ఫాదర్స్ డే: కడుపులో ఉన్నప్పటి నుంచి 21 ఏళ్లు వచ్చే వరకు కొడుకును రోజూ ఫోటో తీసిన తండ్రి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జెస్స్ గ్రీవెన్సన్-స్మిత్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఒక తండ్రి తన కొడుకుకు 21 ఏళ్లు వచ్చే వరకూ ప్రతి రోజూ ఆయన ఫోటోలు తీశారు. ఆ తండ్రి పేరు మెక్‌లియోడ్. ఆయన కొడుకు పేరు కోరీ. వీరిది ఇంగ్లండ్‌లోని హార్రోగేట్.
మెక్‌లియోడ్ తన కొడుకు చిన్ననాటి జ్జాపకాలను పదిలంగా దాచుకోవాలని అనుకున్నారు. 1991 సెప్టెంబర్ 13న ఫోటోలు తీయడం మొదలుపెట్టిన ఆయన, దానిని తన దినచర్యగా మార్చుకున్నారు.
కోరీకి 21 ఏళ్లు వచ్చే దాకా ఆ పని కొనసాగించారు.


ఫొటో సోర్స్, Ian McLeod
నిజానికి తన భార్య గర్భంతో ఉన్నప్పటి నుంచే మెక్‌లియోడ్ ఫోటోలు తీయడం మొదలుపెట్టారు. ఆమె గర్భంలోని పిండాన్ని చూపించే స్కానింగ్ రిపోర్టులను ఆయన ఫోటో తీసేవారు.
రోజువారీ పనుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లినా సరే, అదే రోజు తన కొడుకును కలవాల్సిందే, ఫోటో తీయాల్సిందే.
అందుకోసం ఒక్కోసారి వందల కిలోమీటర్ల ప్రయాణాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అలా 21 ఏళ్లలో ఆయన 7,670 ఫోటోలు తీశారు.

ఫొటో సోర్స్, Ian McLeod
‘‘మొదట ఊరికే రోజూ మా అబ్బాయిని ఫోటో తీస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన వచ్చింది. ఆ వెంటనే పని మొదలుపెట్టాను. అది ఎంతకాలం కొనసాగిస్తానో తెలియదు. కానీ, వాడికి 21 ఏళ్లు వచ్చేదాకా క్రమం తప్పకుండా ఫోటోలు తీయగలిగినందుకు చాలా ఆశ్చర్యంగా, సంతోషంగా ఉంది’’ అని మెక్‌లియోడ్ చెప్పారు.
కోరీ తన 30 ఏళ్ల ఫోటోలన్నింటినీ కలిపి ఒక వీడియోగా మార్చేశారు. తన తండ్రి పడిన తపనను, కష్టాన్ని ప్రపంచానికి చూపించాలనుకున్నారు. ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేశారు.

ఫొటో సోర్స్, Ian McLeod
ఇప్పుడు కోరీ వయసు 33 ఏళ్లు. పదేళ్ల కిందట తన తండ్రి బాధ్యతను ఆయన స్వీకరించారు. పదేళ్లుగా ఆయన తన ఫోటోలను తీసుకుని భద్రపరుస్తున్నారు.
జననం నుంచి మరణం దాకా తన జీవిత ప్రయాణాన్ని ఫోటోల రూపంలో పదిలపరచుకుంటాననే నమ్మకం ఉందని కోరీ చెబుతున్నారు.
‘‘ఈ ప్రాజెక్టును ఆపేస్తే, మా నాన్నను అవమానపరిచినట్టే. కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ పని ఆపను. నా జీవితాంతం ఫోటోలు తీసుకుంటూనే ఉంటాను. మా నాన్న సాంకేతికత పెద్దగా అందుబాటులో లేని రోజుల్లో ఈ పని ప్రారంభించారు. ఇప్పుడు నా దగ్గర ఐఫోన్ ఉంది. కాబట్టి, ఈ పని ఆపే ప్రసక్తే లేదు’’ అని కోరీ చెప్పారు.

ఫొటో సోర్స్, Cory McLeod
30 ఏళ్లు వెనక్కి వెళ్లి కొన్ని ఫోటోలను చూస్తుంటే, మాటల్లో చెప్పలేనంత ఆనందం వేస్తుందని మెక్‌లియోడ్ అన్నారు.

ఫొటో సోర్స్, Ian McLeod/Cory McLeod
ఇవాళ (జూన్ 16) పితృ దినోత్సవం. ఏటా జూన్‌లో మూడో ఆదివారం ఫాదర్స్ డేగా జరుపుకొంటారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














