గోదావరి-కచ్చులూరు ప్రమాదం: ఈరోజు కూడా బోటు బయటకు వచ్చే అవకాశాలు లేనట్లే

- రచయిత, బళ్ల సతీశ్, నవీన్ కుమార్ కందేరి
- హోదా, బీబీసీ ప్రతినిధులు
తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు ప్రమాదంలో బోటును బయటకు తీసే ప్రయత్నాలు కాస్త నెమ్మదిగా సాగుతున్నాయి. బోటును ఎలా బయటకు తీయాలనే దానిపై ఇంకా చర్చ జరుగుతూ ఉండడమే దీనికి కారణం.
ప్రస్తుతం ఘటనా స్థలంలో ఉన్న పరిస్థితులను చూస్తుంటే ఈరోజు కూడా బయటకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
సహాయక సిబ్బందికి హాని కలగకుండా నీటి అడుగున ఉన్న బోటును బయటకు తీయడం ఎలా అనే దానిపైనే ఇంకా సమాలోచనలు జరగుతున్నాయి.
అసలు బోటును బయటకు ఎలా తీయాలనే దానిపై అధికారులు, నిపుణులు ముంబయి ప్రణాళిక కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి బోటు బయటకు తీయడం ఎలా అనే విధానంపై సందిగ్ధత నెలకొని ఉంది.
ప్రమాద స్థలంలో నది లోతు, నీటివేగం, నీటి ఒత్తిడి కారణంగా బోటును బయటకు తీయడం ఇబ్బందిగా ఉంది.
బుధవారం ప్రమాద స్థలంలో పర్యటించిన నిపుణులు బోటును ఎలా బయటకు తీయాలనేదానిపై కొన్ని ప్రణాళికలు వేస్తున్నారు. బోటు తీసే విషయమై గురువారం సమాలోచనలు జరిగాయి. భౌతికంగా ఏమీ జరగలేదు. ప్రణాళికల ప్రకారం శుక్రవారం ప్రయత్నాలు చేసే అవకాశముందని భావించినా అవి కూడా ఓ కొలిక్కి రాలేదు.
"ముంబయి, కాకినాడల నుంచి నిపుణులు వచ్చారు. ప్రవాహ వేగం, లోతు, భౌగోళిక పరిస్థితుల సమాచారం తీసుకున్నారు. ఏం చేయాలనేది ప్రణాళిక వేస్తున్నారు. లోతు ఎక్కువగా ఉంది. యాంకర్ వేయడం, పై నుంచి లాగడానికి ప్లాట్ ఫాం వేయడం కష్టం. నిపుణులు దీనిపై నిర్ణయం తీసుకుంటారు. సహాయ కార్యక్రమాల్లో మేం వారికి సహకారం అందిస్తాం" అని జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) అధికారి కులదీప్ బీబీసీతో చెప్పారు.
ముంబయికి చెందిన గౌరవ్ భక్షి బృందం శుక్రవారం నాటికి ఒక ప్రణాళికను సిద్ధం చేసి తూర్పుగోదావరి జిల్లా అధికారులకు పంపనుంది. ఆ ప్రణాళిక ప్రకారం, స్థానిక నిపుణులు, సిబ్బందీ ఈ బోటును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తారు.

ముంబయి ప్రణాళిక లేకుండానే స్థానిక మత్స్యకారులతోపాటు కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం పనులు వెంటనే ప్రారంభించడానికి ఆసక్తి చూపింది. వారు కొంత యంత్ర సామగ్రిని కోరారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారికి ఎలాంటి నష్టం కలగకూడదనే ఉద్దేశంతో అధికారులు, మరింతగా సమాలోచనలు జరిపారు.
"బోటు కచ్చితంగా బయటకు తీయగలం. తాళ్లు విసిరి బోటును లాగాలి. మొదటి ప్రయత్నం సఫలం కాకపోవచ్చు. కానీ చేయాలి. మేం కొన్ని ఇనుప తాళ్లు, ఒక ప్రొక్లైనర్ అడిగాం. అయితే అధికారులు ఎవరికీ హాని కలగకూడదన్న ఉద్దేశంతో ముంబయి నుంచి వచ్చే ప్రణాళిక కోసం ఎదురు చూస్తున్నారు" అని సత్యం వివరించారు.
ఈ నెల 15న మధ్యాహ్నం 'వశిష్ఠ పున్నమి రాయల్' అనే పేరుతో నడిచే బోటు పర్యటకులతో ప్రయాణిస్తుండగా తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు గ్రామం దగ్గర మునిగిపోయింది.
బుధవారం ఉత్తరాఖండ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది తమ దగ్గర ఉన్న సైడ్ స్కాన్ సోనార్ మెషీన్ ద్వారా బోటు జాడ గుర్తించారు. వారి సమాచారం ప్రకారం కచ్చులూరు దగ్గర్లో ప్రమాదం జరిగిన చోట 210 అడుగుల లోతులో బోటు ఉంది. అధికారులు చెబుతున్న చోటే బోటు ఉండకపోవచ్చని సత్యం బృందం భావిస్తోంది.

రెవెన్యూ, పోలీసు సిబ్బందితోపాటు రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్), భారత నౌకాదళం, ఎన్‌డీఆర్‌ఎఫ్, కాకినాడ పోర్టు, రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ అధికారులు గురువారం ప్రమాద స్థలంలోనే ఉండి చర్చలు జరిపారు.
రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కూడా ప్రమాద స్థలాన్ని సందర్శించారు.
ప్రమాదం జరిగే సమయానికి పర్యటకులు, ఎనిమిది మంది సిబ్బందీ కలిపి మొత్తం బోటులో 73 మంది ఉంటారని అధికారులు అంచనా వేశారు. ప్రయాణికుల సంఖ్యలో కొంత మార్పు ఉండవచ్చని వారు చెబుతున్నారు. టికెట్లు తీసుకున్నవారంతా ప్రయాణించకపోవచ్చు లేదా టికెట్లు లేకుండా అప్పటికప్పుడే కొందరు బోటు ఎక్కి ఉండొచ్చు అనే కారణాలతో ఈ సంఖ్యలో మార్పు ఉండొచ్చని అంటున్నారు.
24 మంది మగవారు, ఇద్దరు ఆడవారు కలిపి 26 మంది ప్రాణాలతో బయటపడ్డారు. వారిలో కొందరికి గాయాలయ్యాయి.
ఇవి కూడా చదవండి:
- రూసీ కరంజియా: భారత మీడియాకు కొత్త నడక నేర్పిన జర్నలిస్ట్
- అమిత్ షా వ్యాఖ్యలపై నిరసనలు: అసలు భారతదేశ జాతీయ భాష ఏమిటి? అధికార భాషలు ఏవి?
- భారత్‌లో సోషల్ మీడియాను ఒక వ్యక్తి సగటున ఎన్ని గంటలు వాడుతున్నారో తెలుసా?
- బడి పిల్లలకు కూరకు బదులు ఉప్పు: వార్త రాసిన జర్నలిస్టుపై యూపీ పోలీసుల కేసు
- ‘ఉద్యోగాల లోటు లేదు, ఉత్తర భారతీయుల్లో వాటికి అర్హులు లేరు’ - కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్
- కశ్మీర్‌పై భారత్-పాకిస్తాన్ల హెచ్చరిక ప్రకటనలను ఎలా అర్థం చేసుకోవచ్చు
- జార్ఖండ్: మూక హత్యకు బలైన తబ్రేజ్ అన్సారీ కేసులో మళ్లీ సెక్షన్ 302 కింద చార్జిషీటు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








