చైనా నిఘాలో రామ్‌నాథ్‌ కోవింద్‌, మోదీ, సోనియా సహా 10 వేలమంది భారతీయ ప్రముఖులు - ప్రెస్ రివ్యూ

రామ్‌నాథ్ కోవింద్, నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, PRAKASH SINGH/AFP VIA GETTY IMAGES

సరిహద్దుల్లో ఘర్షణ పడుతూనే భారత్‌పై చైనా సైబర్‌ యుద్ధాన్ని కూడా కొనసాగిస్తోందని, భారతదేశంలోనే సుమారు 10వేలమంది ప్రముఖులు, సంస్థల డేటాపై చైనా నిఘా పెట్టిందని ది ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్ ఒక కథనంలో రాసింది.

చైనా ప్రభుత్వం, కమ్యూనిస్టు పార్టీతో సంబంధమున్న జిన్హువా డేటా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అనే సంస్థ ఈ నిఘా వ్యవహారాలను పర్యవేక్షిస్తోందని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పేర్కొంది.

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, మమతా బెనర్జీ మొదలుకొని కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్మీ, నేవీ,ఎయిర్‌ఫోర్స్‌ అధినేతలు, న్యాయమూర్తులు, శాస్త్రవేత్తలు, మీడియా అధిపతులు, నటులు ఆఖరికి పేరుమోసిన నేరగాళ్లు కూడా ఈ నిఘా నేత్రం కింద ఉన్నారని ఈ కథనం తెలిపింది.

కేవలం ప్రభావవంతమైన నేతలు, అధికారులే కాక పలు సంస్థలకు సంబంధించిన డేటాపై కూడా చైనా సంస్థ నిఘా పెట్టినట్లు ఈ కథనం వెల్లడించింది.

ఓవర్సీస్‌ కీ ఇన్ఫర్మేషన్‌ డేటా బేస్‌ (OKIDB) పేరుతో ఈ నిఘా సంస్థ పని చేస్తున్నట్లు, అమెరికా, బ్రిటన్‌, జపాన్‌, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ దేశాల నుంచి డేటా నెట్‌వర్క్‌ సైంటిస్టుల ద్వార సమాచారాన్ని సేకరిస్తోందని పేర్కొంది.

కంగనా రనౌత్

ఫొటో సోర్స్, facebook/KanganaRanaut

సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో తాను కూడా డ్రగ్స్‌ తీసుకున్నానంటూ గతంలో కంగనా రనౌత్ చేసిన వీడియో రికార్డింగ్ వైరల్‌ అవుతోందని ఆంధ్రజ్యోతి పత్రిక పేర్కొంది.

యుక్తవయసులో మాదక ద్రవ్యాలకు బానిసగా మారానంటూ మార్చి నెలలో మనాలిలోని తన నివాసంలో రికార్డు చేసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోందని ఈ కథనం పేర్కొంది.

"నేను ఇంటి నుంచి పారిపోయి సినీ పరిశ్రమకు వచ్చిన తర్వాత రెండేళ్లకు స్టార్‌ను కాగలిగాను. అలాగే డ్రగ్స్‌ అలవాటున్న వ్యక్తుల చేతుల్లో చిక్కుకున్నాను" అని ఆమె ఈ వీడియోలో పేర్కొన్నట్లు ఆంధ్రజ్యోతి రాసింది.

ఆదివారం నాడు మహారాష్ట్ర గవర్నర్‌తో భేటీ కంగనా భేటీ అయ్యారు. తనకు బీజేపీ మద్దతివ్వడం దురదృష్టకరమన్న శివసేన మంత్రి సంజయ్‌ రౌత్ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు కంగనా.

బాలీవుడ్‌లో 99శాతం మంది డ్రగ్స్‌కు బానిసలేనని కంగనా కొన్నాళ్లుగా ఆరోపిస్తున్నారని ఈ కథనం పేర్కొంది.

కొత్త జంట

‘మన పెళ్లికి అంత దూరం రాలేను మీరే రండి’ అన్న వధువు - సరేనన్న వరుడు

కరోనా విధుల కారణంగా ఒక్క రోజు కూడా సెలవు పెట్టడానికి ఇష్టపడని ఓ ఐఏఎస్‌ అధికారిణి తన పెళ్లి కూడా ఇదే ఆదర్శాన్ని పాటించారని నమస్తే తెలంగాణ పత్రిక రాసింది.

ఈ కథనం ప్రకారం హైదరాబాద్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి జల్లి కీర్తి అసోంలో కఛార్‌ జిల్లాలో పని చేస్తున్నారు. పుణెకు చెందిన ఆదిత్య శశికాంత్‌తో హైదరాబాద్‌లో వివాహం జరగాల్సి ఉంది.

అయితే అసోంలో కేసులు విపరీతంగా పెరుగుతున్న ఈ పరిస్థితుల్లో విధులు వదిలేసి పెళ్లి కోసం సెలవు పెట్టడం భావ్యంకాదని కీర్తి భావించారు. ఆ విషయాన్నే పెళ్లి కొడుకుకు చెప్పారు. వారానికి ఒకసారి లభించే సెలవు రోజున, అసోంలోని తాను విధులు నిర్వహిస్తున్న ప్రాంతంలోనే పెళ్లి చేసుకుందామని ఆమె వరుడికి ప్రతిపాదన పెట్టారు.

కాబోయే భార్య మనసు గ్రహించిన ఆదిత్య అందుకు సంతోషంగా ఒప్పుకున్నారు. 15 రోజులు ముందుగా అసోం వెళ్లి క్వారంటైన్‌లో గడిపారు. బుధవారంనాడు వారి వివాహం జరిగింది.

వధువరుల తల్లిదండ్రులు వీరి పెళ్లి జూమ్‌ యాప్‌లో చూశారని నమస్తే తెలంగాణ తన కథనంలో పేర్కొంది.

లాంజీ భుయాన్‌

ఫొటో సోర్స్, ANI

30 ఏళ్లు ఒంటిచేత్తో 3 కిలోమీటర్ల కాలువ తవ్విన బిహార్‌ భగీరథుడు

ఊరి పచ్చదనం కోసం, సాటి రైతులకు సాయపడటం కోసం 30 ఏళ్లపాటు ఒక వ్యక్తి 3 కిలోమీటర్ల పొడవైన కాలువను తవ్విన విషయాన్ని సాక్షి పత్రిక రాసింది.

బిహార్‌కు చెందిన లాంజీ భుయాన్‌ అనే వ్యక్తి పలుగు, పార పట్టుకుని మూడు దశాబ్దాలపాటు ఒంటరిగా కాలువను తవ్వారు. కొండలు గుట్టల మధ్య ఎక్కడో విసిరేసినట్లుగా ఉండే ఈ గ్రామం అభివృద్ధిపై ప్రభుత్వాలు పెద్దగా దృష్టి పెట్దులేదు. పంటలు పండని రైతులు ఊరు వదిలి వెళ్లిపోతున్నారు. దీంతో గ్రామానికి నీటి కోసం సమీపంలోని కొండ ప్రాంతాల నుంచి కాలువను తవ్వాలని భుయాన్ నిర్ణయించుకున్నారు.

ఊరి ప్రజలెవరూ సహకరించకపోయినా ఆయన దానిని దీక్షగా 30ఏళ్లపాటు తన ప్రయత్నాన్ని కొనసాగించారు. చివరకు 3 కిలోమీటర్ల కాలువను తవ్వారు. ఇప్పుడు ఈ కాలువ ద్వారా వర్షపు నీరు ఊరికి చేరుతోందని, గ్రామస్తులంతా ఆయన సేవను ఇప్పటికి గుర్తించారని సాక్షి పత్రిక పేర్కొంది.

శ్రీశాంత్‌

ఫొటో సోర్స్, AFP

శ్రీశాంత్‌పై ముగిసిన నిషేధం-దేశవాళీ క్రికెట్‌ ఆడేందుకు సన్నద్ధం

భారత పేసర్‌ శ్రీశాంత్‌పై ఏడేళ్ల నిషేధం ఆదివారంతో ముగిసిందని, ఆయన మళ్లీ క్రికెట్‌ ఆడేందుకు సిద్ధమవుతున్నారని ఈనాడు పత్రిక రాసింది.

మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో ఆయనపై బీసీసీఐ మొదట జీవితకాలం నిషేధం విధించగా, సుప్రీం కోర్టు తర్వాత దాన్ని ఏడేళ్లకు కుదించింది. నిషేధం నిన్నటితో ముగియడంతో 37 ఏళ్ల శ్రీశాంత్‌ మళ్లీ క్రికెట్‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నారని, కేరళ తరఫున దేశవాళీ క్రికెట్‌ ఆడేందుకు సాధన మొదలు పెట్టారని ఈనాడు పేర్కొంది.

ఆయన ఫిట్‌నెస్‌ నిరూపించుకుంటే జట్టులోకి తీసుకునే విషయాన్ని పరిశీలిస్తామని కేరళ క్రికెట్ సంఘం ఇప్పటికే చెప్పింది. 2013లో ఐపీఎల్ సీజన్‌లో శ్రీశాంత్‌పై ఫిక్సింగ్‌ ఆరోపణలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)