Arnab Goswami: బాంబే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసిన అర్ణబ్ గోస్వామి - BBC Newsreel

అర్ణబ్ గోస్వామి

ఫొటో సోర్స్, Getty Images

తనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్ణబ్ గోస్వామి మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

అర్ణబ్ గోస్వామి పిటిషన్లో మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబయి పోలీస్, కేంద్ర ప్రభుత్వం, ఇతరులను ప్రతివాదులుగా చేర్చారు.

సోమవారం అర్ణబ్ గోస్వామి, మరో ఇద్దరికి మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి బాంబే హైకోర్టు నిరాకరించింది. బెయిల్ కోసం ఆయన దిగువ కోర్టుకు వెళ్లాలని సూచించింది.

జస్టిస్ ఎస్ఎస్ షిండే, జస్టిస్ ఎంఎస్ కార్నిక్‌ల డివిజన్ బెంచ్ హైకోర్టు అసాధారణ పరిధిని ఏ కేసులోనూ అమలు చేయలేమని అభిప్రాయపడింది.

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గోస్వామి, మరో ఇద్దరి బెయిల్ పిటిషన్లపై హైకోర్టు విచారిస్తోంది. అన్వయ్ నాయక్ 2018 మేలో ఆత్మహత్య చేసుకున్నారు.

నాయక్ తన సూసైడ్ నోట్‌లో గోస్వామి తనకు బకాయిలు చెల్లించలేదని ఆరోపించారు.

తన అరెస్టును సవాలు చేస్తూ ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని అర్ణబ్ గోస్వామి వేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు తన తీర్పును నవంబర్ 7కు రిజర్వ్ చేసింది.

గత వారం గోస్వామితో పాటూ ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరిని నిందితులుగా చేర్చారు. ఒక దిగువ కోర్టు ముగ్గురినీ 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపింది.

నవంబర్ 4న ముంబయి పోలీసులు గోస్వామిని ఆయన ఇంట్లో అరెస్ట్ చేశారు. ఆ సమయంలో పోలీసు అధికారులు తనతోపాటూ, తన అత్తమామలు, భార్య, కొడుకుపై దాడి చేశారని అర్ణబ్ ఆరోపించారు.

2019లో క్లోజ్ చేసిన ఈ ఆత్మహత్య కేసుపై నాయక్ భార్య అక్షత కోర్టుకు వెళ్లడంతో సెప్టెంబరులో ఈ ఆత్మహత్య కేసును రీ-ఓపెన్ చేశారు. తాజాగా నాయక్ కూతురి ఫిర్యాదుతో మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఈ కేసు రీ ఇన్వెస్టిగేషన్‌కు ఆదేశించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)