ప్రెస్ రివ్యూ: మార్చి 5న భాజపాతో తెగదెంపులు చేసుకుంటామన్న ఏపీ మంత్రి

ఫొటో సోర్స్, Adinarayanareddyjmd/facebook
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ, విభజన హామీలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే మార్చి ఐదో తేదీన తెదేపాకు చెందిన కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తారని, భాజపాతో తెగదెంపులు చేసుకుంటామని రాష్ట్ర మార్కెటింగ్, గిడ్డంగులశాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించినట్టు 'ఈనాడు' పేర్కొంది.
అమరావతిలోని సచివాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం ఇచ్చిన 19 హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయకపోయినా 2019 ఎన్నికలకు భాజపాతో పొత్తు లేకుండా వెళ్తామని వెల్లడించారు.
తమ మంత్రులూ రాజీనామా చేస్తారని తెలిపారు. అయితే ఆ వెంటనే రాజీనామా చేస్తారని చెప్పిన విషయం తన వ్యక్తిగతమని, బడ్జెట్ మలివిడత సమావేశాలు ప్రారంభమయ్యేలోగా 19 అంశాలు కొలిక్కి వస్తాయనే అభిప్రాయం తమందరిలో ఉందని ఆయన అన్నట్టుగా ఆ పత్రిక తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
మావోయిస్టు ఆజాద్ ఎన్‌కౌంటర్ కేసు: పోలీసులపై కేసు పెట్టాలని కోర్టు ఆదేశం
మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆజాద్ అలియాస్ చెరుకూరి రాజ్‌కుమార్ ఎన్‌కౌంటర్ కేసులో ఆదిలాబాద్ జిల్లా కోర్టు గురువారం ఇచ్చిన తీర్పు సంచలనం రేపుతున్నట్టు 'సాక్షి' ఓ కథనం ప్రచురించింది.
జూలై 1, 2010 న ఆదిలాబాద్ జిల్లా సార్కపల్లిలో ఆజాద్‌ను పోలీసులు పట్టుకొని హతమార్చినట్టు ఆయన భార్య అప్పట్లో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పోలీసులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. దీనిపై ఏళ్లుగా విచారణ సాగగా పోలీసులపై హత్యానేరం అవసరంలేదని ఇటీవల కింది కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
అయితే, ఆ ఆదేశాలను జిల్లా కోర్టు కొట్టివేస్తూ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న 29 మందిని హత్యానేరం కింద విచారించాలని కింది కోర్టుకు సూచించింది. ఈ మేరకు పోలీస్ అధికారులు, సిబ్బందికి సమస్లు జారీ చేసింది.
రాష్ట్రంలో మొదటిసారిగా పోలీసులు హత్యానేరం ఎదుర్కోవాల్సి రావడంతో ఒక్కసారిగా పోలీస్ శాఖలో కలవరం మొదలైంది.
ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న అప్పటి సీఐ రఘునందన్, ఎస్‌ఐ ప్రవీణ్, ఏఎస్‌ఐ, ఏఆర్‌ఎస్‌ఐ, ఇతర ఆర్మ్‌డ్ పార్టీ సిబ్బందిపై హత్య కేసు విచారణ మళ్లీ మొదలవడంతో పోలీసు శాఖ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు తెలుస్తోంది.

ఫొటో సోర్స్, TelanganaCMO/facebook
తెలంగాణ తర్వాతే గుజరాత్!
''అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోంది. దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. ఆ తర్వాతే గుజరాత్, మహారాష్ట్ర ఉన్నాయి'' అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారని 'ఆంధ్రజ్యోతి' పేర్కొంది.
రాష్ట్రంలో ఎయిమ్స్‌కు వారం రోజుల్లో నిధులు విడుదల చేస్తామని జైట్లీ హామీ ఇచ్చారు. కేసీఆర్.. గురువారం జైట్లీతో అరగంటసేపు భేటీ అయ్యారు.
విభజన హామీలను, రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జైట్లీని కేసీఆర్ కోరారు. ముఖ్యంగా ఎయిమ్స్, ఐఐఎం వంటి వాటిని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు అందాల్సిన నిధులు.. ఆర్థిక సంవత్సరం ముగింపుదశకు వస్తున్నా ఇంకా అందలేదని గుర్తుచేశారు.
దానిపై జైట్లీ స్పందించి వెంటనే ఆ నిధులను విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
చనిపోయిన యువకుడి వీర్యంతో కవలలు జననం
ఓ యువకుడు జీవించి ఉన్నప్పుడు అతడి నుంచి సేకరించిన వీర్యం ద్వారా ఇద్దరు పిల్లలు (కవలలు) పుట్టారని 'నమస్తే తెలంగాణ' ఓ కథనం ప్రచురించింది.
తమ కుమారుడి జ్ఞాపకాలను సజీవంగా ఉంచుకోవటం కోసం ఆ యువకుడి తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలగలిసి ఇది సాధ్యమయ్యింది.
ఉన్నత చదువుల కోసం మహారాష్ట్ర నుంచి జర్మనీకి వెళ్లిన 27 ఏళ్ల ప్రథమేశ్ పాటిల్ 2013లో అనారోగ్యం పాలయ్యారు. ఆయన మెదడులో కణితి ఉందని పరీక్షల్లో వెల్లడైంది.
దానిని తొలగించటానికి అక్కడి వైద్యులు కీమోథెరపీ చికిత్సను అందించారు. అయితే, చికిత్స కారణంగా ప్రథమేశ్ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉండటంతో అతడి అనుమతితోనే వీర్యం శాంపిళ్లను తీసి భద్రపరిచారు.
2016లో ప్రథమేశ్ మరణించారు. అప్పటికి ఆయనకు పెళ్లి కూడా కాలేదు.
చదువుల్లో గొప్ప ప్రతిభను చూపి, మృత్యుముఖంలో కూడా ధైర్యం కోల్పోని తమ కుమారుడి వంటి మనవలుంటే బాగుండునని భావించిన అతడి తల్లిదండ్రులు పుణె-అహ్మద్‌నగర్ రోడ్డులో ఉన్న సహ్యాద్రి దవాఖాన వైద్యులతో చర్చించారు.
జర్మనీలో భద్రపరిచిన ప్రథమేశ్ వీర్యాన్ని గతేడాది పుణెకు తీసుకొచ్చారు. ప్రథమేశ్ కుటుంబసభ్యుల లక్షణాలతో సరిపోయే ఒక మహిళ నుంచి వైద్యులు అండాలు సేకరించి, వాటితో నాలుగు పిండాలను రూపొందించారు.
ప్రథమేశ్ బంధువైన ఓ మహిళ గర్భంలో రెండు పిండాలను మే నెలలో ప్రవేశపెట్టారు.
క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు నిర్వహించారు. సోమవారం ఆమె ఆరోగ్యంగా ఉన్న ఇద్దరు మగ పిల్లలకు (కవలలకు) జన్మనిచ్చారు. దీంతో ప్రథమేశ్ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
ఇలాంటి పద్ధతిలో పిల్లల్ని కనడం ఇదే మొదటిసారి కాదని, ఇప్పటివరకు రెండు, మూడు జరిగాయని ఇండియన్ సరోగసీ లా సెంటర్ వ్యవస్థాపకుడు హరిరామసుబ్రమణియన్ చెప్పారని ఆ పత్రిక తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- 'ఆరోగ్య శ్రీ' కేంద్ర ఆరోగ్య బీమా పథకంలో కలిసిపోతుందా?
- దక్షిణాఫ్రికా కొత్త అధ్యక్షుడు... యూనియన్ లీడర్, మైనింగ్ బాస్!
- కీటోడైట్ వివాదం: అసలేంటీ డైట్? అదెంత వరకు సురక్షితం?
- మానవ సమాజంలో పాశ్చాత్య దేశాలు చీలిక తెచ్చాయి: రౌహాని
- వృద్ధుల్లోనూ బలంగానే సెక్స్ కోరికలు
- పీఎన్బీ కుంభకోణం: మోదీజీ.. నీరవ్ మీతో కలిసి ఏం చేస్తున్నారు?
- ఆ దెబ్బలకు కడుపులో బిడ్డ కూడా చచ్చిపోయింది!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








