'ఇంకు గుర్తును తొలగించడమెలా?'.. గూగుల్‌లో ట్రెండింగ్

ఫొటో సోర్స్, Getty Images
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ వైపు పలుచోట్ల హింసకు సంబంధించిన వార్తలొస్తుండగా, మరోవైపు వేలిపై ఇంకు గుర్తును ఎలా చెరిపివేయడం అన్న టాపిక్ గూగుల్ సెర్చ్‌లో ట్రెండ్ అవుతోంది.
వేలిపై ఇంకు గుర్తుల్ని చెరిపివేసుకొని, ఒకటికన్నా ఎక్కువసార్లు ఓటు వేశారన్న ఆరోపణలు గతంలో చాలా ఎన్నికల్లో వచ్చాయి.
ఆ ఆరోపణలను పక్కన పెడితే.. ఈ సారి మాత్రం గతంతో పోల్చితే ఎక్కువ మందే.. సిరా చుక్కను తొలగించడం ఎలా అని అన్వేషించారు.
ఇందులో కేవలం దొంగ ఓట్లు వేయడానికి మాత్రమే కాకుండా ఆ ఇంకును తొలగించుకోవాలన్న ఉద్దేశంతోనూ ఎక్కువ మంది సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి ఒకసారి ఓటేసిన తర్వాత మరో ఓటు వేయడం నేరం.

ఫొటో సోర్స్, Venkat Prasad G
అయితే, పోలింగ్ తర్వాత వాడే వేలిపై రాసే ఇంకు గుర్తు అంత త్వరగా చెరిగిపోయేది కాదని దాని తయారీదారులు చెప్పారు.
వాటిని చెరిపివేసుకోవడానికి ఏవైనా రసాయనాలు వాడితే వేళ్లు కాలిపోయే ప్రమాదం ఉందని కూడా చెప్పినట్టు ద హిందూ పత్రిక కథనం పేర్కొంది.
ఎన్నికల కమిషన్ 2015లో జారీ చేసిన అధికారిక సర్కులర్ ప్రకారం పోలింగ్ సందర్భంగా ఉపయోగించే చెరిగిపోని ఇంకును మైసూర్ పెయింట్స్, వార్నిష్ పెయింట్స్ అనే రెండు కంపెనీలు సరఫరా చేస్తాయి.
ఈ గుర్తు ఎడమచేతి చూపుడువేలిపై మొదటి కీలు నుంచి కింది వైపు గోరు మీదుగా వేయాల్సి ఉంటుంది.
దేశంలో చాలా చోట్ల రాజకీయ పార్టీలు ఓటరు జాబితాలో పేర్లను తొలగించారన్న ఆరోపణలు వెల్లువెత్తగా.. ఎన్నికల రోజు మాత్రం సిరా తొలగింపు హాట్ టాపిక్ అయింది.
ఇంకు గుర్తును చెరిపివేయడం విషయంలో గతంలో కూడా చాలానే వివాదాలు జరిగాయి. ఎన్‌సీపీ నేత శరద్ పవార్ 2014లో తన మద్దతుదారులకు అప్పటి ఎన్నికల్లో ఇంకు గుర్తును చెరిపివేసుకొని రెండు సార్లు ఓటు వేయాలని కోరడం ద్వారా వివాదంలో చిక్కుకున్నారు.

సిరా చుక్క... ఏముంది ప్రత్యేకత?
ఎన్నికల్లో వాడే సిరాను సెమి-పర్మినెంట్ ఇంక్‌గా చెప్పొచ్చు. అంటే కొద్ది రోజుల పాటు చెదిరిపోకుండా ఉండే సిరా అన్నమాట.
ఈ సిరాలో కొన్ని రకాల రసాయనాలతో పాటు 10 నుంచి 18 శాతం వరకు సిల్వర్ నైట్రేట్ ఉంటుంది. ఇది వెలుతురు పడగానే గట్టిగా మారుతుంది. వేలుపై పెట్టిన తర్వాత 72 నుంచి 96 గంటల పాటు చెదిరిపోకుండా ఉంటుంది.
అందుకే దొంగ ఓట్లను నివారించేందుకు ఈ సిరానే చాలా దేశాలు వాడుతుంటాయి.
ఇవి కూడా చదవండి:
- సిత్రాలు సూడరో: డీకే అరుణ, జయ సుధల.. కండువా మారింది, స్వరం మారింది
- నీరవ్ మోదీ: భారత్‌కు ఎలా రప్పిస్తారు? రూ.11,360 కోట్ల సంగతేంటి?
- 1996లో నల్లగొండ లోక్‌సభకు 480 మంది పోటీ
- ఎన్టీఆర్ ఫొటో ఎంత పని చేసిందంటే...
- ఒంగోలు గిత్తల కథ: ఇక్కడ అరుదై పోయాయి.. బ్రెజిల్లో వెలిగిపోతున్నాయి
- టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల తుది జాబితా ఇదే
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: వైసీపీ అభ్యర్థుల పూర్తి జాబితా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








