దిల్లీ అల్లర్లకు ఏడాది: తగలబడిన రెండు ప్రార్థనా స్థలాల కేసులను పోలీసులు ఏం చేశారు.. ప్రత్యక్ష సాక్షుల ఫిర్యాదులను ఎందుకు పట్టించుకోవడం లేదు

కాలిపోయిన మసీదు

ఫొటో సోర్స్, XAVIER GALIANA/GETTYIMAGES

    • రచయిత, కీర్తి దుబె
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గత ఏడాది ఫిబ్రవరిలో తూర్పు దిల్లీ ప్రాంతంలో జరిగిన అల్లర్లలలో పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణనష్టం జరిగింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీ ఈశాన్య ప్రాంతంలో మొదలైన నిరసనలు చివరకు అల్లర్లుగా రూపాంతరం చెందడంతో గత ఏడాది ఫిబ్రవరి 23 నుంచి ఫిబ్రవరి 26 మధ్య 53మంది చనిపోయారు.

జులై 13న దిల్లీ పోలీసులు హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం, మృతుల్లో 40మంది ముస్లింలు, 13మంది హిందువులు ఉన్నారు.

అల్లర్లపై దిల్లీ పోలీసులు 752 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. అయితే ఆ పత్రాలలో ఏముందో చూపించడానికి పోలీసులు నిరాకరించారు.

దిల్లీ పోలీసులు అల్లర్లను అదుపు చేయగలిగారని పార్లమెంటులో హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు. కానీ అల్లర్ల సందర్భంగా, ఆ తరువాత పోలీసులు వ్యవహరించిన తీరుపై చాలా విమర్శలు వినిపించాయి.

బాధితులు డిమాండ్ చేసినా, ప్రత్యక్షంగా చూసినవారు చెప్పినా కూడా ఓ రెండు కేసుల విషయంలో దిల్లీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి.

ముస్తఫాబాద్‌లోని బ్రిజ్‌పురి ప్రాంతంలో ఉన్న ఫారూకియా మసీదు, శివ్‌విహార్ ప్రాంతంలోని మదీనా మసీదుకు సంబంధించినవే ఈ రెండు కేసులు.

ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన ఫిర్యాదులను పోలీసులు పట్టించుకోలేదని విమర్శలు వచ్చాయి

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన ఫిర్యాదులను పోలీసులు పట్టించుకోలేదని విమర్శలు వచ్చాయి

ఫారూకియా మసీదుకు ఏం జరిగింది?

గత ఏడాది ఫిబ్రవరి 25న కొందరు వ్యక్తులు మసీదులోకి ప్రవేశించి దానికి నిప్పంటించారు. మసీదు పక్కనే స్థానిక మహిళలు సీఏఏ-ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. వారి టెంట్‌కు కూడా నిప్పంటించారు.

మసీదులో ఉన్న ఏడెనిమిదిమందిపై కూడా దాడి చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కానీ వీరి ఫిర్యాదుపై పోలీసులు ఇంత వరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు.

ఈ ఘటనకు ప్రత్యక్షసాక్షులైన ఖుర్షీద్‌ సైఫీ, ఫిరోజ్ అక్తర్‌, హాజీ హషీమ్‌లు ఇచ్చిన ఫిర్యాదు కాపీలను బీబీసీ సేకరించింది.

ఫిరోజ్‌ 2020 ఏప్రిల్‌లో ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. అయితే జులై 21న తమకు ఫిర్యాదు అందినట్లు, దానిని హోం మంత్రిత్వ శాఖకు పంపినట్లు రిసీట్‌ స్టాంప్‌ వేసి ఉంది.

ఫిబ్రవరి 25, సాయంత్రం 6.30 గం.లకు తాను ప్రార్థనలు చేయడానికి మసీదుకు వచ్చానని, కొందరు యూనిఫామ్‌లు ధరించి మసీదులో ప్రవేశించారని, వారి చేతిలో పెట్రోలు బాంబులు, కత్తులు ఉన్నాయని ఫిరోజ్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ బృందంలో ఉన్న కొందరు దుండగుల పేర్లను కూడా చెప్పారు ఫిరోజ్‌.

కొందరు వ్యక్తులు మసీదులో ఉన్న వారిపై దాడి చేశారంటూ వారి పేర్లు, వారు ఎవరిని కొట్టారో కూడా వివరించారు. సీఏఏ నిరసనకారులు ఏర్పాటు చేసిన టార్పాలిన్‌ టెంట్లకు నిప్పంటించారని, తనను కూడా అందులో వేశారని, తాను చనిపోవడం ఖాయమనుకున్నానని, కానీ ఎలాగోలా ప్రాణాలతో బైటపడ్డానని ఫిరోజ్‌ చెప్పుకొచ్చారు.

ఫిరోజ్‌కు తల మీద గాయాలవడంతో 90 కుట్లు పడ్డాయి. ఆయన చేతివేళ్లు పని చేయడం లేదు.

టైలర్‌గా పని చేసే ఫిరోజ్ గత ఏడాదికాలంగా ఉపాధి లేకుండా తన గదిలో ఉంటున్నారు. ఫిర్యాదు చేశాక దానిని వెనక్కి తీసుకోవాలంటూ తనపై పోలీసులు ఒత్తిడి చేశారని ఫిరోజ్‌ తెలిపారు.

తన కొడుకు, తాను వస్తుండగా కొందరు తమపై దాడి చేశారని, భయంతో ముస్తాబాద్‌లోని అద్దె ఇంటిని వదిలేసి తుర్క్‌మన్‌ గేట్‌ వద్ద ఉంటున్నామని ఫిరోజ్‌ తెలిపారు.

“ నేను చేసే పనే చేతులతో చేసే పని. ఇప్పుడు ఈ చేతులు కూడా పని చేయడం లేదు. ఎలా బతకాలి” అని ఫిరోజ్‌ ప్రశ్నించారు. అల్లర్ల బాధితులకు దిల్లీ ప్రభుత్వం ఇచ్చిన పరిహారంతో ఎలాగో బతుకు నెట్టుకొస్తున్నానని ఆయన చెప్పారు.

దిల్లీ అల్లర్లలో అనేక ఇళ్లు దహనమయ్యాయి

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES/GETTYIMAGES

ఫొటో క్యాప్షన్, దిల్లీ అల్లర్లలో అనేక ఇళ్లు దహనమయ్యాయి

మరో ప్రత్యక్ష సాక్షి ఫిర్యాదు

ఓల్డ్‌ ముస్తఫాబాద్‌ నివాసి ఖుర్షీద్ సైఫీ కూడా ఇవే ఆరోపణలతో ఫిర్యాదు చేశారు. ఖుర్షీద్‌ ముఖంపై గాయాలయ్యాయి. కంటి చుట్టు ఉండే ఎముక విరిగింది.

2020 ఫిబ్రవరి 25న ఫారూకియా మసీదులో జరిగిన హింసను ఆయన కళ్లకు కట్టినట్లు వివరించారు. ఆర్కిటెక్ట్‌గా పని చేస్తున్న ఖుర్షీద్‌కు ఇప్పుడు ఒక కన్నే ఉంది. ఆయన తన పనిని చేయలేకపోతున్నారు.

ముస్తఫాబాద్‌ ఈద్గా దగ్గర ఉన్న రిలీఫ్‌ క్యాంప్‌లో కంప్లయింట్‌ డెస్క్‌ ఏర్పాటు చేశారు. ఖుర్షీద్‌ మార్చి 15న ఇక్కడ ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదుపై దయాళ్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌, ప్రధానమంత్రి కార్యాలయం, హోంశాఖ కార్యాలయం స్టాంప్‌లున్నాయి.

ఫిబ్రవరి 25న సాయంత్రం ఆరున్నర గంటలకు కొందరు వ్యక్తులు మసీదులోకి ప్రవేశించారని, అంతకు ముందు సీఏఏ వ్యతిరేక నిరసన ప్రదర్శనలు చేస్తున్న మహిళలపై వారు దాడి చేశారని చెప్పారు.

దుండగుల చేతిలో కర్రలు, త్రిశూలాలు, పెట్రోలు బాంబులు ఉన్నాయని, మసీదులోకి ప్రవేశించి అక్కడున్న వారిపై దాడి చేయడం మొదలుపెట్టారని ఖుర్షీద్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కొందరు కాల్పులు కూడా జరిపారని ఆయన తన కంప్లయింట్‌లో పేర్కొన్నారు.

ఫిబ్రవరి 27న బీబీసీ బ్రిజ్‌పురిలోని మసీదును సందర్శించినప్పుడు అది తగలబడిపోయి కనిపించింది.

ఫారూకియా మసీదు
ఫొటో క్యాప్షన్, దాడుల తరువాత ఫారూకియా మసీదు

పోలీసులు ఏం చేస్తున్నారు ?

ఫారూకియా మసీదులో కాల్పులు, హింసకు సంబంధించి దయాళ్‌పూర్‌ స్టేషన్‌లో పోలీసులు ఫిబ్రవరి 26, 2020న ఎఫ్ఐఆర్-64ను నమోదు చేశారు. కాని పీసీఆర్‌ (పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌) కాల్‌ ద్వారా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రామ్‌ ప్రకాశ్‌కు వచ్చిన సమాచారం ఆధారంగా ఈ ఎఫ్ఐఆర్‌ నమోదైంది.

రెండు ఫిర్యాదులను పోలీసు డైరీలో నమోదు చేశారు. కానీ ఫిర్యాదుదారులు చెప్పిన పేర్లను డైరీలో మాత్రమే చేర్చారు కానీ ఎఫ్‌ఐఆర్‌లో మాత్రం అవి లేవు.

ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన రెండు ఫిర్యాదులలో సంఘటన జరిగిన సమయం సాయంత్రం 6.30 అని పేర్కొనగా, పోలీసుల ఎఫ్‌ఐఆర్‌లో మాత్రం ఆ తర్వాత రెండున్నర గంటలకు అంటే రాత్రి 9గంటల ప్రాంతంలో ఈ ఘటనలు జరిగినట్లుగా పేర్కొన్నారు.

ఈ ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్లు ప్రస్తావించ లేదు. పైగా సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలో పాల్గొన్నవారిలో ఎక్కువమంది ముస్లిమ్‌లేనని, వారే మసీదుకు నిప్పంటించారని పేర్కొన్నారు.

ఈ కేసులో ప్రత్యక్ష సాక్షుల ఫిర్యాదు ప్రకారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు. ఖుర్షీద్, అక్తర్‌ హింసకు ప్రత్యక్ష సాక్షులు మాత్రమే కాదు, బాధితులు కూడా. అయినా పోలీసులు వారి ఫిర్యాదులపై ఏమాత్రం శ్రద్ధ చూపలేదు

శివ్ విహార్‌లో

ఫొటో సోర్స్, Getty Images

అరెస్టు చేసి బెయిల్‌పై విడుదల

ఎఫ్‌ఐఆర్‌ నంబర్-64 ప్రకారం బ్రిజ్‌పురికి చెందిన రాజీవ్‌ అరోరాను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనకు ఆగస్టు 10న కర్‌కర్‌డూమా కోర్టు బెయిల్ ఇచ్చింది. రాజీవ్ అరోరా చావ్లా స్టోర్‌ యజమాని. ఆయన హింసాకాండలో పాల్గొన్నట్లు ఫిరోజ్, ఖుర్షీద్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

"సీసీటీవీ ఫుటేజ్‌ సంఘటన జరిగిన రోజు సాయంత్రం వరకు మాత్రమే ఉంది. కానీ ఈ ఎఫ్ఐఆర్ రాత్రి 9 గంటలకు వచ్చిన పీసీఆర్‌ కాల్‌ ఆధారంగా రాశాం. ఆ సమయంలో సీసీటీవీ ఫుటేజ్‌ అందుబాటులో లేదు" అని పోలీసులు కోర్టుకు తెలిపారు.

ఎఫ్‌ఐఆర్‌ నమోదైన 90 రోజుల్లోపు ఛార్జిషీట్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది. చట్ట విరుద్ధ కార్యక్రమాల నిరోధక చట్టం (UAPA)చట్టం కింద నమోదు చేసే కేసుల్లో 180 రోజులు వరకు సమయం ఉంటుంది.

కానీ 6 నెలలు, సంవత్సరం గడిచినా ఎఫ్‌ఐఆర్ నంబర్ 64/2020లో ఇంత వరకు ఛార్జిషీట్ దాఖలు కాలేదు.

2021 ఏప్రిల్‌లో దిల్లీ పోలీసులు ఏటీఆర్‌ (యాక్షన్‌ టేకెన్‌ రిపోర్ట్‌) దాఖలు చేయాల్సి ఉంది. ఈ నివేదిక వచ్చాక దీని మీద కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

దీనిపై పోలీసులు ఏం చెబుతారో తెలుసుకోవడానికి దయాళ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారులను బీబీసీ సంప్రదించింది.

ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన ఫిర్యాదులపై ఎందుకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని దిల్లీ పోలీస్‌ కమిషనర్‌, దిల్లీ డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ (ఈశాన్య దిల్లీ), ఆ శాఖ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌లను స్పందన కోరింది.

వారి నుంచి వచ్చిన సమాధానాన్ని ఈ కథనంలో అప్‌డేట్‌ చేస్తాం.

మదీనా మసీదు

మదీనా మసీదు కేసు

ఈశాన్య దిల్లీలోని శివ్‌విహార్‌ ప్రాంతంలో జరిగిన అల్లర్లలో ఎక్కువగా దహనాలు జరిగాయి. ఇక్కడి మదీనా మసీదు అగ్నిప్రమాదం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మసీదులో కాల్పులు, విధ్వంసం జరిగినట్లు మసీదు నిర్వహణ కమిటీ సభ్యుడు హాజీ హషీమ్‌ జూన్‌ 26న కరవాల్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఫిబ్రవరి 25 సాయంత్రం 5.45 గం.ల సమయంలో మసీదులోకి 20 నుంచి 25 ప్రవేశించారని చెప్పిన ఆయన వారిలో కొందరి పేర్లను కూడా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ ఈ కేసులో కూడా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు.

మరి ఈ కేసులో ఫిర్యాదు చేయడానికి హషీమ్‌ జూన్‌ వరకు ఎందుకు ఆగారు ?వాస్తవానికి హషీమ్ అలీ ఇల్లు అల్లర్లలో ధ్వంసమైంది. ఆయన ఇంటిని కొందరు దుండగులు తగలబెట్టారు.

దీనిపై ఆయన కరవాల్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇందులో కూడా కొందరి పేర్లను ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కానీ కరవాల్‌నగర్‌ పోలీసులు ఈ ఫిర్యాదును నరేశ్‌ చంద్‌ అనే వ్యక్తి పేరుతో ఉన్న ఎఫ్ఐఆర్-72కు చేర్చారు. అంటే హషీమ్ అలీ ఫిర్యాదు వేరొక పేరుతో నమోదైంది.

నరేశ్‌ చంద్‌ ఎఫ్‌ఐఆర్‌లో అల్లర్ల పేరు ప్రస్తావించ లేదు. ఈ రెండు కేసులు తమ ఆస్తుల ధ్వంసానికి సంబంధించిన ఫిర్యాదులు.

2020 ఏప్రిల్‌ 4న పోలీసులు హషీమ్‌ అలీని ఆయన బంధువుల ఇంట్లో ఉండగా అరెస్టు చేశారు. అది కూడా ఎఫ్‌ఐఆర్‌ నంబర్‌ 72 ప్రకారం, హషీమ్‌ అలీ ఇంటిని తగలబెట్టినట్లు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ అరెస్టు చేశారు. అంటే హషీమ్‌ అలీ తన ఇంటిని తానే తగలబెట్టుకున్న కేసులో నిందితుడు.

43 రోజుల తర్వాత బెయిల్‌ వచ్చాక, జూన్‌లో మదీనా మసీదులో జరిగిన హింస, దహనాల గురించి హషీమ్ అలీ ఫిర్యాదు చేశారు. కానీ ఫిర్యాదు చేసిన రెండు నెలల తర్వాత కూడా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయాలేదు.

కోర్టులో సమర్పించిన స్టేటస్‌ రిపోర్ట్‌లో హషీమ్ అలీ మదీనా మసీదు గురించి చేసిన ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తులపై ఎలాంటి ఆధారాలు కనుగొనలేక పోయామని పోలీసులు కోర్టుకు తెలిపారు.

అలాగే హషీమ్ అలీ ఇంటిని తగలబెట్టినట్లు వచ్చిన ఫిర్యాదును నరేశ్‌ చంద్‌ ఎఫ్ఐఆర్‌లో చేర్చామని, ఇందులో హషీమ్ అలీ నిందితుడని పోలీసులు తెలిపారు.

మదీనా మసీదులో హింస, దహనాలపై ఫిర్యాదుదారుడు చెప్పిన విషయాలకు ఎటువంటి వీడియో ఫుటేజీ ఆధారాలు అందించలేదని, కాబట్టి ఈ ఫిర్యాదును కూడా FIR-72కు చేర్చామని పోలీసులు చెప్పారు.

అంటే హషీమ్‌ అలీ ఇంటిని తగలబెట్టినట్లు చేసిన ఫిర్యాదు నరేశ్‌చంద్‌ అనే వ్యక్తి షాపు, కారును తగలబెట్టిన ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. ఇప్పుడు ఈ ఎఫ్‌ఆర్‌ను మదీనా మసీదు కేసుకు కూడా అనుబంధంగా చేర్చారు.

పోలీసులతో సంబంధం లేకుండా ప్రత్యేక ఎఫ్‌ఐఆర్‌ను దాఖలు చేయాలని ఈ ఏడాది ఫిబ్రవరి 1న కరవాల్‌ నగర్‌ ఎస్‌హెచ్‌ఓను మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది.

దిల్లీ అల్లర్ల బాధితురాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దిల్లీ అల్లర్ల బాధితురాలు

పోలీసులు ఏం చెబుతున్నారు ?

కరవాల్‌ నగర్‌ ఎస్‌హెచ్‌ఓ రామ్‌ అవతార్‌ను బీబీసీ ఫోన్‌ ద్వారా సంప్రదించింది. కోర్టు సూచనల మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారా అని అడిగింది.

అల్లర్ల తర్వాత చాలా ఎఫ్‌ఐఆర్‌లు వచ్చాయి. వాటిలో ఒకదానినొకటి చేర్చి దర్యాప్తు చేస్తున్నాము. మదీనా మసీదు, హషీమ్ అలీకి సంబంధించిన ఎఫ్ఐఆర్‌ల విషయంలో మేం ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాతే ఆయన ఫిర్యాదు చేశారు” అని పోలీసులు చెప్పారు.

మదీనా మసీదు గురించి ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఆ విషయం కోర్టుకు ఎందుకు తెలియజేయలేదని బీబీసీ ప్రశ్నించింది.

అలాగే కరవాల్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇంఛార్జ్‌ మదీనా మసీదు దహనం దర్యాప్తులో ఏం కనుగొన్నారని కూడా బీబీసీ తెలుసుకునే ప్రయత్నం చేసింది.

“మేం కోర్టుకు చెప్పలేదు. కానీ ఫిర్యాదు మాత్రం ఉంది ” అని ఎస్‌హెచ్‌వో బీబీసీతో అన్నారు. కానీ పోలీసులు ప్రత్యక్ష సాక్షులు చేసిన ఫిర్యాదులకన్నా పీసీఆర్‌ కాల్‌కు వచ్చిన సమాచారం ఆధారంగానే ఎఫ్‌ఐఆర్‌ను దాఖలు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)