ఉత్తర్‌ప్రదేశ్‌లో సైకిల్ జోరు..

ఫొటో సోర్స్, samajwadi party
దేశంలో అత్యధిక లోక్‌సభ సీట్లున్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ గత ఎన్నికలలో సాధించిన 62 సీట్లు ఆ పార్టీని జాతీయ స్థాయిలో బాహుబలిని చేశాయి.
ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఒకే ఒక్క సీటుకు, సమాజ్‌వాది పార్టీని అయిదు సీట్లకు పరిమితం చేయడంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో యోగి ఆదిత్య నాథ్‌ల ప్రభావం స్పష్టంగా కనిపించింది.
కానీ, అయిదేళ్లు తిరిగేసరికి అదే ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ దాదాపు సగం సీట్లు కోల్పోయింది. కాంగ్రెస్ చెప్పుకోదగ్గ స్థాయిలో పుంజుకోకపోయినప్పటికీ సమాజ్‌వాది పార్టీ (సైకిల్ గుర్తు) మాత్రం అనూహ్యంగా దూకుడు చూపించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరెన్ని చోట్ల ఆధిక్యంలో..
మధ్యాహ్నం 4 గంటల సమయానికి సమాజ్‌వాది పార్టీ 34 సీట్లలో, బీజేపీ 36 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
కాంగ్రెస్ 6, రాష్ట్రీయ లోక్‌దళ్ 2, అజాద్ సమాజ్ పార్టీ(కాన్షీరామ్) 1, అప్నాదళ్(సోనేలాల్) 1 స్థానంలో ముందంజలో ఉన్నాయి.
కనోజ్‌లో సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేశ్ యాదవ్, మెయిన్‌పుర్‌ల్ ఆయన భార్య డింపుల్ యాదవ్, రాయ్‌బరేలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, వారణాసిలో బీజేపీ నేత ప్రధాని మోదీ, లఖ్‌నవూలో రాజ్‌నాథ్ సింగ్ ముందంజలో ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బీఎస్పీ ఈసారీ ఒంటరిగానే..
ప్రస్తుత ఎన్నికలలో బీఎస్పీ మినహా ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలు కూటములుగా పోటీ చేశాయి. ఎన్డీయే కూటమితో అప్నాదళ్(సోనేలాల్), ఆర్ఎల్‌డీ(జయంత్ చౌదరి), సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీలు పోటీ చేశాయి.
కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీలు కలిసి పోటీ చేశాయి. కాంగ్రెస్ 17 సీట్లకు మాత్రమే పోటీ చేసి సమాజ్‌వాది పార్టీకి 62 సీట్లలో పోటీకి అవకాశం ఇచ్చింది.
గత ఎన్నికలలోనూ ఒంటరిగా పోటీ చేసిన బీఎస్పీ ఈసారీ ఎవరితో పొత్తులు లేకుండానే బరిలో దిగింది. అయితే, గత ఎన్నికలలో 10 సీట్లు సాధించిన ఆ పార్టీ ప్రస్తుత ఎన్నికలలో మధ్యాహ్నం వరకు ఎక్కడా ఆధిక్యంలో లేదు.

ఫొటో సోర్స్, Getty Images
బీజేపీని ఆదుకోని అయోధ్య
ఈ ఎన్నికలకు కొద్దినెలల ముందు అయోధ్యలో రాముడి విగ్రహం ప్రతిష్టాపనను బీజేపీ పూర్తి చేసింది.
దేశవ్యాప్తంగా ఇది అనేకమందిని ఆకట్టుకుంది. అంతేకాదు.. బీజేపీకి ఎన్నికల విజయాలు అందిస్తున్న హిందీ బెల్ట్ రాష్ట్రాలలోనే కాకుండా దక్షిణాదినా అయోధ్య రామాలయ ప్రతిష్టాపన అంశం చర్చలో నిలిచింది.
ఈ ఎన్నికలలో బీజేపీకి అయోధ్య రామాలయం ఓట్లు కురిపిస్తుందని అప్పట్లో చాలామంది భావించారు.
కానీ, అనూహ్యంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ నష్టపోయింది. పెద్దసంఖ్యలో సీట్లను కోల్పోతోంది.

ఫొటో సోర్స్, samajwadi party
సమాజ్‌వాది జోరు
వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికలు, ఒక లోక్‌సభ ఎన్నికలలో దారుణంగా ఓటమి పాలైన తరువాత అఖిలేశ్ యాదవ్ ఈ ఎన్నికలలో తిరిగి పుంజుకొన్నారు.
ములాయం సింగ్ యాదవ్ నుంచి అఖిలేశ్ చేతికి పార్టీ ఆధిపత్యం వచ్చిన తరువాత ఈ స్థాయిలో ఆధిక్యం చూపడం ఇదే తొలిసారి.
దళిత, బహుజన, మైనారిటీ ఓటర్లు సమాజ్‌వాది పార్టీ వైపు నిలిచారని విశ్లేషకులు చెప్తున్నారు.
బహుజన్ సమాజ్ పార్టీ ఓట్ బ్యాంక్ సమాజ్‌వాది పార్టీ వైపు మళ్లిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- ఏసీ పేలి ఇల్లంతా కాలిపోయింది.. అసలు ఏసీ ఎందుకు పేలుతుంది.. పేలకుండా ఏం చేయాలి?
- ఆంధ్రప్రదేశ్‌లో గెలిచేదెవరు, ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి?
- చంద్రుడిపై ఆవల వైపు దిగిన చైనా స్పేస్‌క్రాఫ్ట్
- తేనెటీగలు అంతరించిపోతే మానవ జాతి ఏమవుతుందో తెలుసా?
- తెలంగాణ అనే పదం ఎక్కడ పుట్టింది? మియన్మార్ జోల పాటలో ఎందుకు వినిపిస్తుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














