వంట గ్యాస్ సిలిండర్‌పై రాయితీ గతంలో రూ.500 దాకా వచ్చేది, ఇప్పుడు రూ.16కి పడిపోయింది- ప్రెస్ రివ్యూ

వంట గ్యాస్‌కు నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించిన తొలి నాళ్లలో.. ఒక్కో సిలిండర్‌పై రూ.170 నుంచి రూ.500 వరకు రాయితీ రూపంలో వినియోగదారుడి బ్యాంకు ఖాతాలో జమయ్యేది. రాయితీ పోను సగటున రూ.500 వరకు వినియోగదారుడు భరించేవారు. ప్రస్తుతం సిలిండర్ ధర విజయవాడలో రూ.816కు చేరగా.. రాయితీ మాత్రం 16కి పడిపోయిందంటూ ఈనాడు ఒక కథనాన్ని ప్రచురించింది.
అదే విశాఖపట్నంలో అయితే సిలిండర్ ధర రూ. 800 కాగా సబ్సిడీ రూ.4 చొప్పునే పడుతోంది. ఒక్కో ఊళ్లో ఒక్కోలా రాయితీ వస్తున్నా.. ఎక్కడా 50 రూపాయలకు మించి లేదు. సిలిండర్ల రేట్లు భారీగా పెరుగుతున్నా రాయితీ మాత్రం తగ్గిపోతోంది. ఆరేళ్ల కిందటితో పోలిస్తే, ఒక్కో సిలిండర్‌పై రూ.300 వరకు అదనంగా భరిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 1.42 కోట్ల వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వాణిజ్య వినియోగదారుల్ని మినహాయిస్తే.. సుమారు 1.15 కోట్ల కుటుంబాలు ప్రతి నెలా గ్యాస్ సిలిండర్లు తీసుకుంటున్నాయి. ఈ లెక్కన ఏడాదికి రాష్ట్ర గ్యాస్ వినియోగదారులపై రూ.4,140 కోట్ల భారం పడుతోంది.
వంటగ్యాస్ ధర అత్యధికంగా 2018 నవంబరులో రూ.970కి చేరింది. అప్పట్లో వినియోగదారుడికి రాయితీ రూపంలో రూ.389 వరకు బదలాయించారు. 2018 డిసెంబరులో గ్యాస్ సిలిండర్ రూ.837 చొప్పున ఉంది. అప్పుడూ రూ.262 వరకు జమ చేశారు. 2020 మార్చిలో సిలిండర్ ధర రూ.833 ఉండగా.. రూ.254 చొప్పున రాయితీ వినియోగదారులకు అందింది. అక్కడ నుంచి క్రమంగా తగ్గుతూ.. సిలిండర్‌కు రూ.16 చొప్పున మాత్రమే లభిస్తోంది. పెరిగిన ధరల ప్రకారం సిలిండర్ (విజయవాడలో) ధర రూ.816 అయింది. దీనిపై ఎంత రాయితీ వస్తుందో? అసలొస్తుందో రాదో కూడా డీలర్లే చెప్పలేని పరిస్థితి ఉంది.
ప్రాంతాలవారీగా ఎల్‌పీజీ ధరల్లో తేడా ఉంది. దీనికి అనుగుణంగానే రాయితీ కూడా జమ అవుతోంది. అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాలో సిలిండర్ ధర రూ.800 ఉంది. ఇక్కడ గత కొన్ని నెలలుగా వినియోగదారులకు రూ.4 చొప్పునే రాయితీ జమ అవుతోంది. అనంతపురం జిల్లా ఉరవకొండలో తాజాగా సిలిండర్ ధర రూ.863 వరకు ఉంది. ఇక్కడ రూ.49 చొప్పున జమచేస్తున్నారు. తిరుపతిలో సిలిండర్ ధర రూ.830పైనే ఉంది. కొన్ని నెలల నుంచి ఇక్కడ సిలిండర్‌కు రూ.17 చొప్పున జమవుతోంది.
గృహావసర వంటగ్యాస్ సిలిండర్ ధర గతేడాది నవంబరులో రూ.616 ఉంది. డిసెంబరులో రెండు దఫాలుగా రూ.100 పెంచారు. 2021 ఫిబ్రవరిలో మూడుసార్లు కలిపి రూ.100 పెంచారు. దాంతో సిలిండర్ ధర రూ.816 అయింది. గ్యాస్ ధర సిలిండర్‌పై రూ.200 చొప్పున పెరిగినా.. రాయితీలో మాత్రం మార్పు రాలేదు.
వంటగ్యాస్ రాయితీని స్వచ్ఛందంగా వదులుకునేలా 'గివ్ ఇట్ అప్' కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుతో అధికాదాయ వర్గాల వారు ముందుకొచ్చి రాయితీ సిలిండర్‌ను వదులుకున్నారు. ముందుకురాని.. పేద, మధ్య తరగతి కుటుంబాలకు రాయితీలో క్రమంగా కోత పడుతోంది. అనధికారికంగానే గివ్ ఇట్ ఆప్ అమలవుతోందని ఈ కథనంలో తెలిపారు.

ఫొటో సోర్స్, APa
ఇస్రో ఘన విజయం
ఈ ఏడాది ఇస్రో తలపెట్టిన ‘తొలి’ వాణిజ్య ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. 14 విదేశీ, 5 స్వదేశీ ఉపగ్రహాలను మోసుకుంటూ నింగిలోకి ఎగసిన పీఎస్ఎల్వీ-సీ51 అలవోకగా లక్ష్యాన్ని పూర్తిచేసి ఇస్రోకు మరో ఘన విజయాన్ని కట్టబెట్టిందని ఆంధ్రజ్యోతి ఒక కథనంలో తెలిపింది.
పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఆదివారం ఉదయం 10:24 గంటలకు నిప్పులు చిమ్ముకుంటూ రోదసీలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ-సీ51 గంటా 55 నిమిషాల్లోనే 19 ఉపగ్రహాలను అంచలంచెలుగా నిర్ణీత కక్ష్యల్లో విడిచిపెట్టింది. నాలుగు దశల మోటార్లతో పైకెగిరిన రాకెట్ తొలి 17.24 నిమిషాల్లోనే సూర్యానువర్తన ధ్రువ కక్ష్యలోకి చేరుకొని బ్రెజిల్‌కు చెందిన 637 కేజీల భూపరిశీలన ఉపగ్రహం అమెజోనియా-1ను అక్కడ విడిచిపెట్టింది.
తదుపరి రాకెట్‌లోని నాల్గవ దశ ఇంజన్‌ను ఆఫ్‌ఆన్ చేస్తూ శాస్త్రవేత్తలు రాకెట్‌ను రోదసీలో 1:33 గంటలు పయనింపచేశారు. అనంతరం డీఆర్‌డీవో ఆధ్వర్యంలో బెంగళూరు పీఈఎస్ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన సింధునేత్ర ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అనంతరం స్పేస్‌కిడ్జి ఇండియా విద్యార్థులు రూపొందించిన సతీశ్ ధవన్‌శాట్, అమెరికాకు చెందిన ఎస్‌ఎఐ-1 నానో కనెక్టివిటీ-2 ఉపగ్రహం, ఆ దేశానికే చెందిన 12 స్పేస్‌బీస్ ఉపగ్రహాలు వరుసగా రాకెట్ నుంచి విడివడి కక్ష్యల్లోకి చేరుకున్నాయి. చివరగా గంటా 55 నిమిషాలకు స్వదేశీ విద్యార్థులు రూపొందించిన జేఐటీశాట్, జీహెచ్‌ఆర్‌సీఈశాట్, శ్రీశక్తిశాట్‌లతో కూడిన యూనిటీశాట్ కక్ష్యలోకి చేరుకుంది. దాంతో ప్రయోగం విజయవంతంగా ముగిసినట్లు ఇస్రో చైర్మన్ డాక్టర్ కె. శివన్ ప్రకటించారు.
ఎన్‌ఎస్ఐఎల్ సంస్థ వాణిజ్య ఒప్పందాల మేరకు ఇస్రో రాకెట్లు దేశ, విదేశీ ప్రైవేటు ఉపగ్రహాలను ప్రయోగించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు పీఎస్ఎల్వీ-సీ51 రాకెట్‌తో ఇస్రో ఎన్‌ఎస్ఐఎల్ తొలి వాణిజ్య ప్రయోగాన్ని నిర్వహించి 14 విదేశీ, 5 స్వదేశీ ఉపగ్రహాలను కక్ష్యల్లోకి చేరవేసింది.
పీఎస్ఎల్వీ-సీ51 ప్రయోగం ద్వారా భగవద్గీతతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను ఇస్రో శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి పంపారు. స్పేస్ కిడ్జ్ ఇండియా విద్యార్థులు రూపొందించిన సతీశ్ ధవన్‌శాట్ అనే బుల్లి ఉపగ్రహం ద్వారా భగవద్గీత కాపీలు, మోదీ ఫొటో, పేరుతోపాటు ఇస్రో చైర్మన్ శివన్, సాంకేతిక కార్యదర్శి ఆర్ ఉమామహేశ్వరన్, చెన్నై విద్యార్థులు, ఆత్మనిర్భిర్ భారత్ పేరు కలిపి 25వేల పేర్లను పంపినట్లు ఈ కథనంలో తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
'మన్ కీ బాత్' కార్యక్రమంలో తెలుగు రైతు గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ
పొలమే ప్రయోగశాలగా విప్లవాత్మక ఆవిష్కరణలు చేస్తున్న హైదరాబాదీ రైతు చింతల వెంకట్‌రెడ్డిని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రత్యేకంగా ప్రశంసించారని నమస్తే తెలంగాణ ఒక కథనాన్ని ప్రచురించింది.
విటమిన్-డీ కలిగిన అరుదైన వరి, గోధుమ పంటలను పండించి ప్రపంచాన్ని అబ్బురపర్చిన వెంకట్‌రెడ్డి సేవలను మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని ఆదివారం ప్రస్తావించారు. ‘సైన్స్ అంటే కేవలం ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రమే కాదు. సైన్స్‌కు విస్తారమైన అవకాశం ఉన్నది. సైన్స్ ప్రయోగశాల నుంచి క్షేత్రస్థాయికి (ల్యాబ్ టూ ల్యాండ్) రావాల్సిన అవసరం ఉన్నది. ఇందుకు ఉదాహరణే హైదరాబాద్‌కు చెందిన రైతు వెంకట్‌రెడ్డి చేసిన ప్రయోగం. రెడ్డి ఒకసారి డాక్టర్‌ను కలిసినప్పుడు శరీరంలో విటమిన్-డీ తక్కువగా ఉండటంవల్ల వచ్చే వ్యాధుల గురించి చెప్పారు. దాంతో ఈ సమస్యకు పరిష్కారం ఎలా అని ఆ రైతు ఆలోచించారు. అప్పుడే విటమిన్-డీ గల వరిని పండించాలన్న ఆలోచన వచ్చి విజయవంతంగా ఆవిష్కరించారు. దీనికి వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆమోదం కూడా లభించింది. గతంలో ఆయన సేవల్ని గుర్తించి గతేడాది పద్మశ్రీ పురస్కారంతో సత్కరించాం’ అని ప్రధాని తెలిపారు.
హైదరాబాద్‌లోని ఆల్వాల్‌కు చెందిన వెంకట్‌రెడ్డి ఇటీవల విటమిన్-డీ గల వరి, గోధుమ పంటలను తన పొలంలో పండించారు. క్యారట్, స్వీట్ పొటాటో, మక్కపిండితో చేసిన మిశ్రమాన్ని పంటకు నీళ్లలో పారించి విటమిన్-డీ ఉన్న పంటను ఆవిష్కరించారు. విటమిన్-డీ లోపం ఉన్నవారు మందులు వాడాల్సి అవసరం లేకుండా ఆహారం ద్వారానే ఆరోగ్యవంతులు అయ్యే అద్భుత బహుమతిని ప్రపంచానికి అందించారు. వెంకట్‌రెడ్డి ప్రయోగ వివరాలు వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమయ్యాయి. దీంతో ఈ ప్రయోగానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరొచ్చిందని ఈ వార్తలో రాశారు.

'బలవంతపు చర్యల ద్వారా నామినేషన్లు విరమించుకున్నవారిపై ఇవాళో రేపో ఒక నిర్ణయం తీసుకుంటాం'.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్
ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో గతంలో అసలు నామినేషన్ దాఖలు చేయని అభ్యర్థులకు ఇప్పుడు అవకాశమివ్వడానికి, స్కూృటినీలో తిరస్కరణకు గురైన వాటిని తిరిగి పునరుద్ధరించడానికి ఎన్నికల నిబంధనలు అంగీకరించవని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ స్పష్టం చేశారని సాక్షి ఒక కథనంలో తెలిపింది.
ఈ నిబంధనలకు లోబడి కొన్ని పరిమితుల మేరకు బలవంతపు చర్యల ద్వారా నామినేషన్లు విరమించుకున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై సోమ లేదా మంగళవారాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానన్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు, ఇతర జిల్లాల అధికారులతో నిమ్మగడ్డ విజయవాడలో ఆదివారం సమీక్ష నిర్వహించారు. తర్వాత ఆయా జిల్లాల రాజకీయ పార్టీ నేతలతోనూ వర్చువల్ సమావేశంలో మాట్లాడారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘మున్సిపల్ ఎన్నికల్లో బలవంతం మీద నామినేషన్లు ఉపసంహరించుకున్న విషయంలో అభ్యర్థిత్వాల పునరుద్ధరణను బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద పరిగణనలోకి తీసుకుంటాం. అలాంటి ఫిర్యాదులపై కొన్ని జిల్లాల నుంచి నివేదికలు వచ్చాయి. మరికొన్ని చోట్ల నుంచి కూడా తెప్పించుకుంటాం. పాక్షికంగా పునరుద్ధరించడం రాష్ట్రస్థాయిలో జరుగుతుంది’ అని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ చర్యల వల్ల కరోనా నియంత్రణలోకి వచ్చినప్పటికీ.. మున్సిపల్ ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం ఐదుగురు మించి చేయడానికి వీలులేదన్నారు. అతిక్రమిస్తే క్రిమినల్ చర్యగా పరిగణిస్తామన్నారు. పరిమితంగా రోడ్డు షోలకు అనుమతిస్తామన్నారు. సోమవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశామన్నారని ఈ వార్తలో రాశారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: గాడిద మాంసం తింటే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందా.. ఏపీలో ఎందుకంత గిరాకీ పెరుగుతోంది
- ఝార్ఖండ్: ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రి.. చేరుకునేలోపే ప్రసవం.. ప్రాణాలు కోల్పోయిన తల్లి, బిడ్డ
- రాజాసింగ్: గోమాంసం తినేవారిపై బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు, వెల్లువెత్తిన విమర్శలు
- దేశద్రోహ చట్టం: అసమ్మతిని అణచివేయడానికి ప్రయోగిస్తున్న అస్త్రం
- గ్యాంగ్ రేప్ నిందితుడు పోలీసులకు దొరక్కుండా 22 ఏళ్లు ఎలా తప్పించుకు తిరిగాడు?
- మోదీ సర్కారు ప్రభుత్వ కంపెనీలను ఎందుకు అమ్మేస్తోంది...
- ఆంధ్రప్రదేశ్: ‘ప్రచారానికి వెళ్తే పేరంటానికా అని ఎగతాళి చేశారు... మగవాళ్లందరినీ ఓడించాం’
- బంగ్లాదేశ్ నుంచి వచ్చి నిజామాబాద్‌లో దొంగ పాస్‌పోర్టులు తీస్తున్నారు... ఏంటీ దందా?
- మోటేరా స్టేడియం.. అపూర్వమైన ప్రపంచ రికార్డులకు వేదిక
- నరసరావుపేట అనూష హత్య: నిందితుడు పోలీసు కస్టడీలో ఉన్నాడా... పరారీలో ఉన్నాడా?
- స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ లిక్కర్ బ్రాండ్లు నిజంగానే ఉన్నాయా?
- హిట్లర్ కోసం విషం రుచిచూసే మహిళల కథ
- జ్యోతిషాన్ని నమ్మే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది... ఎందుకు?
- ఘట్కేసర్ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య: తప్పెవరిది, అమ్మాయిలదా.. తల్లిదండ్రులదా.. సమాజానిదా? :అభిప్రాయం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








