మహారాష్ట్ర: నాలుగు రోజులకే సీఎం ఫడణవీస్ రాజీనామా, ఈ రాజకీయాలు చెబుతున్నదేంటి?

ఫడణవీస్, అజిత్ పవార్

ఫొటో సోర్స్, EPA

    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నాలుగు రోజులకే దేవేంద్ర ఫడణవీస్ రాజీనామా చేశారు. బుధవారం (నవంబర్ 27న) అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన అనంతరం కొన్ని గంటల్లోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత రాజకీయాల గురించి ఈ పరిణామాలు ఏం చెబుతున్నాయి?

"రాజకీయం అంటే, సమస్య కోసం ఎదురుచూస్తూ, ప్రతిచోటా సమస్య ఎదుర్కొంటూ, దానిని తప్పుగా గుర్తించి యోగ్యంకాని ఔషధాలను ప్రయోగించే ఒక కళ" అని బ్రిటిష్ ప్రచురణకర్త ఎర్నెస్ట్ బెన్ ఒక సందర్భంలో అభివర్ణించారు.

మహారాష్ట్రలో తాజా పరిణామాలను చూస్తే, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలోని రాజకీయ పార్టీలు, సంస్థలు రెండింటికీ బెన్ చెప్పిన మాట వర్తిస్తుంది.

రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో 105 సీట్లు సాధించి బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన శివసేన 56 స్థానాల్లో గెలుపొంది రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది.

ప్రధాన ప్రతిపక్ష పార్టీలు... నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), కాంగ్రెస్‌ పార్టీలకు కలిపి 100 కంటే తక్కువ సీట్లే వచ్చాయి.

మోదీ, ఉద్ధవ్ ఠాక్రే

ఫొటో సోర్స్, EPA

ఆ మెజార్టీతో బీజేపీ- శివసేన కలిసి సులువుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని అందరూ అనుకున్నారు. కానీ, పరిస్థితులు తారుమారుయ్యాయి. పదవుల పంపకాల విషయంలో ఘర్షణపడి బీజేపీ కూటమి నుంచి శివసేన బయటకు వెళ్లిపోయింది.

ఆ తర్వాత, బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కలిసి కూటమిగా ఏర్పడి సంచలనం సృష్టించాయి. దాంతో, పరిణామాలు బాలీవుడ్ సినిమాను తలపించేలా మారిపోయాయి.

అనంతరం బీజేపీ నేత ఫడణవీస్‌ ముఖ్యమంత్రిగా, ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ఉదయాన్నే ఆగమేఘాల మీద ప్రమాణ స్వీకారం చేయడం సంచలనంగా మారింది.

తాజాగా బుధవారం నాడు అసెంబ్లీలో ఫడణవీస్ తన బలాన్ని నిరూపించుకోవాలంటూ మంగళవారం సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో వాళ్లిద్దరూ తమ పదవులకు రాజీనామా చేశారు.

సోనియా గాంధీ నిరసన

ఫొటో సోర్స్, EPA

ఎన్నికల తర్వాత కూటముల నుంచి పార్టీలు బయటకు వెళ్లడం కొత్తేమీ కాదు. ఎన్నికల తర్వాత అధికారం కోసం కూటములు కట్టడం తరచూ చూస్తున్నదే. మెజార్టీ సీట్లు సాధించిన పార్టీలు కూటములు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంటాయి.

అయితే, విపక్ష కూటమి నుంచి అజిత్ పవార్‌ బయటకొచ్చి బీజేపీతో చేతులు కలపగానే, గవర్నర్ హుటాహుటిన రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ, ప్రమాణ స్వీకారాలు చేయించడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. (శనివారం ఉదయాన్నే ముఖ్యమంత్రిగా ఫడణవీస్, ఉపముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు).

"ఇక్కడ సంప్రదాయాలను తుంగలో తొక్కిన మొదటి సంస్థ గవర్నర్ కార్యాలయం. అసెంబ్లీలో సంఖ్యాబలాన్ని నిరూపించుకుంటేనే ప్రభుత్వానికి మెజార్టీ ఉన్నట్లు, అలాంటి సందర్భాలలో గవర్నర్ పాత్ర ఏమీ ఉండదని 1994లో సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పులో స్పష్టంగా చెప్పింది" అని రాజకీయ విశ్లేషకుడు డాక్టర్. సుహాస్ పాల్షికర్ అన్నారు.

ఎక్కువ మంది భారతీయులు తమ దేశ ప్రాజస్వామ్యం పట్ల ఎందుకు నిస్పృహతో ఉన్నారో చెప్పడానికి మహారాష్ట్రలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు ఒక ఉదాహరణ. ఎన్నికల సంఘం, న్యాయస్థానాలు కూడా ప్రభుత్వ ఒత్తిళ్లను ఎదుర్కోవడం ఆందోళన కలిగించే విషయం.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు సంఖ్యాబలం ఉందన్న బీజేపీ వాదనను గవర్నర్ ఎందుకు అంత తెల్లవారుజామున స్వీకరించారు? ఆ తర్వాత వెంటనే ఆగమేఘాల మీద ప్రమాణ స్వీకారాలు చేయించారు? సుప్రీంకోర్టు కూడా గతంలో ఇచ్చిన తీర్పులను అనుసరిస్తూ అసెంబ్లీలో బలపరీక్షకు కఠినమైన గడువు విధించకుండా, విచారణను ఆదివారం నుంచి సోమవారానికి, సోమవారం నుంచి మంగళవారం దాకా వాయిదా వేసింది" అని డాక్టర్. సుహాస్ పాల్షికర్ అన్నారు.

రాజకీయాలు, బీజేపీ

ఫొటో సోర్స్, Getty Images

మహారాష్ట్రలో పరిణామాల పట్ల ప్రజల్లో పెద్దగా ఆగ్రహం లేదు ఎందుకు?

అంటే, అందుకు కారణం రాజకీయ అవకాశవాదాలు, వ్యవస్థల చంచలత్వాన్ని చూడటం ప్రజలకు అలవాటైపోవడమే. రాజకీయపరమైన నిరసనలు తగ్గిపోవడం మరో కారణంగా చెప్పొచ్చు.

పర్యావరణ మార్పులకు వ్యతిరేకంగా నిరసన, హాంకాంగ్‌లో ప్రజా ఉద్యమం తరహాలో భారత్‌లో భారీ జనసమీకరణలు ఇటీవలి కాలంలో కనిపించలేదు.

రాజకీయాల పట్ల దేశ యువతలో ఆసక్తి తగ్గినట్లు అనిపిస్తోంది. భారీగా మద్దతుదారులను కూడగట్టేందుకు అవసరమైన డబ్బు, వనరులు బీజేపీకి మాత్రమే ఉన్నట్లు అర్థమవుతోంది.

"ఏది ఏమైనా మహారాష్ట్రలో పరిణామాలు పోటీ రాజకీయాలకు మాయని మచ్చ తెచ్చాయి. రాజకీయాలు అన్ని విధాలుగా వైఫల్యం చెందినప్పుడు, వ్యవస్థలు తమ నియమాలకు అనుగుణంగా పనిచేయనప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి" అని పాల్షీకర్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)