ప్రధాని మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయో ఏం చర్చిస్తారు

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయో మంగళవారం భారత పర్యటనకు వస్తున్నారు. ఆయన విదేశాంగ మంత్రితోపాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తారు.
ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో పాంపేయో భారత్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే పాంపేయో భారత పర్యటన ఇంతకు ముందే ఖరారైంది. ఆయన భారత్ రావడం ఎందుకంత కీలకం అనే విషయంపై బీబీసీ ప్రతినిధి దిల్‌నవాజ్ పాషా, పశ్చిమాసియా, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు ప్రొఫెసర్ కమాల్ పాషాతో మాట్లాడారు.
రెండు అంశాల వల్ల పాంపేయో పర్యటనకు ప్రాధాన్యం పెరిగింది అని ప్రొఫెసర్ పాషా చెప్పారు. వాటిలో మొదటిది ఇటీవల అమెరికా డ్రోన్‌ను ఇరాన్ కూల్చివేయడం. దానివల్ల గల్ఫ్‌లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అక్కడి పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి.
ఇక రెండో విషయం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఎఇ)లో ఆయిల్ ట్యాంకర్లపై దాడి జరిగింది. దానివల్ల ట్యాంకర్ల రాకపోకలకు కూడా ఇబ్బంది ఎదురైంది. ఇన్సూరెన్స్, ప్రీమియం పెంచడం వల్ల చమురు ధరలు కూడా పెరిగాయి.
ఈ రెండు అంశాలపై ట్రంప్ మాట్లాడుతూ.. తను సైనిక దాడులు చేయించబోయానని, కానీ కొన్ని కారణాలతో చివరి క్షణంలో ఆ నిర్ణయం విరమించుకున్నానని అన్నారు. దీంతో ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. అమెరికా ఏ చర్యలకు పాల్పడినా దానికి తగిన జవాబిస్తామని ఇరాన్ చెబుతోంది.
మైక్ పాంపేయో దిల్లీ పర్యటన వెనుక, ఇరాన్‌తోపాటు మరో రెండు కీలక అంశాలు కూడా ఉన్నాయని ప్రొఫెసర్ పాషా చెప్పారు.
భారత్ రష్యా నుంచి ఎస్-400 యాంటీ బాలిస్టిక్ మిసైళ్లను కొనుగోలు చేయాలనుకుంటోంది. ట్రంప్ టారిఫ్ వార్‌లో అమెరికాను అత్యంత గొప్ప, శక్తిమంతమైన దేశంగా భావిస్తారు. తమ దేశ ఆర్థికవ్యవస్థ, సైన్యాన్ని బలోపేతం చేయాలని, స్వతంత్రంగా ఉంచాలని కోరుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నరేంద్ర మోదీ, పాంపేయో ఏం చర్చిస్తారు.
నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను తన సన్నిహిత మిత్రుడుగా చెబుతారు. కానీ రెండు దేశాల మధ్య ప్రస్తుతం చాలా అంశాల్లో భారీ అసమ్మతి ఉంది. అలాంటప్పుడు ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరగవచ్చు.
దానికి ప్రొఫెసర్ పాషా.. "భారత్ అమెరికాతో మెరుగైన సంబంధాలు కోరుకుంటోందని అందరికీ తెలుసు. దీనికి మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు అధికారంలో ఉన్నప్పుడు శ్రీకారం చుట్టారు. ప్రతి భారతీయుడు అమెరికాతో కలిసి ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాడు. మనకు ప్రతి రంగంలో అమెరికాతో లోతైన సంబంధాలు ఉంటున్నాయి. ఇటీవల సైన్యం కోసం ఆయుధాల కొనుగోళ్లలో చాలా పురోగతి ఉంది" అన్నారు.
వీటిని దృష్టిలో పెట్టుకుని మిగతా అంశాల్లో కూడా ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ అది జరగడం లేదు. వాటిలో ఒకటి పాకిస్తాన్, కశ్మీర్ అంశం. మిలిటెంట్ల నియంత్రణ లేదా కశ్మీర్ అంశంపై అమెరికా పాకిస్తాన్‌పై ఒత్తిడి తీసుకురావాలని భారత్ కోరుకుంటోంది. కానీ ఆ విషయంలో భారత్‌కు అనుకూలంగా పెద్దగా ఏం జరగలేదు.
ఇక రెండో విషయం భారత్-చైనా మధ్య పెరుగుతున్న సంబంధాలు. దీనిపై అమెరికా సంతోషంగా లేదు. చైనాను ఒంటరి చేయడానికి అమెరికా అన్ని ప్రయత్నాలూ చేస్తోంది.
చైనా, పాకిస్తాన్, రష్యాతో ఉన్న సంబంధాలపై భారత్ ఒక వ్యూహం రూపొందించుకోవాలని అమెరికా కోరుకుంటోంది. భారత్‌తోపాటు జపాన్, ఆస్ట్రేలియా, ఇతర దేశాలను కలిపి ఒక కూటమి ఏర్పాటు చేయాలనుకుంటోంది.
ఇప్పుడు భారత్ రష్యా నుంచి బాలిస్టిక్ మిసైళ్లను కొనుగోలు చేస్తే, తర్వాత తాము ఏర్పాటు చేయాలనుకుంటున్న కూటమిలో భారత్‌ను చేర్చడం సాధ్యం కాదని అమెరికా భావిస్తోంది.

ఫొటో సోర్స్, EPA
గల్ఫ్‌లో ఉద్రిక్తతలపై భారత్ పాత్ర
"ఒక అమెరికా అధికారి భారత్‌లో ఎప్పుడు పర్యటించినా, గల్ఫ్ దేశాల్లో 80 లక్షలకు పైగా భారతీయులు ఉన్నారని భారత్ వారికి పదే పదే గుర్తు చేస్తుంది. దేశానికి వచ్చే చమురు, గ్యాస్ అంతా అక్కడి నుంచే వస్తుందని చెబుతుంది. వాణిజ్యం, ఇతర రంగాల్లో భారత్ పురోగతికి గల్ఫ్ చాలా కీలకం" అన్నారు పాషా.
గల్ఫ్ దేశాల్లో ఎలాంటి ఉద్రిక్తతలు చెలరేగినా, అది దేశంలో ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని భారత్ చెప్పాలనుకుంటుంది. దానికోసం అమెరికా బాగా ఆలోచించి చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. తప్పుడు చర్యల వల్ల ఆ ప్రభావం ఇరాన్, అమెరికాపైనే కాదు మొత్తం ప్రపంచంపై పడుతుందని అనుకుంటోంది.
ఈ ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఒమన్ లేదా ఇతర దేశాల ద్వారా చర్చలు జరపాలని భారత్ కూడా ప్రయత్నిస్తోంది. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల వల్ల చమురు, పేమెంట్ అంశాలపై చాలా ప్రభావం పడింది. అందుకే భారత్ అమెరికాతో వీలైనంత వరకూ మెరుగైన సంబంధాలను కోరుకుంటుంది.
ఇవి కూడా చదవండి:
- ఇరాన్ అధ్యక్షుడే లక్ష్యంగా ట్రంప్ కొత్త ఆంక్షలు.. ఇది యుద్ధ దాహమే అంటున్న అధికారులు
- గడ్డి వంతెన ఇది... దీన్ని ఎలా కడతారో చూడండి
- 'ఇరాన్ ఆయుధ వ్యవస్థలపై అమెరికా సైబర్ దాడి'
- ఇంతమంది చిన్నారులు ఎందుకు చనిపోతున్నారు...
- మీ లంచ్‌ని తోటి ఉద్యోగి దొంగిలిస్తే.. అదో వైరల్!
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
- వయాగ్రా.. ఎవరు తీసుకోవచ్చు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








