కువైట్ అగ్నిప్రమాదం: ముగ్గురు తెలుగు వారివి సహా భారత్‌కు చేరిన 45 మృతదేహాలు

- రచయిత, మెరిల్ సెబాస్టియన్
- హోదా, బీబీసీ న్యూస్
కువైట్ అగ్నిప్రమాదంలో చనిపోయిన 45 మంది భారతీయుల మృతదేహాలను భారత వైమానిక దళానికి చెందిన ఒక విమానంలో తీసుకొచ్చారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు కూడా ఉన్నారు.
మంగాఫ్ నగరంలో 176 మంది భారతీయ కార్మికులు నివసిస్తోన్న ఒక అపార్ట్‌మెంట్‌లో బుధవారం మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో 50 మంది చనిపోయారని కువైట్ అధికారులు వెల్లడించారు. ఇందులో 45 మంది భారతీయులు, ముగ్గురు ఫిలిప్పీన్స్‌కు చెందినవారని తెలిసింది. మిగతా ఇద్దరి మృతదేహాలను గుర్తించాల్సి ఉంది.
ఈ మంటల కారణంగా డజన్ల కొద్దీ కార్మికులు గాయపడ్డారు. వీరిలో అత్యధికులు భారతీయులే.
కువైట్ జనాభాలో మూడింట రెండొంతుల మంది విదేశీ కార్మికులే ఉంటారు. ముఖ్యంగా నిర్మాణ, గృహ రంగాల్లో ఈ దేశం అధికంగా వలస కార్మికులపైనే ఆధారపడుతుంది.
అక్కడ వారి జీవన పరిస్థితులపై మానవ హక్కుల సంఘాలు తరచుగా ఆందోళనలు వ్యక్తం చేశాయి.

ఫొటో సోర్స్, AFP
అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధితులను గుర్తించడానికి డీఎన్‌ఏ పరీక్షలు జరిపారని భారత మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ చెప్పారు. ప్రమాదం జరిగిన తర్వాత ఆయన కువైట్‌కు వెళ్లారు.
మృతుల్లో కేరళకు చెందినవారు 23 మంది, తమిళనాడుకు చెందిన ఏడుగురు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌ల నుంచి ముగ్గురు చొప్పున, ఒడిశా నుంచి ఇద్దరు, బిహార్, పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, హరియాణాల నుంచి ఒక్కరేసి ఉన్నారు.
మృతదేహాలను వెనక్కి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసినట్లు కీర్తి వర్ధన్ సింగ్ చెప్పారు.
ఆ విమానం శుక్రవారం ఉదయం కేరళలోని కొచ్చి నగరానికి చేరుకొని కార్మికుల మృతదేహాలను సంబంధిత అధికారులకు అప్పగించింది.
మరణించిన కార్మికులకు నివాళులు అర్పించేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తోపాటు ఇతర మంత్రులు విమానాశ్రయానికి వెళ్లారు.
‘‘మన దేశానికి ఇది చాలా పెద్ద విషాద సందర్భం. కేరళ వలస కార్మికులే మన రాష్ట్రానికి జీవనాధారం. కువైట్ అగ్నిప్రమాదం మన సమాజాన్ని ప్రభావితం చేసిన అతిపెద్ద విషాదాల్లో ఒకటి’’ అని పినరయి అన్నారు.
ప్రమాద మృతుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారం ప్రకటించాయి.

ఫొటో సోర్స్, AFP
విదేశీ కార్మికులు నివసించే పలు భవనాల్లోని ఆరోగ్య, భద్రతా పరిస్థితులను తనిఖీ చేస్తున్నామని కువైట్ అధికారులు తెలిపారు.
అరబ్ టైమ్స్ వార్తా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, ఆరు అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న సెక్యూరిటీ గార్డు గదిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది.
భవనంలోని గదులు, అపార్ట్‌మెంట్‌ల మధ్య గోడలకు సులభంగా మండే స్వభావం ఉన్న మెటీరియల్‌ను ఉపయోగించారని కువైట్‌కు చెందిన ఒక సీనియర్ అధికారి వెల్లడించారు.
కువైట్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధికారులు ఒక కువైట్ పౌరుడితో పాటు మరికొందరిని హత్య, అగ్నిమాపక భద్రతా చర్యలను అమలు చేయడంలో నిర్లక్ష్యం అభియోగాలతో అదుపులోకి తీసుకున్నారని టైమ్స్ వార్తా సంస్థ నివేదించింది.
భవనాలకు నిర్దేశించిన ప్రమాణాలను ఉల్లంఘించడంతో ఈ విషాదం జరిగిందని, యజయానులు దురాశతో వ్యవహరించారని కువైట్ ఉప ప్రధాని షేక్ ఫహాద్ యూసుఫ్ అల్ సభా అన్నారు.
ఇవి కూడా చదవండి:
- టీడీపీ, వైసీపీ మధ్య ఓట్ల తేడా ఎంత? అది ఫలితాలను ఎలా మార్చేసింది?
- చంద్రబాబు కేబినెట్లో పవన్ కల్యాణ్, నారా లోకేశ్, ఇంకా ఎవరెవరు అంటే..
- భాష తెలియని మహిళను మానసిక రోగి అనుకుని 12 ఏళ్లు అమెరికాలోని ఆసుపత్రిలో ఉంచేశారు, బయటపడ్డాక నష్టపరిహారం వస్తే అదీ దోచేశారు
- చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న కేసరపల్లి ఎక్కడుంది? అమరావతిలో ఎందుకు చేయడం లేదు
- ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














