, కోర్టులో చిన్న చిన్న సమస్యలున్నాయని, న్యాయస్థానాలను ఒప్పించి, మెప్పిస్తామని మంత్రి మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేసినట్లు తెలిపింది.

'ఒక వర్గానికి, 20 గ్రామాలకే అమరావతి రాజధాని. సీఎం జగన్‌ 13 జిల్లాల అభివృద్ధి కోసమే విశాఖకు పరిపాలనా రాజధాని, అమరావతిలో లెజిస్లేటివ్‌ రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు." అని మంత్రి బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

జడ్పీటీసీ, ఎంపీటీసీ, మిగిలిన 32 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, సహకార సంఘాల ఎన్నికలు త్వరలోనే పూర్తి చేస్తామని, మున్సిపాలిటీల్లో ఎస్సీ, బీసీ జనాభా లెక్కలు, వార్డుల పునర్విభజన ఏప్రిల్లో పూర్తి చేసి, మే నెలలో ఎన్నికల సంఘానికి వివరాలు ఇస్తామని మంత్రి పేర్కొన్నట్లు ఆంధ్రజ్యోతి కథనం వెల్లడించింది.

కేసీఆర్

ఫొటో సోర్స్, FB/KCR

సాగర్‌ ఉప ఎన్నిక తర్వాత ఉద్యోగాల నోటిఫికేషన్‌

తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమవుతోందని, ఖాళీల లెక్క తేలడంతో ప్రభుత్వం నియామకాల ప్రక్రియను చేపట్టనుందని ఈనాడు పత్రిక ఒక కథనం ఇచ్చింది.

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక ముగిసిన తర్వాత వచ్చే నెల మూడో వారంలో మొదటి నోటిఫికేషన్‌ వెలువడే వీలుందని ఈ కథనం పేర్కొంది. అన్ని శాఖల నుంచి తెప్పించిన ఖాళీల జాబితాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదివారంనాడు సీఎం కేసీఆర్‌కు అందించారు.

తెలంగాణలో 55 వేల కంటే ఎక్కువే ఉద్యోగాల ఖాళీలు ఉన్నట్లు తెలిసిందని, గతంలో 50 వేలుగా అంచనా వేయగా, తాజాగా పదోన్నతుల అనంతరం మరో 5 వేల పోస్టులు తేలినట్లు ఈ కథనం పేర్కొంది.

ఉపాధ్యాయ పదోన్నతులు చేపడితే ఖాళీలు మరో 5 వేలకు పైగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వచ్చిన గణాంకాల మేరకు పోలీసు శాఖలో అత్యధికంగా, ఆ తర్వాత విద్య, వైద్య ఆరోగ్య శాఖల్లో అధిక పోస్టులున్నాయి. రెవెన్యూ, పురపాలక, వ్యవసాయ, నీటిపారుదల శాఖల్లోనూ గణనీయంగానే లెక్క తేలాయి.

మరోవైపు ఉద్యోగ నియామకాలపై సీఎం కేసీఆర్‌ ఒకటి, రెండు రోజుల్లో సమావేశం నిర్వహించనున్నారని కూడా ఈ కథనం వెల్లడించింది. ఈ సందర్భంగా ఖాళీలు, వాటి భర్తీ ప్రక్రియ, నియామక సంస్థల ఎంపిక వంటి అంశాలపై విధాన నిర్ణయాలు తీసుకుంటారు.

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక వచ్చే నెల 17న జరగనుంది. ఎన్నికల నియమావళి ముగిసిన తర్వాతే నియామక ప్రక్రియ చేపట్టే వీలుందని ఈనాడు పత్రిక పేర్కొంది.

అమిత్ షా

ఫొటో సోర్స్, Getty Images/FB/SHARAD PAWAR

అమిత్‌షా, శరద్‌ పవార్‌ రహస్య భేటీ

మహారాష్ట్రలో కరోనా కేసులతో పాటు రాజకీయ అనిశ్చితి కూడా పెరుగుతోందని, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో శనివారం రహస్యంగా భేటీ అయ్యారన్న వార్తలు సంచలనం కలిగించాయంటూ నమస్తే తెలంగాణ పత్రిక ఒక కథనం ఇచ్చింది.

వీరిద్దరి సమావేశంపై అమిత్‌ షాను ఆదివారం విలేకరులు ప్రశ్నించగా ఆయన నర్మగర్భంగా బదులిచ్చారని, సమావేశం జరిగిందా లేదా అన్నది చెప్పకుండా 'అన్నీ బయటకు చెప్పలేం' అంటూ దాటవేశారని ఈ కథనం పేర్కొంది.

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణల అంశంలో అధికార శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ కూటమి మధ్య భేదాభిప్రాయాలు బయటపడుతున్న సమయంలో ఈ భేటీ వార్తలు వచ్చాయి. గుజరాత్‌కు చెందిన స్థానిక వార్తా సంస్థ ఒకటి శరద్‌ పవార్‌, ఎన్సీపీ నేత ప్రఫుల్‌ పటేల్‌ ఇద్దరూ అహ్మదాబాద్‌లోని అమిత్‌ షా ఫాం హౌస్‌లో భేటీ అయ్యారని తెలిపింది.

అయితే వీరిద్దరి సమావేశం వ్యవహారాన్ని ఎన్సీపీ నేత నవాబ్‌ మాలిక్‌ ఖండించారనీ, అమిత్‌ షాతో పవార్‌ భేటీ కాలేదని చెప్పారని ఈ కథనం వెల్లడించింది.

ఇక హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి చేత విచారణ జరిపించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కూడా నమస్తే తెలంగాణ పత్రిక మరో కథనంలో పేర్కొంది. అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఒక యాక్సిడెంటల్‌ హోంమినిస్టర్‌ అని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ అన్నట్లు కూడా ఈ కథనం వెల్లడించింది.

కర్నూలు

ఫొటో సోర్స్, Ministry of Civil Aviation/twitter

కర్నూలు నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం

విమానాల రాకపోకల ప్రారంభంతో కర్నూలులో పండుగ వాతావరణం నెలకొందని సాక్షి పత్రిక ఒక కథనం ఇచ్చింది. బెంగళూరు నుంచి తొలి విమానం కర్నూలు విమానాశ్రయానికి ఉదయం 10.10 గంటలకు చేరుకోగా, వాటర్‌ క్యానన్‌ రాయల్‌ సెల్యూట్‌తో ఆధునిక అగ్నిమాపక వాహనాలు ఘన స్వాగతం పలికాయి.

ప్రయాణికులకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్వాగతం పలికారు. బెంగళూరుకు చెందిన రాంప్రసాద్‌ దంపతుల కుమార్తె సాయి ప్రతీక్షకు పుష్పగుచ్ఛాన్ని అందచేశారు. ఇదే ఫ్లైట్‌లో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌తోపాటు 72 ప్రయాణికులు బెంగళూరు నుంచి వచ్చారు.

ఇక కర్నూలు నుంచి తొలి విమానం విశాఖకు వెళ్లింది. ఇందులో వెళ్లిన 66 మంది ప్రయాణికులకు ఇండిగో యాజమాన్యం స్వీట్లు, పోస్టల్‌ స్టాంపు ప్రత్యేక కవర్లను అందజేసింది. 11.50 గంటలకు విశాఖ వెళ్లే విమానం మంత్రులు జాతీయ జెండా ఊపడంతో టేకాఫ్‌ అయింది. మధ్యాహ్నం 1 గంటకు విశాఖలో విమానం బయలుదేరి కర్నూలుకు 2.55 గంటలకు చేరుకుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)