ఉండి: 'ఎలక్ట్రిక్ సామాన్లు అడిగితే డెడ్‌బాడీ వచ్చింది.'

తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఉండి, రాజమహేంద్రవరం, పార్సిల్ డెడ్ బాడీ, క్షత్రియ సేవా సమితి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, పార్సిల్‌లో వచ్చిన మృతదేహం ఎవరిది, ఎవరు పంపారు అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

గమనిక: ఈ కథనంలో అంశాలు మిమ్మల్ని కలచివేయవచ్చు

ఇంటి నిర్మాణ సామాన్ల కోసం ఎదురు చూస్తున్న ఒక మహిళకు...ఎలక్ట్రికల్ సామాన్ల పార్సిల్ పేరుతో బాక్సులో డెడ్ బాడీ వచ్చింది. అందులో రూ. కోటి 30 లక్షలు చెల్లించకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందనే లేఖ కూడా ఉంది.

ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలో ఉండి మండలంలో జరిగింది.

ఈ సామాన్లను పంపించినవారి అడ్రసు రాజమహేంద్రవరంలోని క్షత్రియ సేవా సమితి పేరుతో ఉంది. ఈ సమితి క్షత్రియుల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి సహాయం చేస్తుంటుందని, వారికి దరఖాస్తు చేసుకున్న తర్వాత తొలిసారి కొన్ని సామాన్లు వచ్చాయని, మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ఇప్పుడు ఈ డెడ్ బాడీ వచ్చిందని పార్సిల్ అందుకున్న సాగి తులసి అనే మహిళ చెప్పారు..

సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్సీ పరిశీలించారు.

ఇంటి నిర్మాణ సామాన్ల కోసం ఎదురు చూస్తున్న తులసికి మృత‌దేహాన్ని పార్సిల్‌గా పంపిందెవరు? సంఘటన స్థలంలో పోలీసులకు దొరికిన ఆధారాలేంటి? నిర్మాణ సామగ్రి పంపినట్లు భావిస్తున్న క్షత్రియ సేవా సమితి ఏమంటోంది ? ఆ మృతదేహంఎవరిది ?

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

శుక్రవారం ఏం జరిగిందంటే...

శుక్రవారం ఉదయం ఉండి పోలీసులకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. "మా ఇంటికి డెడ్ బాడ్ పార్సిల్ వచ్చింది." అంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు తులసి బంధువులు. వెంటనే పోలీసులు ఉండి మండలంలోని యండగండి గ్రామానికి చేరుకున్నారు.

జిల్లా ఎస్పీ నయీం అస్మి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

"ఉండి మండలం యండగండికి చెందిన సాగి తులసి అనే మహిళకు ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసింది. ఆమె ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఆర్థిక సాయం కోసం రాజమహేంద్రవరం క్షత్రియ సేవా సమితికి దరఖాస్తు చేసుకున్నారు. ప్లాస్టరింగ్ స్టేజ్‌లో ఉన్నట్లు కనిపిస్తున్న ఆ ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే సామాగ్రిని క్షత్రియ సేవా సమితి అనే పేరుతో పార్సిల్ ద్వారా పంపిస్తున్నారు. ఇందులో భాగంగా మొదట క్షత్రియ సేవా సమితి పేరుతో టైల్స్‌ వచ్చాయి. మరోసారి విద్యుత్ సామాగ్రికి తులసి దరఖాస్తు చేసుకున్నారు." అని ఉండి పోలీసులు బీబీసీతో చెప్పారు.

" నేను మోటారు, ఇతర ఎలక్ట్రికల్ సామాన్ల కోసం దరఖాస్తు చేసుకున్నాను. ఆ పార్సిలే వచ్చిదంటూ నాకు ఫోన్ వస్తే నిర్మాణంలో ఉన్న ఇంటి వద్దకు వచ్చాను. పార్సిల్ వచ్చిన బాక్స్ నుంచి దుర్వాసన వస్తోంది. నాకు తెలిసిన చుట్టుపక్కల వాళ్లని, బంధువులను పిలిచి దానిని తెరిచి చూశాను. లోపల డెడ్ బాడీ ఉంది." అని తులసి బీబీసీతో చెప్పారు.

"ఈ డెడ్ బాడీ పార్సిల్ ఎవరు పంపించారనే విషయంపై జరుపుతున్నాం. పార్సిల్ తీసుకుని వచ్చిన వ్యక్తిని పిలిచి సమాచారం సేకరిస్తున్నాం. పార్సిల్ వచ్చిన బాక్సులో 45 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న పురుషుడి మృతదేహం ఉంది. కాళ్లు నరికినట్లు కనిపిస్తోంది." అని ఉండి పోలీసులు తెలిపారు.

యండగండి గ్రామంలో ముదునూరి రంగరాజుకి ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి పేరు తులసి. ఆమెకు ఆ గ్రామంలోనే ప్రభుత్వ ఇంటి స్థలం మంజూరైంది. ప్రస్తుతం ఇల్లు నిర్మాణ దశలో ఉంది.

అయితే, ఆర్థిక సాయం కోసం రాజమహేంద్రవరంలోని క్షత్రియ సేవా సమితిలో పేరు నమోదు చేసుకున్నారు.

"ప్యాక్ చేసిన చెక్క పెట్టె వచ్చింది. దానికి తాళం కూడా వేసి ఉంది. పైన కవర్స్ కట్టి పార్సిల్ వచ్చింది. అందులో మూడు, నాలుగు కవర్లు ఉన్నాయి. ఒకదానిలో డెడ్ బాడీ ఉంది." అని తులసి చెప్పారు.

తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఉండి, రాజమహేంద్రవరం, పార్సిల్ డెడ్ బాడీ, క్షత్రియ సేవా సమితి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఇంటి సామాన్ల కోసం వచ్చిన పార్సిల్‌లో మృతదేహం కనిపించడంతో తులసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మృతదేహంతో పాటు ఉన్నలేఖలో ఏముందంటే...

యండగండిలో ఇల్లు కట్టుకుంటున్న తులసి అనే మహిళకు వచ్చిన పార్సిల్ లో డెడ్‌బాడీ ఉందని, అందులో ఒక లేఖలో కూడా ఉందని పోలీసులు కూడా వెల్లడించారు. ఆ లేఖలో అంశాలపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

"తులసి ఇంటికి ఎలక్ట్రికల్ సామాన్ల పార్సిల్ బాక్సును ఒక ఆటో డ్రైవర్ తీసుకుని వచ్చారు. ఆ వ్యక్తి తులసికు ఫోన్ చేసి ఇంటికి సంబంధించిన వస్తువులు వచ్చాయని తెలిపారు. ఆమె వచ్చి ఆ సామాన్లు తీసుకున్నారు. సామాన్ల బాక్సు తెరవగానే అందులో మృతదేహం కనిపించింది. పార్సిల్ తెచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాం." అని పోలీసులు చెప్పారు.

ఆ పార్శిల్‌లో ఒక ఉత్తరం కూడా ఉంది. అందులో రూ.1.30 కోట్లు చెల్లించాలని, లేకపోతే ఇబ్బందులు పడతారని రాసి ఉందని పోలీసులు తెలిపారు.

తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఉండి, రాజమహేంద్రవరం, పార్సిల్ డెడ్ బాడీ, క్షత్రియ సేవా సమితి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, పార్సిల్‌లో మృతదేహంతో పాటు రూ. 1.30 కోట్లు చెల్లించాలని లేఖ ఉంది.

మాకు సంబంధం లేదు : క్షత్రియ సేవా సమితి

తులసికి వచ్చిన పార్సిల్‌ను క్షత్రియ సేవా సమితి పంపినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇది రాజమహేంద్రవరంలో ఉన్నట్లు వచ్చిన పార్సిల్ పై ఉన్న అడ్రసు బట్టి అర్థం అవుతుందని పోలీసులు తెలిపారు.

దీనిపై రాజమహేంద్రవరంలోని క్షత్రియ సేవా సమితితో బీబీసీ మాట్లాడింది.

"క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన సాగి తులసి అనే మహిళకు వచ్చిన పార్సిల్ రాజమహేంద్రవరంలోని క్షత్రియ పరిషత్ నుండి వచ్చినట్లుగా వార్తల్లో వస్తోంది. అది అవాస్తవం. రాజమండ్రిలో క్షత్రియ సేవా సమితి తప్ప ఎటువంటి క్షత్రియ పరిషత్ లేదు. మేము మా ప్రాంతవాసులకు తప్ప ఇతర ప్రాంతాల వారికి ఎటువంటి సాయం చేయం. యండగండి ఘటనలో మాకు ఎటువంటి సంబంధం లేదు." అని రాజమహేంద్రవరంలోని క్షత్రియ సేవా సమితి నిర్వహక ప్రతినిధి ఎంఎన్ రాజు బీబీసీతో చెప్పారు.

తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఉండి, రాజమహేంద్రవరం, పార్సిల్ డెడ్ బాడీ, క్షత్రియ సేవా సమితి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, పోస్టు మార్టం నివేదిక వచ్చిన తర్వాత డెడ్ బాడీ ఎవరిదనే దానిపై దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

ఇంతకీ మృతదేహం ఎవరిది?

యండగండి పార్సిల్ డెడ్ బాడీ ఘటనలో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

అయితే, తులసి దరఖాస్తు చేసిన క్షత్రియ సేవా సమితి ఎక్కడిది, ఇంతకు ముందు గృహ నిర్మాణ సామాన్లు పంపింది ఎవరు అన్నదానిపై అటు పోలీసులుగానీ, ఇటు బాధితురాలుగానీ స్పష్టతనివ్వలేదు.

అసలు పార్శిల్ ఇచ్చిందెవరు? క్షత్రియ సేవా సమితి పేరుతో పంపిందెవరనేది కీలకమని పోలీసులు చెప్పారు. ఈ అంశంపై ఆరా తీస్తున్నామన్నారు.

పార్సిల్‌లో వచ్చిన మృతదేహం ఎవరిదనే విషయంపై కూడా దర్యాప్తు జరుగుతోంది చెప్పారు.

"మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాం. పోస్టుమార్టం రిపోర్టు రాగానే...అందులోని సమాచారం ఆధారంగా ఆ మృతదేహం ఎవరిదనే విషయంపై పూర్తి స్థాయి దర్యాప్తు మొదలవుతుంది" అని ఉండి పోలీసులు బీబీసీతో చెప్పారు.

"దర్యాప్తు దశలో ఉండటంతో అందులోని అంశాలను మరింతగా మీడియాకు చెప్పలేం. సాగి తులసి బంధువుల్లో కొందరు అందుబాటులో లేరు. ప్రాథమిక విచారణలో కొన్ని అనుమానాలున్నాయి." అని పోలీసులు చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)