స్వీడన్ స్కూల్ కాల్పుల్లో 10 మంది మృతి

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, ఫ్రాన్సెస్కా గిల్లెట్ట్
- హోదా, బీబీసీ ప్రతినిధి
స్వీడన్ ఒరెబ్రో నగరంలోని ఎడ్యుకేషన్ క్యాంపస్‌లో జరిగిన కాల్పుల్లో 10 మంది చనిపోయినట్లు పోలీసులు చెప్పారు.
స్వీడన్‌లోని స్కూళ్లలో హింసాత్మక ఘటనలు జరగడం చాలా అరుదు.
ఇంతకు ముందెన్నడూ స్వీడన్ స్కూళ్లలో ఈ స్థాయిలో కాల్పులు జరగలేదు.
కాల్పులకు పాల్పడ్డట్టుగా అనుమానిస్తున్న వ్యక్తి కూడా చనిపోయిన వారిలో ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు.
మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అసలేం జరిగింది?
స్టాక్‌హెమ్‌కు పశ్చిమాన 200కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒరెబ్రో నగరంలో భారత కాలమానం ప్రకారం మంగళవారం(ఫిబ్రవరి 4)సాయంత్రం 5 గంటల14 నిమిషాల సమయంలో కాల్పులు జరిగినట్టు పోలీసులకు మొదట సమాచారం అందింది.
రిస్‌బెర్గ్‌స్కా క్యాంపస్‌లో ఈ కాల్పులు జరిగాయి.
ఇది వయోజనులు చదువుకునే స్కూల్. స్వీడిష్‌లో ఈ స్కూల్‌ను కొమ్‌వక్స్‌గా పిలుస్తారు.
ప్రాథమిక విద్యతో పాటు ఆ పైన చదువు పూర్తిచేయని పెద్దవాళ్లు ఈ స్కూళ్లో చదువుకుంటారు.
ఈ క్యాంపస్‌లో ఇతర స్కూళ్లు కూడా ఉన్నాయి.
కాల్పుల శబ్దం వినిపించిందని టీచర్లు చెప్పారు. కొందరు క్లాస్‌రూమ్‌లు వదిలి పరుగులు తీశారని..మరికొందరు బయటకు రాకుండా లోపలే ఉండిపోయారని తెలిపారు.
తన 15 మంది విద్యార్థులను తీసుకుని క్లాస్‌రూమ్ నుంచి హాల్లోకి వచ్చి పరుగులు తీశామని మరియా పెగాడో రాయిటర్స్‌తో చెప్పారు.
''కాల్పుల్లో గాయపడ్డ వారిని ఒకరి వెంట ఒకరిని బయటకు ఈడ్చుకుంటూ తీసుకు రావడం నేను చూశా. ఇది చాలా తీవ్రమైన ఘటన అన్నవిషయం నాకు అర్థమయింది'' అని ఆమె చెప్పారు.
కాల్పుల శబ్దం విన్నప్పుడు తాను చదువుకుంటున్నానని మరో టీచర్ లెనా వారెన్‌మార్క్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ఎస్‌వీటీతో చెప్పారు. ''మొదట కొన్ని రౌండ్ల కాల్పులు వినిపించాయి. కాస్త విరామం తర్వాత మరింత ఎక్కువగా కాల్పులు వినిపించాయి'' అని ఆమె తెలిపారు.
ఆ ప్రాంతంలోని ఆరు పాఠశాలలు, ఒక రెస్టారెంట్‌ను పోలీసులు మూసివేశారు. ఇళ్లలోనే ఉండాలని ప్రజలను కోరారు.
విద్యార్థులు డెస్క్‌ల కింద దాక్కుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
బాల్కనీ నుంచి చిత్రీకరించిన ఓ వీడియోలో వరుసగా కాల్పుల శబ్దం, ప్రజలు పరుగుల తీస్తున్న దృశ్యాలు కనిపించాయి.

ఎంతమంది గాయపడ్డారు?
పదిమంది చనిపోయారని పోలీసులు చెప్పారు. అయితే మృతులు ఎంతమంది అన్నదానిపై ఇంకా కచ్చితమైన నిర్ధరణకు రాలేదన్నారు.
స్కూల్ భవనం లోపలే అందరూ చనిపోయారని పోలీసులు చెప్పారు. మృతుల్లో కాల్పులు జరిపిన వ్యక్తి కూడా ఉన్నట్టు భావిస్తున్నామన్నారు.
కాల్పుల్లో ఎంతమంది గాయపడ్డరన్నదానిపైనా స్పష్టత లేదన్నారు. చాలా మంది గాయపడ్డారని స్వీడన్ న్యాయశాఖ మంత్రి న్యూస్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు.
ఎంతమంది గాయపడ్డారనేదానిపై కాల్పులు జరిగిన తొలి కొన్ని గంటల్లో స్పష్టత రాలేదు.
మృతుల సంఖ్యపై మీడియాలో సమాచారం వస్తున్నప్పటికీ భారత కాలమానం ప్రకారం రాత్రి ఎనిమిదిగంటల సమయంలో మాత్రమే పోలీసులు అధికారికంగా మాట్లాడారు. ఐదుగురు మాత్రమే గాయపడ్డారని చెప్పారు.
స్వీడిష్ మీడియా మాత్రం చాలా మంది చనిపోయారని చెప్పింది. కొన్ని గంటల తర్వాత కాల్పులపై మళ్లీ మాట్లాడిన సమయంలో దాదాపు 10 మంది చనిపోయారని పోలీసులు ప్రకటించారు.

ఫొటో సోర్స్, MICROSOFT
కాల్పులు జరిపింది ఎవరు?
కాల్పులకు పాల్పడ్డ వ్యక్తి ఒంటరిగానే ఈ పనిచేశారని, ఆయన కూడా చనిపోయారని భావిస్తున్నామని పోలీసులు చెప్పారు.
కాల్పులు జరిపిన వ్యక్తికి ఏ గ్యాంగ్‌తోనూ సంబంధం లేదని ఒరెబ్రో స్థానిక పోలీసు చీఫ్ రాబర్టో ఈద్ ఫారెస్ట్ చెప్పారు.
దాడి వెనక ఉగ్రవాదుల హస్తం ఉందని భావించడం లేదన్నారు.
కాల్పలు జరిపిన వ్యక్తి ఒరెబ్రోకు చెందిన వారా కాదా అనేది తెలుసుకోవడానికి సీక్రెట్ సర్వీసెస్‌తో కలిసి పనిచేస్తున్నామన్నారు.
తుపాకీ కాకుండా, ఆయన ఇంకెలాంటి ఆయుధాలు ఉపయోగించారో తాను చెప్పలేనన్నారు.
మృతుల్లో ఎవరెవరున్నారు?
మృతులు ఎవరనేది గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు చెప్పారు.
కాల్పులు జరిగిన స్కూల్.. ప్రాథమిక, సెకండరీ విద్య పూర్తచేయని 20 ఏళ్లు పైబడిన వారికి విద్య అందించే పాఠశాల అని స్వీడన్ జాతీయ విద్యా సంస్థ తెలిపింది.
కాల్పులు జరిగిన సమయంలో ఎక్కువమంది విద్యార్థులు లేరని వారెన్‌మార్క్ అనే టీచర్ చెప్పారు. పరీక్ష రాసిన తర్వాత చాలామంది ఇంటికి వెళ్లిపోయారని తెలిపారు.
స్వీడన్‌లో ఇలాంటివి చాలా అరుదు
స్వీడన్‌లో స్కూళ్లలో కాల్పులు జరగడం చాలా తక్కువ. గతంలో కొన్నిసార్లు కాల్పులు జరిగాయి కానీ ఈ స్థాయిలోకాదు.
'ఈ స్థాయిలో కాల్పులు జరగడం స్వీడన్ చరిత్రలో ఇదే మొదటిసారి' అని ప్రధానమంత్రి అల్ప్ క్రిస్టర్స్‌సన్ చెప్పారు. ఈ కాల్పులు ఎందుకు జరిగాయనేదానిపై ఎలాంటి ఊహాగానాలూ ప్రచారం చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
దక్షిణ స్టాక్‌హోమ్‌లో గత సెప్టెంబరులో స్కూల్‌లో కాల్పులు జరిగాయి. 15 ఏళ్ల బాలుడు ఒకరు క్లాస్‌మేట్‌పై కాల్పులు జరిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














