చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించిన ఇండియా, ఈయూ : ఈ ఒప్పందం ప్రపంచానికి ఎలాంటి సందేశం ఇస్తోంది?

దిల్లీలో మంగళవారం కలిసిన యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్

ఫొటో సోర్స్, EPA/Shutterstock

ఫొటో క్యాప్షన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ మంగళవారం దిల్లీలో కలిసినప్పటి చిత్రం

యూరోపియన్ యూనియన్, భారత్ ఓ చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించాయి. అమెరికాతో ఉద్రిక్తతల నడుమ ఇరుపక్షాలు తమ బంధాన్ని బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న తరుణంలో రెండు దశాబ్దాలుగా కొలిక్కిరాని ఈ ఒప్పందాన్ని ప్రకటించాయి.

‘‘మేం సాధించాం. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్‌ను కుదుర్చుకున్నాం’’ అని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్‌ దిల్లీలో మీడియా సమావేశంలో చెప్పారు.

మరోవైపు ప్రధాని మోదీ ఈ ఒప్పందాన్ని "చరిత్రాత్మకం" అని అభివర్ణించారు.

ఈ ఒప్పందంతో 27 దేశాలతో కూడిన యూరోపియన్ కూటమి, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్‌ మధ్య స్వేచ్ఛా వాణిజ్యానికి మార్గం సుగమమవుతుంది.

యూరోపియన్ యూనియన్, ఇండియా కలిసి ప్రపంచ జీడీపీలో దాదాపు 25 శాతం వాటాను, రెండు వందల కోట్ల మందితో కూడిన మార్కెట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.

ఈ ఒప్పందంతో సుంకాలు గణనీయంగా తగ్గి, ఇరుపక్షాలకు మార్కెట్ ద్వారాలు విస్తరిస్తాయని భావిస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సోమవారం జరిగిన భారత గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి వాన్ డెర్ లేయన్, ఆంటోనియో కోస్టా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఫొటో సోర్స్, Narendra Modi/X

ఫొటో క్యాప్షన్, సోమవారం జరిగిన భారత గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి వాన్ డెర్ లేయన్, ఆంటోనియో కోస్టా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

సుంకాలు తగ్గుతాయా?

ఉర్సులా వాన్ డెర్ లేయన్‌, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా దిల్లీ పర్యటనలో ఉన్నారు. వారు ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీని కలుసుకున్నారు.

రసాయనాలు, యంత్రాలు, విద్యుత్ పరికరాలతో పాటు విమానాలు, స్పేస్‌క్రాఫ్ట్ వంటి ఎగుమతులపై విధించే సుంకాలు దశలవారీగా తొలుగుతాయని యూరోపియన్ కమిషన్ తెలిపింది.

ముఖ్యంగా ప్రస్తుతం 110శాతం వరకు ఉన్న మోటారు వాహనాల దిగుమతి సుంకాలు 2,50,000 వాహనాల కోటా కింద 10 శాతానికి తగ్గుతాయని తెలిపింది. ఇది గత జులైలో యూకేకు భారత్ ఇచ్చిన 37వేల వాహనాల కోటాతో పోలిస్తే ఆరురెట్లు ఎక్కువని బ్లూమ్‌బర్గ్ నివేదించింది.

దిగుమతి సుంకాలు తగ్గించిన తరువాత కార్లు, యంత్రాలు, ఆహార పదార్థాల వంటి యూరోపియన్ ఉత్పత్తులు భారత మార్కెట్‌లోకి చౌకధరలతో ప్రవేశించేలా యూరోపియన్ యూనియన్‌తో భారత్ ఒప్పందం చేసుకుంది.

ఈ ఒప్పందం పెట్టుబడుల ప్రవాహానికి మద్దతిస్తుందని, అలాగే యూరప్ మార్కెట్ల ప్రవేశానికి అనుకూలత పెరుగుతుందని, సరఫరా గొలుసు సమగ్రతను బలోపేతం చేస్తుందని బ్రస్సెల్స్ పేర్కొంది.

తన ఎగుమతులన్నింటికీ యూరోపియన్ యూనియన్‌లో భారత్ ‘‘ప్రాధాన్యతా ప్రవేశాన్ని’’ పొందగలుగుతుంది. వస్త్రాలు, తోలు ఉత్పత్తులు, సముద్ర ఉత్పత్తులు, హస్తకళలు, రత్నాలు, ఆభరణాలపై సుంకాలు తగ్గుతాయి లేదంటే పూర్తిగా తొలగిస్తారు.

ఈ ఒప్పందం ద్వారా టీ, కాఫీ, సుగంధద్రవ్యాలు, శుద్ధి చేసిన ఆహారాలు ప్రయోజనం పొందుతాయి. అయితే పాడిపరిశ్రమ, కోళ్లపరిశ్రమ, సోయామీల్, కొన్నిరకాల పండ్లు, కూరగాయల వంటి సున్నితమైన కీలక రంగాలను దేశీయ ప్రయోజనాల దృష్ట్యా జాగ్రత్తగా కాపాడుకుంటున్నట్టు దిల్లీ చెప్పింది.

‘‘ఇది భారత్ సాధించిన అత్యంత భారీ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’’ అని మోదీ చెప్పారు.

"దీని ద్వారా భారత్‌లోని రైతులు, చిన్న వ్యాపారులకు యూరప్ మార్కెట్లలోకి ప్రవేశం సులభమవుతుంది. ఇది తయారీ రంగం, సేవారంగాలను బలోపేతం చేస్తుంది. ఇది ఆవిష్కరణల భాగస్వామ్యాన్ని కూడా పెంచుతుంది" అని ఆయన అన్నారు.

భారత్, ఈయూ అమెరికా నుంచి ఆర్థిక, భౌగోళిక రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్న వేళ ఇరు పక్షాల నడుమ ఈ ఒప్పందం కుదిరింది.

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images

‘‘రెండు దిగ్గజాల కథ’’

భారత్, ఈయూ అమెరికా నుంచి ఆర్థిక, భౌగోళిక రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్న వేళ ఇరు పక్షాల నడుమ ఈ ఒప్పందం కుదిరింది.

వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలనే లక్ష్యంతో భారత్, అమెరికా మధ్య చర్చలు సాగుతుండగానే అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ గత సంవత్సరం భారత్‌పై 50 శాతం సుంకాలు విధించడంతో దిల్లీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

మరోవైపు డోనల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్ స్వాధీనం విషయంలో వెనక్కు తగ్గడానికి ముందు తమను వ్యతిరేకిస్తే యూరప్ దేశాలతో వాణిజ్య యుద్ధాన్ని తీవ్రతరం చేస్తానని బెదిరించారు.

ఈ విస్తృత భౌగోళిక రాజకీయ సందర్భం కూడా ఈ నాయకుల ప్రకటనల్లో స్పష్టంగా వ్యక్తమైంది.

‘‘ఇది ప్రపంచంలోనే రెండు, నాలుగో అతిపెద్ద ఆర్థికవ్యవస్థలకు చెందిన రెండు దిగ్గజాల కథ. ‘‘పరస్పరం గెలవాలనే స్ఫూర్తితో రెండు దిగ్గజాలు భాగస్వాములయ్యాయి. ప్రపంచం విసేరే సవాళ్లకు సహకారమే ఉత్తమ పరిష్కారమనే ఓ బలమైన సందేశం ఇది’’ అని మంగళవారం వాన్ డెర్ లేయన్‌ చెప్పారు.

అంతకు ముందురోజు కోస్టా అమెరికా పేరు ప్రస్తావించకుండా రక్షణ వాదం పెరుగుతున్న ప్రస్తుత రోజుల్లో ‘‘సుంకాల కంటే వాణిజ్య ఒప్పందాలనే భారత్, ఈయూ విశ్వసిస్తాయనే రాజకీయ సందేశాన్ని ఈ వాణిజ్య ఒప్పందం ప్రపంచానికి ఇస్తోంది’’ అని చెప్పారు.

గత వారాంతంలో వాన్ డెర్ లేయన్‌, కోస్టా దిల్లీకి చేరుకున్నారు. సోమవారం జరిగిన భారత గణతంత్ర దినోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

మంగళవారం ఈ నేతలు మోదీతో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. అప్పుడు వారి మధ్య ఓ స్నేహపూర్వక వాతావరణం స్పష్టంగా కనిపించింది.

ఈ ఒప్పందానికి యూరోపియన్ పార్లమెంట్, యూరోపియన్ కౌన్సిల్ ఆమోదం తెలిపిన తర్వాత ఈ ఏడాది చివరలో దీనిపై సంతకాలు జరిగే అవకాశం ఉంది.

రిపబ్లిక్ డే వేడుకలకు యూరోపియన్ నేతలు

ఫొటో సోర్స్, Getty Images

2007లో మొదలై..

వాణిజ్య ఒప్పందంతో పాటుగా.. భద్రతా, రక్షణ సహకారం, వాతావరణ చర్యల వంటివాటిపై వేర్వేరు చర్చలను భారత్, యూరోపియన్ యూనియన్ ముందుకు తీసుకువెళ్తున్నాయి.

సముద్ర భద్రత, సైబర్ ముప్పు, రక్షణ చర్చలపై ఇరుపక్షాలు ఓ ముసాయిదా తయారీపై పనిచేస్తున్నాయని రాయ్‌టర్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

వస్తు వాణిజ్యంలో భారత్‌కు ఈయూ అతిపెద్ద భాగస్వామి. 2024-25లో ద్వైపాక్షిక వస్తు వాణిజ్యం ఇరు దేశాల మధ్య 136 బిలియన్ డాలర్లు(సుమారు 11.30 లక్షల కోట్లు)గా ఉంది. ఇది గత దశాబ్దంతో పోలిస్తే దాదాపు రెట్టింపు వాణిజ్యం.

భారత్, ఈయూ మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు 2007లో మొదలయ్యాయి. అయితే, మార్కెట్‌ ప్రవేశం, రెగ్యులేటరీ డిమాండ్లపై విభేదాలతో 2013లో నిలిచిపోయాయి. మళ్లీ అధికారికంగా 2022 జులైలో ప్రారంభమయ్యాయి.

యూరోపియన్ నేతల పర్యటనకు ముందే ఒప్పందాన్ని సిద్ధం చేయాలనే లక్ష్యంతో గత కొన్నిరోజులుగా ఇరుపక్షాల అధికారులు ఒప్పందంలోని కీలక అంశాల ఖరారుకు తీవ్ర కృషి చేశారు.

అటు దిల్లీలోనూ, ఇటు బ్రస్సెల్స్‌లోనూ ప్రత్యామ్నాయ మార్కెట్ల కోసం ఎగుమతిదారుల నుంచి ఒత్తిళ్లు పెరిగిన నేపథ్యంలో ఈ ఒప్పందం సాకారమైంది.

గత ఏడునెలల్లో భారత పలు ప్రధాన వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంది. అందులో యూకే, ఒమన్, న్యూజిలాండ్ వంటివి ఉన్నాయి. అలాగే 2024లో స్విట్జర్లాండ్, నార్వే, ఐస్‌లాండ్, లీచెన్‌స్టెయిన్ తో కూడిన యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్‌ కూటిమితోనూ ఒప్పందం చేసుకుంది. 2023లో ఆస్ట్రేలియాతోనూ ఒప్పందం చేసుకుంది.

మరోపక్క యూరోపియన్ యూనియన్ దక్షిణ అమెరికా వాణిజ్య బ్లాక్ మెర్కోసూర్‌తో 25 ఏళ్ల చర్చల అనంతరం ఈనెలలోనే వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)