వసీం జాఫర్ జట్టులో ముస్లిం ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారా? మతతత్వాన్ని వ్యాప్తి చేశారా? ఈ ఆరోపణల్లో నిజం ఎంత?

భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్‌
ఫొటో క్యాప్షన్, భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్‌
    • రచయిత, అనంత్ ప్రకాశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఉత్తరాఖండ్ క్రికెట్ జట్టులో మతధోరణులను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. జాఫర్‌కు మద్దతుగా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే గురువారం ట్వీట్ చేశారు.

ఆటగాళ్ల ఎంపిక విషయంలో నిర్వాహకులతో విభేదాలు తలెత్తడంతో జాఫర్ కొద్ది రోజుల క్రితమే తన కోచ్ పదవికి రాజీనామా చేశారు.

కోచ్‌తో అనుచితంగా ప్రవర్తిస్తూ, తన సలహాలు పాటించనప్పుడు ఆ పదవిలో ఉండి ఏం లాభం? అంటూ జాఫర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

గురువారం విలేఖరుల సమావేశంలో జాఫర్ మాట్లాడుతూ తనపై వచ్చిన మతతత్వ ఆరోపణలను ఖండించారు.

ఈ అంశానికి సంబంధించిన అన్ని వివరాలను వసీం జాఫర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు .

అనిల్ కుంబ్లే జాఫర్‌కు తన మద్దతు తెలుపుతూ.."నేను మీతోనే ఉన్నాను. మీరు మంచి పని చేశారు. మిమ్మల్ని కోచ్‌గా కోల్పోయిన ఆటగాళ్లు దురదృష్టవంతులు" అంటూ ట్వీట్ చేశారు.

కుంబ్లేతో పాటూ మనోజ్ తివారీ, డీ గణేష్, ఇర్ఫాన్ పఠాన్‌లాంటి పలువురు ఆటగాళ్ళు వసీం జాఫర్‌కు మద్దతుగా ట్వీట్లు చేశారు.

క్రికెటర్లే కాకుండా చాలా మంది స్పోర్ట్స్ జర్నలిస్టులు, విశ్లేషకులు కూడా సోషల్ మీడియాలో వసీం జాఫర్‌కు మద్దతు తెలిపారు.

వసీం జాఫర్ మీద ఇలాంటి ఆరోపణల వలన ఉత్తరాఖండ్ టీంకే నష్టం కలుగుతుందని, వారు మంచి కోచ్‌కు కోల్పోతారని వీరంతా అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి మహిం వర్మ కూడా వసీం జాఫర్‌పై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని అన్నారు.

వీరందరి అభిప్రాయాలు విన్నాక.. అసలు వసీం జాఫర్‌పై మతతత్వ ఆరోపణలు ఎలా వచ్చాయన్న సందేహం కలుగుతుంది.

కుంబ్లే, తివారీతో సహా పలువురు ఆటగాళ్లు వసీంకు మద్దతు తెలిపారు
ఫొటో క్యాప్షన్, కుంబ్లే, తివారీతో సహా పలువురు ఆటగాళ్లు వసీంకు మద్దతు తెలిపారు

జాఫర్ మీద వచ్చిన ఆరోపణలేమిటి?

జాఫర్ జట్టులో ముస్లిం ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని, డ్రెసింగ్ రూమ్‌లోకి మతాధికారులను ఆహ్వానిస్తున్నారని జాఫర్‌పై ఆరోపణలు వచ్చాయి.

అంతర్జాతీయ భారత క్రికెట్ జట్టులో ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా ఆడిన వసీం జాఫర్ దేశీయ క్రికెట్ మ్యాచుల్లో కూడా పెద్ద పాత్ర పోషించారు. రంజి ట్రోఫీనుంచి ఇరానీ ట్రోఫీ వరకు మంచి ప్రదర్శనలు ఇచ్చి రాణించారన్న రికార్డ్ ఉంది.

రంజిలో 12,000 పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా, అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్‌గా వసీం జాఫర్ రికార్డులు నెలకొల్పారు.

ముంబై, విదర్భ తరపున ఆడిన జాఫర్ 150 కన్నా ఎక్కువ మ్యాచులు ఆడిన తొలి క్రికెటర్‌ కూడా. ఆటగాడిగానే కాకుండా మంచి కోచ్‌గా కూడా పేరు తెచ్చుకున్నారు.

అయితే ఉత్తరాఖండ్ జట్టు కోచ్‌గా జాఫర్ రాజీనామా చేసిన తరువాత తనపై మతతత్వ ఆరోపణలు వచ్చాయి. స్థానిక వార్తాపత్రికల్లో ఈ అంశంపై కథనాలు వచ్చాయి.

వీటన్నిటికీ జాఫర్ సమాధానం ఇవ్వడంతో, ఇప్పుడు ఈ వార్త దేశవ్యాప్తంగా ముఖ్యాంశాల్లోకెక్కింది.

ఈ అంశంపై మహిం వర్మతో బీబీసీ మాట్లాడింది. ఇవన్నీ నిరాధారమైనవని ఆయన పేర్కొన్నారు.

"నేను కూడా వార్తా పత్రికలు చూసే విషయం తెలుసుకున్నాను. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు. జాఫర్ అలాంటి వ్యక్తి అయితే ఆయన్ని నేనెందుకు కోచ్‌గా తీసుకొస్తాను? ఆయన అలాంటి వ్యక్తి కాదు" అని మహిం అన్నారు.

వసీం జాఫర్‌పై అధికారికంగా ఏ ఫిర్యాదులూ లేవు

వసీం జాఫర్ జట్టులో ముస్లింలకు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా, జట్టు దాన్ని వ్యతిరేకించినట్లుగా ఎప్పుడైనా వార్తలొచ్చాయా అనే ప్రశ్నకు మహిం జవాబిస్తూ.."అలాంటివేమైనా జరిగినట్టు నాకు తెలీదు. నా కళ్లతో చూడలేదు, చెవులతో వినలేదు. జాఫర్‌పై నాకు ఎప్పుడూ లిఖితపూర్వక ఫిర్యాదులేం రాలేదు" అని తెలిపారు.

ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ కోశాధికారి పృథ్వీ సింగ్ నేగి కూడా ఫిబ్రవరి 9 వరకు జాఫర్‌పై ఎలాంటి ఫిర్యాదులూ రాలేదు అని స్పష్టం చేశారు.

"ఇది చాలా దురదృష్టమైన సంఘటన. అలా జరిగే సమస్యే లేదు. జాఫర్‌పై అలాంటి ఫిర్యాదులేమైనా ఉంటే వెంటనే అపెక్స్ కౌన్సిల్‌లో దాఖలు చేసి ఉండేవారు. ఫిబ్రవరి 9 వరకు అలాంటి ఫిర్యాదులేమీ రాలేదు. నేను కౌన్సిల్ సభ్యుడిని. తనపై ఎలాంటి ఫిర్యాదులూ రాలేదని కచ్చితంగా చెప్పగలను" అని ఆయన తెలిపారు.

మహిం వర్మగానీ, పృథ్వీ సింగ్‌గానీ ఫిర్యాదు చేయకపోతే మరెవరు చేశారు? జాఫర్‌పై ఎందుకు ఇలాంటి ఆరోపణలు వచ్చాయి?

నవనీత్ మిశ్రా

ఫొటో సోర్స్, @navneetkumishra

ఫొటో క్యాప్షన్, నవనీత్ మిశ్రా

నవనీత్ మిశ్రా ఎవరు?

ఉత్తరాఖండ్ టీం మేనేజర్ నవనీత్ మిశ్రా జాఫర్‌పై మతతత్వ ఆరోపణలు చేశారని మహిం వర్మ తెలిపారు. నవనీత్ మిశ్రానే ఈ విషయాలన్నిటినీ మొట్టమొదట మీడియాకు తెలియజేశారని ఆయన అన్నారు.

"నేను నవనీత్ మిశ్రాను లిఖితపూర్వకంగా ఫిర్యాదు రాసి ఇవ్వమన్నాను. ఇలాంటివి జరుగుతుంటే అప్పుడే ఎందుకు ఖండించలేదు? వెంటనే నాకెందుకు సమాచారం ఇవ్వలేదు? అని అడిగాను" అని మహిం చెప్పారు.

అసలేం జరిగిందని నవనీత్ మిశ్రాను ప్రశ్నించగా.. "నాకు ఒక విలేఖరి నుంచి ఫోన్ వచ్చింది. మౌల్వీ (ముస్లిం మతాధికారి) నాలుగైదు సార్లు వచ్చిన మాట నిజమేనా? అని అడిగారు. నాలుగైదు సార్లు కాదు, రెండు సార్లే వచ్చారు అని నేను చెప్పాను. అంతకుమించి ఒక్క మాట కూడా అదనంగా నేను మాట్లాడలేదు" అని ఆయన తెలిపారు.

అయితే, ఈ విషయాలనే కౌన్సిల్‌కు ఎందుకు తెలియపరచలేదు అని అడిగితే.. "ఆ టూర్ పూర్తయిన తరువాత అన్ని వివరాలు నా రిపోర్ట్‌లో రాసివ్వగలను కానీ ముందే ఇవన్నీ ఎలా చెప్పగలను? జాఫర్ జట్టులో మతతత్వ ధోరణులు ప్రేరేపిస్తున్నారనే విషయలేవీ నేను మీడియాకు చెప్పలేదు" అని మిశ్రా తెలిపారు.

మరి మీడియాలో అలా ఎందుకు రాశారు? ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్, సంబంధిత వార్తాపత్రికపై చర్యలు తీసుకుంటుందా? ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు జాఫర్‌పై ఆరోపణలు చేశారంటూ ప్రచురించిన వార్తాపత్రిక ఆ వాస్తవాలను బయటపెడుతుందా?

ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరకడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ ఆరోపణల ఆధారంగా వసీం జాఫర్‌ను ట్రోల్ చేస్తున్నారు.

సామాజిక ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు

"ఇది చాలా దురదృష్టకరమని" ఒకప్పుడు వసీం జాఫర్‌కు కోచ్‌గా వ్యవహరించిన భారత మాజీ క్రికెటర్ కర్సన్ ఘావ్రీ అభిప్రాయపడ్డారు.

"వసీం అలాటి వ్యక్తి కాదు. క్రికెట్ విషయంలో తను చాలా నిజాయితీపరుడు. ముంబైకు, భారతదేశానికి క్రికెట్‌లో ప్రాతినిధ్యం వహించాడు. జట్టుకు ఏది మంచిదో అదే చేస్తాడు" అని ఆయన అన్నారు.

"క్రికెట్‌కు మతం లేదు. క్రికెట్టే ఒక మతం. భారతదేశ క్రికెట్ జట్టులో అన్ని మతాలవారు ఉన్నారు. భారతదేశంలో క్రికెట్ విషయంలో మత ప్రాతిపదికన ఎప్పుడూ ఎవరికీ ఎలాంటి ప్రాధాన్యతా ఇవ్వలేదు. అలా ఇచ్చుంటే నవాబ్ పటౌడీ, ముస్తాక్ అలీ, ఇఫ్తీఖర్ ఖాన్ అలీ పటౌడీలాంటి పెద్ద పెద్ద ఆటగాళ్లు అసలు జట్టులోకే వచ్చుండేవారు కాదు.

వసీం నాకు బాగా తెలుసు. తను ఆడుతున్నప్పుడు నేను కోచ్‌గా ఉన్నాను. తను అలాంటి వ్యక్తి కానేకాదు" అని ఆయన తెలిపారు.

వసీం జాఫర్ ఆటను దగ్గరనుంచీ గమనించిన జర్నలిస్ట్ విజయ్ లోకపల్లి.."ఇది జాఫర్ సామాజిక ప్రతిష్టకు భంగం కలిగించే చర్య" అని అన్నారు.

"ఒక క్రికెట్ అసోసియేషన్ ఏదైనా చెప్తే, చాలామంది దాన్ని నమ్ముతారు. వసీం జాఫర్ చెప్తే ఎవరు వింటారు? అసలు జాఫర్ ఏం చెప్పారో ఎంతమంది చదువుతారు? ఆటగాళ్లపై ఇలాంటి ఆరోపణలు చెయ్యడం చాలా తప్పు" అని విజయ్ అభిప్రాయపడ్డారు.

ఉత్తరాఖండ్ క్రికెట్ జట్టు కోచ్‌గా వసీం జాఫర్ రాజీనామా చేశారు
ఫొటో క్యాప్షన్, ఉత్తరాఖండ్ క్రికెట్ జట్టు కోచ్‌గా వసీం జాఫర్ రాజీనామా చేశారు

జట్టు నిర్వహణకు సంబంధించిన వివాదం

కొన్నాళ్ల క్రితం ఉత్తరాఖండ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన వసీం జాఫర్, క్రికెట్ అసోసియేషన్‌తో వివాదాలు తలెత్తడంతో తన పదవికి రాజీనామా చేశారు.

మహిం వర్మ నుంచీ నవనీత్ మిశ్రా వరకూ అందరూ.. జాఫర్ దురుసుగా మాట్లాడారని ఆరోపించారు.

జట్టు నిర్వహణకు సంబంధించిన అన్ని అరోపణలకూ వసీం జాఫర్ జవాబిచ్చారు.

"ఇది చాలా విచారకరమైన విషయం. మనసు ముక్కలైపోయింది. నేను శ్రద్ధగా పనిచేశాను. ఉత్తరాఖండ్ కోచ్‌గా నా సమయం, దృష్టి అన్నీ జట్టుపైనే కేంద్రీకరించాను. సరైన ఆటగాళ్లనే జట్టులోకి తీసుకుని, వాళ్లను ప్రోత్సహించాలనుకున్నాను. ప్రతీ చిన్న విషయానికీ పోరాడాల్సి వచ్చేది. సెలెక్టర్లు ఎంత ఎక్కువగా జోక్యం చేసుకునేవారంటే, సామర్థ్యం లేనివాళ్లను కూడా జట్టులోకి తీసుకుని ముందుకు నెట్టేవారు.

చివరికి నాకు చెప్పకుండానే విజయ్ హజారే ట్రోఫీకి జట్టును ఎంపిక చేశారు. కెప్టెన్‌ను మార్చేశారు. 11 మంది ఆటగాళ్లను మార్చేసారు. పరిస్థితి ఇలా ఉంటే ఎవరు పని చేయగలరు? నేనే జట్టును ఎన్నుకోవాలని అనడం లేదు. కానీ నా సలహా కూడా అడగకుండా జట్టు ఎంపిక చేస్తే, మరింక నేనెందుకు అక్కడ ఉండడం?" అని జాఫర్ ఏఎన్ఐ వార్తా సంస్థకు చెప్పారు.

ఈ అంశంలో మత కోణం గురించి ప్రస్తావిస్తూ.. "ఇలా ఇక్కడ కూర్చుని మతం గురించి మాట్లాడాల్సి రావడం చాలా బాధకరం. 15-20 ఏళ్లు క్రికెట్ ఆడుతున్న ఒక వ్యక్తి ఇలాంటివన్నీ వినాల్సి వస్తోంది. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు. ఇతర సమస్యలను దాచి పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు. నేను ఎంతో ఆత్మగౌరవంతో, నిజాయితీగా క్రికెట్ ఆడాను. నేను సంతోషంగా లేను కాబట్టే రాజీనామా చేశాను. నేను మతతత్వాన్ని వ్యాప్తి చేసి ఉంటే నన్ను పదవినుంచీ ఎప్పుడో తొలగించేవారు. కానీ నేను రాజీనామా చేసిన తరువాత నా మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు" అని జాఫర్ అన్నారు.

క్రికెట్ నిర్వాహకులకు, కోచ్‌లకు మధ్య వివాదాలు తలెత్తడం కొత్తేం కాదుగానీ ఇలాంటి ఆరోపణలు ఇంతకుముందు ఎవరైనా ఎదుర్కొన్నారా అనేది ఆలోచించాల్సిన విషయం.

ఇలాంటి ఆరోపణలు గతంలో ఎవరూ ఎదుర్కోలేదని విజయ్ లోకపల్లి తెలిపారు.

"నిర్వాహకులకు, కోచ్‌కు, ఆటగాళ్లకు మధ్య వివాదాలు తలెత్తుతూ ఉంటాయి. ఇది సాధారణమైన విషయమే. గతంలో అనేకసార్లు ఇలాంటివి జరిగాయి. కానీ, ఒక వార్తాపత్రిక నుంచీ ఫోన్ రావడం, తరువాత ఈ విషయలన్నీ బయటకు రావడం.. ఇదంతా వింతగా ఉంది. అలాంటివి జరుగుతున్నప్పుడు వీరంతా ఏం చేశారు? ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పుడు జాఫర్ రాజీనామా చేశాక ఈ వివాదాలు ఎందుకు రేపుతున్నారు? ఇలాంటివి జరుగుతున్నాయి అని తెలిసినప్పుడే జాఫర్‌ను తొలగించాల్సింది. ఇప్పుడెందుకు ఇవన్నీ బయటికొస్తున్నాయి?" అని విజయ్ ప్రశ్నించారు.

అనిల్ కుంబ్లే నుంచి మనోజ్ తివారీ వరకూ పలువురు ఆటగాళ్లు జాఫర్‌కు మద్దతు తెలుపుతున్నారు.

"ఇలాంటివాటికి మీరు సంజాయిషీ ఇచ్చుకోవడం బాధాకరం" అని ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ తరువాత ఇర్ఫాన్‌ను కూడా జనం ట్రోల్ చెయ్యడం మొదలుపెట్టారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)