బడ్జెట్ 2024: కొత్త పన్ను విధానంలో మారిన శ్లాబులు ఇవే.. రూ. 17,500 పన్ను ఆదా చేయొచ్చన్న ఆర్థిక మంత్రి

ఫొటో సోర్స్, Getty Images
2024-25 కేంద్ర బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయ పన్ను విషయంలో వేతన జీవులకు కొంత ఊరట లభించింది.
ఆదాయ పన్ను శ్లాబుల్లో స్వల్ప మార్పులు తీసుకొచ్చారు. కొన్ని ఆదాయ వర్గాలకు పన్ను భారం తగ్గింది.
ప్రస్తుతం ఉన్న రెండు పన్ను విధానాలలో ఒకటైన పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదు.
కొత్త పన్ను విధానంలో మాత్రమే కొన్ని మార్పులు చేశారు.
ఈ కొత్త విధానంలోని పన్ను శ్లాబులు మార్పులు ఇలా..
* కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50 వేల నుంచి రూ. 75 వేలకు పెంచారు.
* కొత్త పన్ను విధానంలో ఎప్పటిలాగే రూ. 3 లక్షల వరకు పన్ను ఉండదు.
* రూ. 3 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు 5 శాతం పన్ను ఉంటుంది.
* రూ. 7 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఆదాయంపై 10 శాతం పన్ను ఉంటుంది.
* రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు ఆదాయానికి 15 శాతం పన్ను ఉంటుంది.
* రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు ఆదాయానికి 20 శాతం పన్ను ఉంటుంది.
రూ. 15 లక్షలపైన ఆదాయానికి 30 శాతం పన్ను వర్తిస్తుంది.
ఈ విధానంలో వేతన జీవులకు రూ. 17,500 పన్ను ఆదా అవుతుందని ఆర్థిక మంత్రి చెప్పారు.
అలాగే పెన్షనర్లకు ఫ్యామిలీ పెన్షన్‌పై డిడక్షన్‌ను రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఉన్న డాటా ప్రకారం మూడింట రెండొంతుల మంది వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానాన్ని ఎంపిక చేసుకున్నారని ఆర్థిక మంత్రి చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఇప్పటి వరకు ఉన్న పన్ను శ్లాబులు
ఇప్పటికే అమల్లో ఉన్న కొత్త పన్ను విధానంలో ఇంతకుముందు కూడా రూ.3 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి ఎలాంటి పన్ను ఉండేది కాదు.
ఆ తర్వాత రూ.3 లక్షల పైనుంచి రూ.6 లక్షల వరకు ఆదాయంపై 5 శాతం.. రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు ఆదాయంపై 10 శాతం.. రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల ఆదాయంపై 15 శాతం పన్ను ఉండేది.
రూ.12 లక్షల పైనుంచి రూ.15 లక్షల ఆదాయం ఉన్న వారికి 20 శాతం.. రూ.15 లక్షలు పైబడిన ఆదాయంపై 30 శాతం పన్ను ఉండేది.
ఈ శ్లాబుల్లో ఇప్పుడు మార్పులు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
దేశీయ స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు ప్రోత్సాహమిచ్చేందుకు, ఇన్నొవేషన్‌కు సపోర్టు ఇచ్చేందుకు ఇన్వెస్టర్లు అందరికీ ఏంజెల్ ట్యాక్స్‌ను రద్దు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.
భారత్‌లో క్రూయిజ్ టూరిజానికి ఆదరణ నేపథ్యంలో, దేశీయ క్రూయిజ్‌లను నిర్వహించే విదేశీ షిప్పింగ్ కంపెనీలకు పన్ను విధానాన్ని సరళీకరిస్తున్నట్టు తెలిపారు.
విదేశీ మూలధనాన్ని ఆకర్షించేందుకు విదేశీ కంపెనీలకు కార్పొరేట్ పన్ను రేటును 40 శాతం నుంచి 35 శాతానికి తగ్గించారు.
బడ్జెట్ ప్రకటన సమయంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు నమోదయ్యాయి.
ఆ తర్వాత నష్టాల నుంచి కాస్త కోలుకుని మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 427 పాయింట్ల నష్టంతో 80,060 వద్ద కొనసాగుతోంది.
అలాగే, నిఫ్టీ 142 పాయింట్ల నష్టంలో 24,367 వద్ద ఉంది.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










