స్లెడ్జింగ్ వివాదం: క్షమాపణలు చెప్పిన ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పెయిన్

టిమ్ పెయిన్, స్టీవ్ స్మిత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టిమ్ పెయిన్, స్టీవ్ స్మిత్

సిడ్నీ టెస్ట్ చివరి రోజు భారత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా క్రీజ్‌ను నాశనం చేశాడనే ఆరోపణలకు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ షాక్ అయ్యాడు.

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆ రోజు డ్రింక్స్ బ్రేక్ సమయంలో స్టంప్ కెమెరా దగ్గర క్రీజ్ తుడిపేస్తూ కనిపించాడు. అయితే ఉద్దేశపూర్వకంగా భారత బ్యాట్స్‌మెన్ పెట్టుకున్న బ్యాటింగ్ గార్డ్‌ గుర్తును తుడిపాడనే ఆరోపణలను స్టీవ్ స్మిత్ నిరాకరించారు.

తనపై వచ్చిన ఆరోపణలపై స్మిత్ న్యూస్ కార్ప్‌తో మాట్లాడాడు.

"మేం ఎక్కడ బౌలింగ్ చేస్తున్నాం అనేది నేను చూస్తున్నాను. భారత బ్యాట్స్‌మెన్ మా బౌలర్లను ఎలా ఎదుర్కుంటున్నారు అనేది చూసే ప్రయత్నం చేశాను. నా అలవాటు ప్రకారం సెంటర్‌ను మార్క్ చేశాను" అన్నాడు.

భారత బ్యాటింగ్‌పై ప్రశంసలు కురిపించిన స్మిత్.. "సిడ్నీ టెస్ట్ చివరి రోజు భారత బ్యాట్స్‌మెన్స్ చాలా బాగా ఆడారు కానీ, మిగతా ఘటనలపై ఎక్కువగా చర్చ జరగడం బాధ కలిగించింది" అన్నాడు.

స్మిత్ భారత బ్యాట్స్‌మెన్ గార్డ్ గుర్తును మార్చలేదని, ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పెయిన్ అంతకు ముందు అతడిని వెనకేసుకొసుకొచ్చాడు. అయితే, ఈ ఆరోపణలతో స్మిత్ మీద సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.

"తను అలా చేసుంటే భారత ఆటగాళ్లు దాన్ని కచ్చితంగా ఇష్యూ చేసేవారు. మాకు తెలిసి స్మిత్ అలా చేస్తుంటాడు. తను క్రీజ్ దగ్గరికి వెళ్లి బ్యాటింగ్ ఎలా చేయచ్చనేది ఊహిస్తుంటాడు. అదే సమయంలో ఎప్పుడూ సెంటర్ గార్డ్ కూడా పెడుతుంటాడు" అని పెయిన్ అన్నాడు.

సిడ్నీ టెస్ట్ చివరి రోజు భారత బ్యాట్స్‌మెన్లు అద్భుతంగా ఆడి మ్యాచ్‌ను డ్రా చేశారు. దాంతో రెండు జట్లు 1-1తో సమానంగా ఉన్నాయి. సిరీస్ నిర్ణయాత్మక టెస్ట్ మ్యాచ్ శుక్రవారం నుంచి బ్రిస్బేన్‌లో జరుగుతుంది.

టిమ్ పెయిన్, అశ్విన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టిమ్ పెయిన్, అశ్విన్

2018లో బాల్ ట్యాంపరింగ్ వివాదంతో స్మిత్‌ను కెప్టెన్‌గా తొలగించారు. అతడిపై దాదాపు ఏడాదిపాటు నిషేధం విధించారు.

సిడ్నీ టెస్ట్ చివరి రోజు రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, డ్రింక్స్ బ్రేక్ సమయంలో స్మిత్ బ్యాటింగ్ చేస్తున్నట్టు ఊహించుకోవడం కనిపించింది. అదే సమయంలో రిషబ్ పంత్ పెట్టుకున్న గార్డ్ గుర్తు చెరిగిపోయింది. దాంతో క్రీజులోకి తిరిగి వచ్చిన పంత్ మళ్లీ అంపైర్‌ను అడిగి గార్డ్ తీసుకున్నాడు.

బ్రేక్‌లో వెళ్లినపుడు పంత్ 97 పరుగుల దగ్గర ఆడుతున్నాడు. తను క్రీజులోకి తిరిగి వచ్చి, మళ్లీ అంపైర్‌ను గార్డ్ అడిగిన తర్వాత అదే స్కోర్ దగ్గర అవుట్ అయిపోయాడు.

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఈ ఘటనను 'చాలా చాలా చెత్తగా' చెప్పాడు.

అందరూ దానిని అలా చూడడంతో స్మిత్ చాలా బాధపడ్డాడని ఆస్ట్రేలియా కెప్టెన్ పెయిన్ అన్నాడు.

రిషబ్ పంత్

ఫొటో సోర్స్, EPA/DEAN LEWINS

ఫొటో క్యాప్షన్, రిషబ్ పంత్

"తను ప్రతి మ్యాచ్‌లో ఇలాగే చేస్తాడు. ఒకరోజు ఆటలో ఐదు నుంచి ఆరు సార్లు అలా చేస్తుంటాడు. అతడికి బ్యాటింగ్ ఊహించుకోవడం అంటే ఇష్టం. సిడ్నీ టెస్ట్ చివరి రోజు మీరు తను ఎడమ చేత్తో అలా బ్యాటింగ్ చేయడం చూసుంటారు. ఎందుకంటే నాథన్ లయన్ ఎక్కడ బంతి వేస్తున్నాడు అనేది తను తెలుసుకోవాలని అనుకున్నాడు. అది తన పద్ధతి" అని పెయిన్ అన్నాడు.

ఆ ఇన్నింగ్స్‌లో పంత్ 97 పరుగులు చేయడంతో భారత్ ఒక సమయంలో 407 పరుగులు సాధించేలా కనిపించింది. అయితే, తర్వాత భారత్ ఐదు వికెట్లకు 334 పరుగులే చేసి మ్యాచ్‌ను డ్రా చేయగలిగింది.

ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను అతడు ప్రభావితం చేయాలనుకున్నాడా, లేదా అనేది స్వయంగా స్మిత్ మాత్రమే చెప్పగలడు అని ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ అన్నాడు.

"స్మిత్ ఊహాత్మకంగా బ్యాటింగ్ చేస్తున్నాడని, తను సాధారణంగా అలా చేస్తుంటాడని, అది అతడి అలవాటని మీరు అనవచ్చు. లేదంటే అవుట్ అయిపోయేలా రిషబ్ పంత్ దృష్టి మళ్లించడానికి తను ప్రయత్నించాడని చెప్పవచ్చు" అని వోక్స్ అన్నాడు.

గురువారం నుంచి శ్రీలంకలో మొదలవుతున్న టెస్ట్ సిరీస్‌లో ఆడనున్న క్రిస్ ఓక్స్ శ్రీలంక నుంచి ఫోన్లో మాట్లాడాడు.

"వేల మైళ్ల దూరంలో ఇక్కడ నుంచి తను భారత బ్యాట్స్‌మెన్ దృష్టి మళ్లించడానికి అలా చేస్తున్నాడని చెప్పడం కష్టం. ఇలాంటివి జరగడం నేను ఇంతకు ముందు కూడా చూశాను. చాలాసార్లు వాటిపై దృష్టి వెళ్లదు. కానీ, సిడ్నీ టెస్ట్ చివరి రోజు చాలా ఉత్కంఠగా ఉండడంతో, దానిపై ప్రజల దృష్టి పడింది" అన్నాడు.

టిమ్ పెయిన్, అశ్విన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టిమ్ పెయిన్, అశ్విన్

మరోవైపు ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పెయిన్, చివరి రోజు ఆర్.అశ్విన్‌తో తన ప్రవర్తనకు క్షమాపణ చెప్పాడు.

భారత్ రెండో ఇన్నింగ్స్‌లో టిమ్ పెయిన్ మూడు క్యాచ్‌లు వదిలేశాడు. అశ్విన్‌ను అతడు స్లెడ్జింగ్ చేయడం కూడా స్టంప్ మైక్రోఫోన్‌లో వినిపించింది.

మ్యాచ్ మూడో రోజు అంపైర్‌తో విభేదించి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత కూడా ఎదుర్కున్న పెయిన్, సిడ్నీ టెస్ట్ చివరి రోజు తన ప్రవర్తన గురించి మాట్లాడాడు.

"నాకు జట్టుకు లీడ్ చేయడం ఎప్పుడూ గర్వంగా అనిపిస్తుంది. కానీ సోమవారం నేను చాలా చెత్త ఉదాహరణగా నిలిచాను. నా లీడర్‌షిప్ సరిగా లేదు. నేను ఒత్తిడిలో ఉన్నాను. నిన్న నేను నా జట్టు ప్రమాణాలను, అంచనాలను అందుకోలేకపోయాను" అన్నాడు.

స్టీవ్ స్మిత్ నుంచి కెప్టెన్సీ దక్కించుకున్న తర్వాత టిమ్ పెయిన్ జట్టును లీడ్ చేస్తున్నాడు. అతడి నాయకత్వంలో జట్టు ప్రవర్తన మెరుగుపడిందని భావిస్తున్నారు.

"నేను కూడా మనిషినే, సోమవారం నేను చేసిన తప్పులకు క్షమాపణ అడుగుతున్నా. గత 18 నెలలుగా మా క్రీడా స్ఫూర్తి ఉన్నతంగానే ఉంది. కానీ, సిడ్నీ టెస్ట్‌ చివరి రోజు మేం దాన్నుంచి కాస్త కిందికి జారాం" అని టిమ్ పెయిన్ అన్నాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)