టీడీపీ - బీజేపీ: కలహాలున్నా.. కాపురం తప్పదు!

ఫొటో సోర్స్, nara chandrababu naidu/Facebook
- రచయిత, పర్సా వెంకటేశ్వర్ రావు జూనియర్
- హోదా, బీబీసీ కోసం
ఉమ్మడి రాష్ట్రం నుంచి 2014లో తెలంగాణను విభజించిన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత వరకూ సాధ్యమైతే అన్ని ప్రయోజనాలు సంపాదించాలని తెలుగుదేశం పార్టీ తహతహలాడుతోంది.
అధిక ఆదాయాన్నందించే హైదరాబాద్ నగరం లేకపోవటంతో పాటు, పరిమిత వనరులతో కొత్త రాజధాని అమరావతిని నిర్మించాల్సిన బృహత్తర బాధ్యత ఉండటంతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగా తయారైంది.
హైదరాబాద్ లేని కొత్త ఆంధ్రప్రదేశ్ పేద, వెనకబడ్డ రాష్ట్రంగా మిగిలింది. అందుకే రాష్ట్రానికి ‘ప్రత్యేక హోదా’ కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. ఆ హోదా లభిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందవచ్చని ఆయన ఆలోచన.

ఫొటో సోర్స్, nara chandrababu naidu/Facebook
కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం చంద్రబాబుకు సాయం చేస్తానని హామీ ఇచ్చింది. కానీ దానిని నెరవేర్చటంలో తాత్సారం చేస్తోంది.
1999 - 2004 మధ్య నాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి సారథ్యంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన చంద్రబాబుకు ఇప్పటి పరిస్థితి చాలా ఆగ్రహం కలిగిస్తోంది.
నాటి ఎన్‌డీఏలో టీడీపీ వ్యూహాత్మక పునాదిగా ఉండేది. అప్పుడు బీజేపీకి కేవలం 189 సీట్లు మాత్రమే ఉండటంతో మిత్రపక్షాల మీద ఆధారపడి ఉండేది. నాడు ఆ మిత్రపక్షాల్లో టీడీపీ పెద్ద పార్టీగా ఉండేది.

ఫొటో సోర్స్, RAVEENDRAN/AFP/Getty Images
2014 తర్వాత మోదీ నేతృత్వంలో బీజేపీ లోక్‌సభలో 282 సీట్లతో సౌకర్యవంతమైన మెజారిటీతో ఉంది. అధికారంలో కొనసాగటానికి మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన అవసరం లేకపోవటంతో.. ఇప్పుడు బీజేపీ బలంగానూ, మిత్రపక్షాలతో కూడిన ఎన్‌డీఏ బలహీనంగానూ ఉంది.
ఎన్‌డీఏలో బీజేపీ సంప్రదాయ మిత్రపక్షాలైన టీడీపీ, మహారాష్ట్రలో శివసేన, పంజాబ్‌లో అకాలీదళ్‌ల పాత్ర నామమాత్రంగా మారాయి.
అయితే.. టీడీపీకి, ఇతర రెండు బీజేపీ మిత్రపక్షాలకు ఒక తేడా ఉంది. మహారాష్ట్రలో ఒకప్పుడు బలమైన శక్తి అయిన శివసేన ఇప్పుడు జూనియర్ భాగస్వామి స్థాయికి పడిపోయింది. పంజాబ్‌లో అకాలీదళ్ ఎన్నికల్లో ఓడిపోయి ఇప్పుడు అక్కడ అధికారంలో లేదు. దీనికి విరుద్ధంగా టీడీపీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉంది.
అయినప్పటికీ.. వాజపేయి హయాంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించగలిగినట్లుగా ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు తన డిమాండ్లకు ఒప్పించలేకపోతున్నారు.

ఫొటో సోర్స్, narendramodi.in
కానీ, లోక్‌సభ ఎన్నికలు కనుచూపు మేరలో కనిపిస్తున్న ఈ తరుణంలో.. బీజేపీ, టీడీపీలు తమ బంధాన్ని పున:సమీక్షించుకుని, తమ వ్యూహాలను తిరిగి బలోపేతం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
చంద్రబాబు 2019 లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలవాలంటే.. మోదీ ప్రభుత్వం నుంచి తాను కోరుకున్నది సాధించగలిగానని ఆయన ప్రజలకు చెప్పగల పరిస్థితి ఉండాలి.
మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాల సారథ్యంలోని బీజేపీ.. పాత కాంగ్రెస్ పార్టీ తరహాలోనే దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ తనదైన స్థానం సంపాదించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాను ఇచ్చేది ఏదైనా సరే అక్కడ టీడీపీకి లబ్ధికలిగించకుండా చూడాలని బీజేపీ భావిస్తుండటం ఆశ్యర్యం కలిగించదు.

ఫొటో సోర్స్, narendramodi.in
ఆంధ్రప్రదేశ్‌లో ఈ రెండు పార్టీల మధ్య బాహాటంగానే రాజకీయ పోరాటం సాగుతోంది.
రాష్ట్రంలోని బీజేపీ నాయకులు.. పార్లమెంటులో తిరుగులేని మెజారిటీ గల జాతీయ పార్టీకి చెందిన తమను రాష్ట్రంలో జూనియర్ భాగస్వాములుగా పరిగణించరాదని భావిస్తున్నారు.
కానీ.. ఈ ఘర్షణ రెండు పార్టీల రాజకీయ ప్రయోజనాలనూ దెబ్బతీసే అవకాశముంది.
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ గణనీయమైన స్థానంలో లేదు. ఇప్పుడప్పుడే భారీ పురోగతి సాధించే అవకాశమూ లేదు. రాష్ట్రంలో టీడీపీ ప్రధాన ప్రత్యర్థి.. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైఎస్‌ఆర్ కాంగ్రెస్) పార్టీ.

ఫొటో సోర్స్, nara chandrababu naidu/Facebook
ఇక్కడికన్నా పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో బీజేపీ కొంత మెరుగైన స్థితిలో ఉంది. తెలంగాణ ప్రాంతం నిజాం పాలనలో ఉన్న చరిత్ర కారణంగా.. అక్కడ హిందూ మెజారిటీ, ముస్లిం మైనారిటీల మధ్య రాజకీయ విభజనను తనకు అనుకూలంగా మలచుకోవాలని బీజేపీ భావిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో అటువంటి రాజకీయ విభజన లేదు.
మరోవైపు.. టీడీపీ ఇప్పుడు ఎన్‌డీఏ నుంచి బయటకు వస్తే బలహీనపడుతుంది. మోదీ ప్రభుత్వంలో భాగస్వామిగా దానికి గల ఏ కొంచెం పరపతినైనా అది కోల్పోతుంది.
టీడీపీ, బీజేపీల మధ్య కలహాలు, కొట్లాటలు కొనసాగినా.. కలిసి సాగటం మినహా మరో మార్గం లేదు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








