ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్: ‘మానవ హక్కుల పేరుతో చట్టాలను అతిక్రమించకూడదు’ – భారత హోం శాఖ BBC Newsreel

ఆమ్నెస్టీ ఇండియా

ఫొటో సోర్స్, Reuters

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థపై తీసుకున్న చర్యలను భారత ప్రభుత్వం సమర్థించింది. ''ఆమ్నెస్టీ వాదన, ప్రకటనలు దురదృష్టకరం. అవి నిజాలకు చాలా విరుద్ధంగా ఉన్నాయి''అని కేంద్ర హోం శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

నిజం ఏమిటంటే అని చెబుతూ..''విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) కింద ఒకసారి మాత్రమే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనుమతి తీసుకుంది. అది కూడా 20ఏళ్ల క్రితం(19.12.2000). ఆ తర్వాత ఏఫ్‌సీఆర్‌ఏ అనుమతి కోసం ఆమ్నెస్టీ పెట్టుకున్న అభ్యర్థనలను వరుసగా ప్రభుత్వాలు తిరస్కరిస్తూ వచ్చాయి. ఎందుకంటే చట్ట ప్రకారం.. అనుమతి పొందే అర్హత వారికి లేదు'' అని ప్రకటనలో పేర్కొంది.

''అయితే, ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనల నుంచి తప్పించుకునేందుకు... భారత్‌లో నమోదైన నాలుగు సంస్థలకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) రూపంలో ఆమ్నెస్టీ యూకే భారీగా నిధులు పంపించింది. ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతి లేకుండానే విదేశీ రుణాలను ఆమ్నెస్టీ ఇండియా కూడా అందుకుంది. ఇది ఇక్కటి చట్టాలకు విరుద్ధమైన చర్య''

''ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఇదివరకటి ప్రభుత్వాలు కూడా విదేశాల నుంచి నిధులు పొందకుండా ఆమ్నెస్టీని నియంత్రించాయి. దీంతో ఆ సమయంలోనూ తమ కార్యకలాపాలను ఆమ్నెస్టీ నిలిపేయాల్సి వచ్చింది. ఆమ్నెస్టీపై తీసుకున్న చట్టపరమైన చర్యలను ఇదివరకటి ప్రభుత్వాలు కూడా సమర్థించాయి''

''మానవతా దృక్ఫథంతో చేసిన పనులపై గొప్పలు చెప్పుకోవడం, అధికారంలో ఉన్నవారిపై విమర్శలు చేయడం ద్వారా.. చట్టాల ఉల్లంఘనల నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలని ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు భిన్న దర్యాప్తు సంస్థలు చేపడుతున్న విచారణలనూ ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తున్నారు''

''భారత్‌లో హాయిగా ఆమ్నెస్టీ తమ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు. అయితే, విదేశీ విరాళాలు పొందే సంస్థలు స్వదేశీ రాజకీయ అంశాల్లో జోక్యం చేసుకోవడాన్ని ఇక్కడి చట్టాలు అనుమతించవు. ఇక్కడి చట్టాల ముందు అందరూ సమానమే. ఇది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కు కూడా వర్తిస్తుంది''

''ప్రజాస్వామ్య దేశాలకు భారత్ మంచి ఉదాహరణ. స్వేచ్ఛగా మాట్లాడే మీడియా, స్వతంత్రంగా పనిచేసే న్యాయవ్యవస్థ ఇక్కడ ఉన్నాయి. భిన్న అంశాలపై విస్తృత చర్చలూ జరుగుతుంటాయి. ఇక్కడి ప్రభుత్వంపై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. చట్టాలను పాటించడంలో విఫలమైన ఆమ్నెస్టీ.. భారత ప్రజాస్వామ్యం, భిన్నత్వాలపై వ్యాఖ్యలు చేయడం తగదు''

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్

ఫొటో సోర్స్, Getty Images

ప్రభుత్వ కక్ష సాధింపుల వల్ల భారత్‌లో పనిచేయలేకపోతున్నాం- ఆమ్నెస్టీ

ప్రభుత్వంనుంచి ప్రతిబంధకాలు ఎదురవుతుండటంతో భారతదేశంలో తమ కార్యకలాపాలను నిలిపివేయాల్సిన పరిస్థితి తలెత్తిందని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ చెప్పింది.

మానవ హక్కుల సంఘాలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కూడా ఆమ్నెస్టీ ఆరోపించింది.

దేశంలో తమ బ్యాంకు ఖాతాలన్నిటినీ స్తంభింప జేశారని.. తమ సిబ్బందిని తొలగించాల్సి వచ్చిందని, తమ సంస్థ ప్రచారాలను, పరిశోధనా కార్యక్రమాలన్నిటినీ నిలిపేయాల్సి వచ్చిందనీ అమ్నెస్టీ తెలిపింది.

అమ్నెస్టీ చేసిన ఆరోపణలపై ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది.

"ఇండియాలో మేం ఒక అసాధారణ పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం నుంచి ఒక క్రమపద్ధతిలో బెదిరింపులు, దాడులు, వేధింపులను ఆమ్నెస్టీ ఎదుర్కుంటోంది" అని ఆ సంస్థ సీనియర్ డైరెక్టర్ ఆఫ్ రిసెర్చ్, అడ్వకసీ అండ్ పాలసీ రజత్ ఖోస్లా బీబీసీతో పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

"మానవ హక్కులను పరిరక్షించేందుకు మేము చేస్తున్న కృషిలో భాగంగా దిల్లీ అల్లర్ల విషయంలో కానీ జమ్ము-కశ్మీర్‌లో జరుగుతున్న విషయాల గురించి కానీ మేము లేవనెత్తిన ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి ఇష్టపడని ప్రభుత్వం ఇలాంటి బెదిరింపులకు, దాడులకు పాల్పడుతోంది" అని ఆయన ఆరోపించారు.

గత నెల అమ్నెస్టీ విడుదల చేసిన ఒక నివేదికలో.. ఫిబ్రవరిలో దిల్లీలో జరిగిన మతపరమైన అల్లర్ల సందర్భంగా పోలీసులు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని చెప్పింది.

ఈ ఆరోపణలకు స్పందిస్తూ "అమ్నెస్టీ నివేదిక తప్పుల తడకలతో కూడుకున్నదని, పక్షపాతంతో నిండినది" అని దిల్లీ పోలీసులు 'ది హిందూ' వార్తాపత్రికతో పేర్కొన్నారు.

భారత ప్రభుత్వం, కశ్మీర్ స్వతంత్ర్య ప్రతిపత్తిని రద్దు చేసి ఏడాదైన సందర్భంగా నిర్బంధంలో ఉన్న రాజకీయ నాయకులను, యాక్టివిస్టులు, విలేకరులను విడుదల చెయ్యాలని, అక్కడ హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసులను పునరుద్ధరించాలని అమ్నెస్టీ గత ఆగస్టు ప్రారంభంలో పిలుపునిచ్చింది.

దేశంలో అసమ్మతిని కాలరాస్తున్నారని అభివర్ణిస్తూ దానిని ఖండించినట్లు కూడా వార్తలు వచ్చాయి.

దిల్లీ అల్లర్లు

ఫొటో సోర్స్, Getty Images

అమ్నెస్టీ సంస్థ గత కొన్నేళ్లుగా ప్రభుత సంస్థల సోదాలను ఎదుర్కుంటోంది. ఈ నెలలో బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయటం వేధింపులలో చిట్టచివరి అంకమని ఆ సంస్థ అభివర్ణించింది.

ఇంతకుముందు 2016లో ఒక కార్యక్రమంలో భారత వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలపై అమ్నెస్టీ ఇండియా మీద దేశద్రోహం కేసు నమోదు చేశారు. మూడేళ్ల తరువాత కోర్టు ఆ అభియోగాలను తొలగించాలని ఆదేశించింది.

2018లో బెంగళూరులో ఆమ్నెస్టీ కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. అప్పుడు ఆర్థిక నేరాల పేరుతో ఆమ్నెస్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. అయితే కోర్టు జోక్యంతో మళ్లీ వాటిని పునరుద్ధరించుకోగలిగారని అమ్నెస్టీ తెలిపింది.

2019లో తమకు చిన్నపాటి విరాళాలు ఇచ్చే దాతల్లో కొన్ని డజన్ల మందికి ఆదాయ పన్ను విభాగం నుంచి లేఖలు వెళ్లాయని ఆమ్నెస్టీ చెప్పింది. అదే ఏడాది చివర్లో అమ్నెస్టీ కార్యాలయాలపై సీబీఐ దాడులు చేసి సోదాలు నిర్వహించింది. ఈసారి కేంద్ర హోం మంత్రిత్వశాఖ నమోదు చేసిన కేసులో ఈ దాడులు జరిగాయి.

అయితే, 2009లో కూడా ఒకసారి అమ్నెస్టీ, ఇండియాలో తన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. విదేశాలనుంచీ నిధులను స్వీకరించడానికి అవసరమైన లైసెన్సును మళ్లీ మళ్లీ తిరస్కరిస్తున్నారని అందుకే అప్పట్లో తమ సంస్థ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్టు అమ్నెస్టీ తెలిపింది.

దేశంలో విదేశీ నిధులతో నడిచే లాభాపేక్ష లేని, స్వచ్ఛంద సేవా సంస్థల విషయంలో.. ముఖ్యంగా హక్కుల సంస్థల విషయంలో భారత ప్రభుత్వాలు అనుమానంగా చూస్తుంటాయి.

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్

ఫొటో సోర్స్, Getty Images

ఆమ్నెస్టీ ఇండియా గతంలో 2009లో భారతదేశంలో కార్యకలాపాలను నిలిపివేసింది. అప్పుడు.. విదేశాల నుంచి నిధులు తెచ్చుకోవటానికి మళ్లీ మళ్లీ చేసిన విజ్ఞప్తులను ప్రభుత్వం తిరస్కరించటం అందుకు కారణమని ఆ సంస్థ చెప్పింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉంది.

గత కొన్నేళ్లుగా విదేశీ నిధుల విషయంలో నిబంధనలను కఠినతరం చేశారు. వేలాది స్వచ్ఛంద సంస్థలు విదేశాల నుంచి నిధులు అందుకోకుండా నిషేధించారు.

విదేశీ నిధులు అందుకోవడానికి సంబంధించిన నిబంధనలను అతిక్రమించిందనే అనుమానాలతో ఆమ్నెస్టీ మీద దర్యాప్తు జరుపుతున్నామని ప్రస్తుత ప్రభుత్వం ఇంతకుముందు ప్రకటించింది.

"అది పచ్చి అబద్దం. అమ్నెస్టీ ఇండియా.. దేశీయ, అంతర్జాతీయ చట్టపరమైన నిబంధలన్నిటినీ కచ్చితంగా అనుసరిస్తోంది" అని ఖోస్లా బీబీసీతో పేర్కొన్నారు.

''ఆమ్నెస్టీ 70 పైగా దేశాల్లో పని చేస్తోంది. ఇంతకుముందు మేం కార్యకలాపాలు నిలిపివేయాల్సి వచ్చింది 2016లో రష్యాలో మాత్రమే'' అని ఆయన చెప్పారు.

"ప్రస్తుత పరిణామాలపై మాకు చాలా విచారంగా ఉంది. ప్రపంచ దేశాలన్నీ జరుగుతున్న విషయాలను గమనిస్తున్నాయని ఆశిస్తాను. చాలా బాధ, విచారంతో మేము ఈ నిర్ణయాలు తీసుకోవలసి వస్తోంది" అన్నారాయన.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)