ప్రెస్ రివ్యూ: 'కోడి పందేలు జరగడానికి వీల్లేదు'

ఫొటో సోర్స్, Getty Images
రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడా కోడి పందేలు జరగడానికి వీల్లేదని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసినట్లు 'సాక్షి' పేర్కొంది.
ముఖ్యంగా ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తమ ఆదేశాలకు విరుద్ధంగా ఎక్కడైనా కోడి పందేలు జరిగితే అందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), డీజీపీలే వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ మొత్తం వ్యవహారాన్ని వీరిద్దరు స్వయంగా పర్యవేక్షించాలంది.
కోడి పందేల పేరుతో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. కోర్టు ఉత్తర్వులంటే ప్రజా ప్రతినిధులకు ఏ మాత్రం లెక్క లేకుండా పోతోందని, జోక్‌గా భావిస్తున్నారని హైకోర్టు మండిపడింది.
తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది అని 'సాక్షి' వార్త ప్రచురించింది.

ఫొటో సోర్స్, The Singareni Collieries Company Limited
'సింగరేణికి ముసలితనం'
సింగరేణిలో పనిచేస్తున్న 54 వేల మంది కార్మికుల్లో సగానికి సగం 51-59 ఏళ్ల వయస్కులే ఉన్నారు. 46 సంవత్సరాలలోపు వయసున్న వారు 18వేల మంది మాత్రమే ఉన్నారు అని ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది.
సింగరేణిలో 80 శాతం కార్మికులు భూగర్భ గనుల్లో పని చేస్తుండగా, మిగతావారు ఉపరితల గనుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే బొగ్గుబావుల్లో కాలుష్యం కార్మికవర్గాన్ని కబళిస్తోంది. ప్రతికూల పరిస్థితులు, కాలుష్యం కారణంగా కార్మికులు రోగాల పాలవుతున్నారు.
పనిస్థలంలో 4.5 నుంచి 5 మీటర్ల వరకు కనీసం 283 క్యూబిక్ మీటర్ల గాలి అందించాల్సి ఉండగా, 150 నుంచి 180 క్యూబిక్ మీటర్ల గాలి మాత్రమే అందుతున్న దాఖలాలున్నాయి. దీంతో బొగ్గుబావుల్లో పనిచేస్తున్న కార్మికుల్లో హైపర్‌టెన్షన్ (హైబీపీ) కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దాదాపు సగం మంది కార్మికులకు హైబీపీ ఉంటోంది.
మానసిక, శారీరక ఇబ్బందుల వల్ల దాదాపు 20 శాతం కార్మికులకు షుగర్ కూడా వస్తోంది. వంశ పారంపర్యంగానూ కొంతమందికి ఈ వ్యాధి సోకుతోంది. విధి నిర్వహణలో గుండె ఆగి మరణిస్తున్న కార్మికుల సంఖ్య కూడా పెరిగిపోతోంది.
దేశవ్యాప్తంగా లక్షా 75 వేల మంది వరకు వివిధ వ్యాధులతో బాధపడుతున్నట్లు ఇటీవల దేశంలోని 11 రాష్ట్రాలలో ఉన్న బొగ్గు సంస్థల ఆస్పత్రుల రిపోర్టును బట్టి స్పష్టమవుతోంది. ఇక సింగరేణి కాలరీ్‌సలో 30 వేల మంది వరకు కార్మికులు రోగాల బారిన పడ్డ దాఖలాలున్నాయి.
సింగరేణిలో 1989లో లక్షా 16వేలు ఉన్న బొగ్గుగని కార్మికుల సంఖ్య ఇప్పుడు 53 వేలకు పడిపోయింది. 26సార్లు గోల్డెన్ హ్యాండ్‌షేక్ అమలు చేసి 16వేల మందికిపైగా కార్మికులను బయటికి పంపగా, అనారోగ్యంతో విధులకు గైర్హాజరు కావడంతో మరో 10 వేల మందిని డిస్మిస్ చేశారు.
వీరిలో ఇప్పటికే కొందరు సహజ మరణం పొందగా, దుర్భరమైన జీవితాన్ని భరించలేక ఇంకొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారు అని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

ఫొటో సోర్స్, AndhraPradeshCM/facebook
ఏపీ హైకోర్టు ఏర్పాటుపై ఏసీజేకు సీఎం లేఖ
అమరావతిలో ఏపీ హైకోర్టు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖను గత శనివారం ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్‌కు ఏపీ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ అందజేశారు అని ఈనాడు పేర్కొంది.
అమరావతి పరిధిలో ఏపీ శాశ్వత హైకోర్టును ఈ ఏడాది జూన్ నుంచి తాత్కాలిక భవనంలో ప్రారంభించేందుకు రెండు, మూడు భవనాలను ప్రభుత్వం గుర్తించిందని లేఖలో పేర్కొన్నారు.
ప్రతిపాదిత భవనాల పరిశీలనకు న్యాయమూర్తుల కమిటీని ఏర్పాటుచేయాలని కోరారు. కమిటీ జనవరి రెండో వారంలోపు పరిశీలించి నెలాఖరుకల్లా సూచనలు చేస్తే ఎంపిక చేసిన భవనానికి తగిన మార్పుచేర్పులు చేయనున్నామని పేర్కొన్నారు. ఆ భవనాన్ని అన్ని సౌకర్యాలతో ఏప్రిల్ చివరినాటికి అందిస్తామని, మే నెలలో తరలింపు ప్రక్రియ చేపట్టి జూన్ రెండో తేదీ నుంచి న్యాయస్థానం పనిచేయడానికి సిద్ధం చేస్తామని వివరించారు.
అమరావతిలో జస్టిస్ సిటీ నిర్మాణానికి అప్పటి ఏసీజే ఏకగ్రీవ ఆమోదం తెలిపిన విషయాన్ని లేఖలో గుర్తుచేశారు. శాశ్వత భవన నిర్మాణానికి సమయం పడుతున్నందున తాత్కాలిక భవనాల్ని గుర్తించామని పేర్కొన్నారు. ఏపీ హైకోర్టును అమరావతి ప్రాంతంలో ఏర్పాటుచేయాల్సిన ఆవశ్యకతను లేఖలో తెలిపారని ఈనాడు ఓ వార్త ప్రచురించింది.

ఫొటో సోర్స్, Telangana CMO
తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ
తెలంగాణలో ఐఏఎస్ అధికారులు భారీ సంఖ్యలో బదిలీ అయ్యారు. మొత్తం 29 మందికి స్థానచలనం కలిగిస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. సీనియర్ ఐఎఎస్‌లతోపాటు పలు జిల్లాల కలెక్టర్లను కూడా మార్చారు. మరికొంత మందికి అదనపు బాధ్యతలు అప్పజెబుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ జీవో జారీ చేశారు అని నవ తెలంగాణ పత్రిక పేర్కొంది.
రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా సురేష్ చందా, ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యదర్శిగా బీఆర్ మీనా, రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజేశ్వర్ తివారి నియమితులయ్యారు. వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిగా శాంతికుమారికి అదనపు బాధ్యతలు అప్పజెప్పారు.
ఇదే మాదిరిగా పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శిగా అరవింద్ కుమార్, బీసీ సంక్షేమశాఖ కార్యదర్శిగా బుర్రా వెంకటేశంకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్‌గా నవీన్ మిట్టల్, విపత్తు నిర్వహణ కమిషనర్‌గా ఆర్.వి.చంద్రవదన్, పశుసంవర్ధకశాఖ కార్యదర్శిగా సందీప్‌కుమార్ సుల్తానియా, బీసీ సంక్షేమశాఖ కమిషనర్‌గా అనితా రాజేంద్ర, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శిగా దానకిశోర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
సీనియర్ ఐఎఎస్ సోమేష్‌కుమార్‌కు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌గా క్రిస్టినా, ఎస్సీ అభివద్ధిశాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధప్రకాశ్, భూ పరిపాలన సంచాలకులుగా వాకాటి కరుణ, రాష్ట్ర సమాచార కమిషన్ కార్యదర్శిగా ఇలంబర్తి, సైనిక సంక్షేమ సంయుక్త కార్యదర్శిగా చంపాలాల్, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సంచాలకులుగా ప్రీతిమీనాను నియమించారని నవతెలంగాణ ఓ వార్త ప్రచురించింది.

ఫొటో సోర్స్, Wikipedia
'శుద్ధి' తప్పు
''దుర్గగుడిలో ఆగమ శాస్త్ర విరుద్ధంగా ఎలాంటి పూజలూ జరగలేదు. తాంత్రిక పూజలు అసలే జరగలేదు. డిసెంబరు 26వ తేదీ రాత్రి... ఆలయ శుద్ధి మాత్రమే జరిగింది'' అని బెజవాడ కనకదుర్గ ఆలయ ఈవో సూర్యకుమారి, ఆలయ ప్రధానార్చకుడు బద్రీనాథ్ బాబు తెలిపారు. కానీ... చుట్టుముడుతున్న సందేహాల్లో ఒక్కటంటే ఒక్కదానికీ సమాధానం లేదు అని ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది.
దుర్గగుడిలో అమ్మవారు మహిషాసుర మర్దినిగా భీకర రూపంలో కొలువై ఉంది. కానీ... వరుస కష్టాలు తొలగేందుకు, అదనపు శక్తులు సొంతం చేసుకునేందుకు ఆలయ అధికారి ఒకరు 'భైరవీ పూజ'కు సిద్ధమయ్యారు.
ఇందులో భాగంగా అమ్మవారి అసలు స్వరూపమైన మహిషాసురమర్దిని రూపం కనిపించేలా, కవచాన్ని తొలగించారు. అమ్మవారికి ఐదు చీరెలు ధరింపచేశారు. దశ మహా విద్యలలో భైరవీ తంత్రం ఒక ప్రత్యేక పూజా ప్రక్రియగా చెబుతారు.
ఆలయ శుద్ధి కోసమే అనుమతించామని అధికారులు వివరణ ఇస్తున్నప్పటికీ... అందులో నిజం లేదని తెలుస్తోంది. శుద్ధి జరిగినట్లయితే... నేలను మాత్రమే శుభ్రం చేయాలి. అమ్మవారి విగ్రహానికి అలంకారాలు చేయకూడదు. అయితే... ఆ సమయంలో అమ్మవారికి అలంకరించేందుకు తాజా పూలదండలు తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఆలయ శుద్ధి జరుగుతున్న దృశ్యాలేవీ నమోదు కాలేదని ఆంధ్రజ్యోతి పేర్కొంది.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








