మోదీతో రాహుల్ ప్రజలను ఆకట్టుకోవడంలో పోటీపడగలరా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జతిన్ గాంధీ
- హోదా, బీబీసీ కోసం
మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల విజయం అటు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు రాహుల్ గాంధీలోనూ కొత్త ఉత్సాహం నింపింది. ఏడాది క్రితం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన రాహుల్‌కు ఈ విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
నిజానికి ఏడాదిన్నర నుంచే కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను రాహుల్ గాంధీ చూసుకుంటున్నా, అధికారకంగా అధ్యక్ష పదవి తల్లి సోనియా గాంధీ నుంచి ఆయనకు అందింది గతేడాది డిసెంబర్ 16నే. ఆ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తవడానికి ముందే మూడు హిందీ రాష్ట్రాలు... రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల విజయం రూపంలో ఆయనకు మంచి బహుమతి దక్కింది.
ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్ విజయం పార్టీకి తిరుగులేని శక్తినిచ్చింది. అక్కడ ఓట్లు, సీట్ల విషయంలో కాంగ్రెస్‌కు(63) బీజేపీకి(15) మధ్య చాలా అంతరం ఉంది. ఇప్పటిదాకా ఆ రాష్ట్ర ఎన్నికల చరిత్రలో అదే ఎక్కువ అంతరం. ఎన్నికలకు ముందు ఛత్తీస్‌గఢ్‌లో తమ పేదల అనుకూల పాలనా విధానాన్నే అస్త్రంగా మలచుకొని బీజేపీ ప్రచారం చేసింది. కానీ వారి నుంచే పార్టీకి వ్యతిరేకత ఎదురైంది. మరోపక్క దేశంలో గ్రామీణ ప్రజలు, రైతు వర్గాల్లో అసంతృప్తి నెలకొన్న తరుణంలో రానున్న సాధారణ ఎన్నికల్లో కూడా బీజేపీ వ్యతిరేక ఓటింగ్ జరిగే అవకాశం కనిపిస్తోంది.
అయితే ఆ ఓటింగ్ కాంగ్రెస్‌కు అనుకూలంగా జరగాలనేం లేదు. తెలంగాణ ఎన్నికల ఫలితాలను గమనిస్తే ఆ విషయం అర్థమవుతుంది.
రాజస్థాన్, మధ్య ప్రదేశ్ ఎన్నికల్లో ఓట్ల షేర్ పరంగా కాంగ్రెస్, బీజేపీలు నువ్వానేనా అన్నట్లు పోటీ పడ్డాయి. మధ్య ప్రదేశ్‌లో బీజేపీకే కాస్త ఎక్కువ ఓట్లు పడ్డాయి. కానీ, చివరికి ఇతర పార్టీల మద్దతుతో రెండు రాష్ట్రాల్లో కాంగ్రెసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2019లోనూ కాంగ్రెస్ అలాంటి పరిస్థితినే కొనసాగించొచ్చు.

2018 అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే, ఈ ఫలితాల కారణంగా కాంగ్రెస్ కార్యకర్తల్లో, చిన్న స్థాయి నాయకుల్లో రాహుల్ సామర్థ్యంపైన ఉన్న అనుమానాలు తొలగిపోయుంటాయి.
ఈ మూడు రాష్ట్రాల్లోని 65 లోక్‌సభ సీట్లలో 59 బీజేపీ ఖాతాలోనే ఉన్నాయి. (2014లో 62 ఉండేవి. ఉప ఎన్నికల్లో మూడు సీట్లు కోల్పోయింది) ప్రస్తుత ఓటింగ్ సరళిని గమనిస్తే, 2019లో కాంగ్రెస్ ఈ రాష్ట్రాల్లో తన సీట్లను 6 నుంచి 33కు పెంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఫలితాల వల్ల, 2019 ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక కూటమికి మేలైన సారథి ఎవరనే దానిపై చర్చకు కూడా ముగింపు పడుతుంది. తాజాగా డీఎంకే అధినేత స్టాలిన్, ఎన్‌సీపీ నేత శరద్ పవార్ కూడా రాహుల్‌కు మద్దతు తెలిపారు.
గత ఏడాది కాలంలో గుజరాత్‌లో కాంగ్రెస్ పరిస్థితి మెరుగైంది. కర్నాటకలో జేడీ(ఎస్)తో కలిసి అధికారాన్ని చేజిక్కిచ్చుకుంది. ఈ పరిణామాలు రాహుల్ నేతృత్వంలోనే జరిగాయి. రాజస్థాన్‌లో ఉప ఎన్నికల్లో ఆల్వార్, అజ్మీర్ లోక్ సభ స్థానాలతో పాటు కర్నాటకలో గత నెల ఉప ఎన్నికల్లో మరో రెండు లోక్ సభ సీట్లనూ కాంగ్రెస్ గెలుచుకుంది.
వీటితో పోలిస్తే డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల విజయం కాంగ్రెస్‌కు మరింత కీలకంగా మారింది. 2013 డిసెంబర్‌లో మొదలైన కాంగ్రెస్ తిరోగమనానికి ఇది ముగింపు పలికింది. పార్టీకి హీనమైన రోజులు చరిత్రలో కలిసిపోయాయని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.

2013 డిసెంబర్‌లో మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, దిల్లీ ఫలితాలు కాంగ్రెస్‌ను పూర్తిగా దెబ్బతీశాయి. ఫలితంగా 2014లో లోక్‌సభలో కాంగ్రెస్ సీట్ల సంఖ్య అత్యల్పంగా 44కు పడిపోయింది.
2013లో రాజస్థాన్ అసెంబ్లీలో 93 సీట్ల నుంచి ఆ పార్టీ బలం 21కి దిగజారింది. దిల్లీలో పరిస్థితి మరీ దారుణం. కాంగ్రెస్ వ్యతిరేకత నుంచి పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ అనూహ్య విజయాన్ని సాధించింది. వరుసగా 15ఏళ్ల పాటు దిల్లీని పాలించిన కాంగ్రెస్, ఆ ఏడాది అసెంబ్లీలో ఒక్కటంటే ఒక్క సీటూ గెలవలేకపోయింది.
మధ్య ప్రదేశ్‌లో బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ 230 అసెంబ్లీ సీట్లకుగాను 165 సీట్లు చేజిక్కించుకున్నారు.
ప్రస్తుతం ఆ చేదు అనుభవాలనుంచి కాంగ్రెస్ బయటపడుతోంది. అంతమాత్రాన ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేకుండా ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పోలుస్తూ వచ్చే ఏడాది జాతీయ స్థాయిలో కూడా బీజేపీ కంటే కాంగ్రెస్ మెరుగ్గా రాణిస్తుందని చెప్పడం కూడా సరికాదు. 2014లో నెలకొన్న 282-44 సీట్ల అంతరాన్ని ఐదేళ్లలో భర్తీ చేయడం కాంగ్రెస్‌కు అంత సులువు కాదు.

నరేంద్ర మోదీ - రాహుల్ గాంధీ మధ్య పోటీలో అనుకూల పవనాలు మోదీవైపే వీయొచ్చు. కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నా లోక్‌సభలో ప్రస్తుతం దాని బలం 47కే పరిమితమైంది.
మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో ఎన్నికల మ్యానిఫెస్టోల్లో రుణ మాఫీ, నిరుద్యోగ భృతి లాంటి ఆచరణకు కష్టమైన హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మధ్య ప్రదేశ్‌లో బీజేపీ ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు, 23వేల గ్రామ పంచాయతీల పరిధిలో గోశాలలను నిర్మిస్తామని కూడా కాంగ్రెస్ ప్రకటించింది.
ఈ నేపథ్యంలో హిందుత్వ విమర్శలు రాహుల్ గాంధీని కూడా తాకాయి. ఆయన ఎన్నికల సమయంలో గుళ్ల చుట్టూ కూడా తిరిగారు. మరోపక్క 1984లో సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన హింసలో భాగముందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కమల్ నాథ్‌ను ఇప్పుడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎంచుకోవడం కూడా ఆయనపై విమర్శలకు తావిస్తోంది. దాన్ని బట్టి చూస్తే ప్రస్తుత రాజకీయాల్లో కాంగ్రెస్ తనను తాను ఒక ప్రత్యామ్నాయంగా చూపించుకోగలుగుతోంది. కానీ, ప్రత్యామ్నాయ రాజకీయాలకు ప్రతీక కాలేకపోతోందని అర్థమవుతోంది.
ఒక ప్రత్యామ్నాయంగా కనిపిస్తోందే తప్ప ప్రత్యామ్నాయ రాజకీయాల్లో ఒక విజేతగా కనిపించట్లేదు.
రాజకీయంగా రాహుల్ గాంధీకి ఏడాది కాలంలో కొన్ని సానుకూలతలైతే ఉన్నాయి. మూడు రాష్ట్రాల్లో వివిధ వర్గాలను ఆయన ఒకతాటిపైకి తెచ్చిన తీరు పార్టీ శ్రేణుల్ని ఆకర్షించింది. ముఖ్యంగా పార్టీలో సీనియర్లు జూనియర్ల మధ్య సఖ్యత కుదిర్చి, సీనియర్లకు ప్రాధాన్యం కల్పించి నాయకత్వం మారినంత మాత్రాన సీనియర్లను పక్కనబెట్టాల్సిన అవసరం లేదన్న సందేశాన్ని కూడా రాహుల్ పంపారు.
సీనియర్, జూనియర్ అన్న తేడా లేకుండా పార్టీ పుంజుకోవడానికి సాయపడిన అందరికీ రాహుల్ ప్రాధాన్యం కల్పించారు. దీని వల్ల ఆయనకు ఇంటా బయటా స్నేహితులు లభిస్తారు. ఒక్కో పావును కదపడంలో ఆయన అమిత్ షాకు పోటీనిచ్చినా, మోదీ మాస్ అప్పీల్‌ను జయించాలంటే మాత్రం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పార్టీతో ఆయన కూటములను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ కూటమిలో కాంగ్రెస్‌ది కింది చేయి అయినా సరే.
(జతిన్... ‘రాహుల్: ఏ పొలిటికల్ బయోగ్రఫీ ఆఫ్ రాహుల్ గాంధీ’ పుస్తక సహ రచయిత, పాత్రికేయుడు)
ఇవి కూడా చదవండి
- సిక్కుల ఊచకోత: 3 రోజుల్లో 3 వేల మంది హత్య
- గుజరాత్: ఈ ఊరిలో అందరూ కోటీశ్వరులే
- తుపాను వచ్చినపుడు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- ఈజిప్ట్ తవ్వకాల్లో బయటపడిన పిల్లులు, పేడ పురుగుల మమ్మీలు
- శ్రీనగర్ దాల్ సరస్సులో హౌస్ బోట్లు: మున్ముందు కనుమరుగైపోతాయా?
- ‘గాంధీ మహాత్ముడు కాదు, ఆయనకు ఆ అర్హత లేదు’: బీబీసీ ఇంటర్వ్యూలో బీఆర్ అంబేడ్కర్
- వీవీఎస్ లక్ష్మణ్: నంబర్ త్రీగా ఆడడం వెనుక అసలు చరిత్ర
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









