'గాలికి ఎగిరిపోవచ్చు..ఎవరూ బయటకు రావొద్దు' అంటూ హెచ్చరికలు, నిర్మానుష్యంగా మారిన బీజింగ్

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, కోహ్ ఈవ్, బార్బరా టాష్
- హోదా, బీబీసీ న్యూస్
ఉత్తర చైనా, బీజింగ్‌లో పెనుగాలులు వీస్తుండడంతో వందలాది విమాన సర్వీసులను, రైళ్లను రద్దు చేశారు.
శనివారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11.30కి (భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలు) బీజింగ్‌లోని రెండు ప్రధాన ఎయిర్‌పోర్టుల నుంచి రాకపోకలు సాగించే 838 విమాన సర్వీసులు రద్దు చేశారని రాయిటర్స్ వార్తా ఏజెన్సీ తెలిపింది.
గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనట్లుగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు బీజింగ్, చుట్టుపక్కల ప్రాంతాలలో ఈ వారాంతంలో వీస్తాయని అక్కడి వాతావరణ విభాగం అంచనా వేసింది.
దీంతో ఇప్పటికే పర్యటక ప్రాంతాలు, చారిత్రక స్థలాలను మూసివేశారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని శుక్రవారమే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
పాఠశాల తరగతులను తాత్కాలికంగా నిలిపివేశారు. బహిరంగ కార్యక్రమాలను రద్దు చేశారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని కోరారు. కార్మికులు పని ముగించుకుని త్వరగా ఇంటికి వెళ్లాలని సూచించారు.
50 కిలోలకంటే తక్కువ బరువున్నవారు "గాలికి ఎగిరిపోయే ప్రమాదం ఉంది" అని చైనా మీడియా సంస్థలు కొన్ని హెచ్చరించాయి.
కాగా శనివారం ఉదయం నుంచి గాలుల తీవ్రత పెరిగింది. అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే, ఎవరూ గాయపడినట్లు ఇంతవరకు రిపోర్ట్ కాలేదు.
‘బీజింగ్‌లోని ప్రతి ఒక్కరూ ఆందోళనగా ఉన్నారు. వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. అయితే, నేను భయపడినంత తీవ్రంగా అయితే గాలులు లేవు’ అని స్థానికుడొకరు రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీతో చెప్పారు.

శుక్రవారం నుంచి ఆదివారం వరకు బీజింగ్, టియాంజిన్‌తోపాటు హెబీలోని ఇతర ప్రాంతాలలో 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చని అంచనా వేశారు.
మంగోలియా నుంచి ఆగ్నేయంగా ఒక శీతల సుడిగుండం కదులుతుండడమే ఈ గాలులకు కారణం.
గత దశాబ్ద కాలంలో ఇలా బీజింగ్‌లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం ఇదే తొలిసారి.
ఏటా ఈ సమయంలో మంగోలియా నుంచి బలమైన గాలులు వీయడం సాధారణమే అయినప్పటికీ ఈసారి మాత్రం మునుపెన్నడూ లేనంత బలమైన గాలులు వీస్తాయని భావిస్తున్నారు.
ఈ గాలులు ఇప్పటికే మొదలయ్యాయి. వీటివల్ల బీజింగ్‌లో ఉష్ణోగ్రతలు 24 గంటల్లోనే 13 డిగ్రీల సెంటీగ్రేడ్లు తగ్గుతాయని అధికారులు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
సోషల్ మీడియాలో ఫన్నీ పోస్టులు
"ఈ బలమైన గాలులు తీవ్రంగా ఉంటాయి. చాలాసేపు వీస్తాయి. ఈ ప్రాంతంలో చాలామేరకు వీటి ప్రభావం ఉంటుంది. ఇవి చాలా వినాశకరమైన గాలులు" అని బీజింగ్ వాతావరణ శాఖ తెలిపింది.
గాలి వేగాన్ని చైనాలో లెవల్ 1 నుంచి 17 వరకు వేర్వేరు స్థాయిలుగా కొలుస్తారు.
చైనా వాతావరణ శాఖ లెక్కల ప్రకారం లెవల్ 11 గాలి "తీవ్రమైన నష్టాన్ని" కలిగిస్తుంది. లెవల్ 12 గాలి "తీవ్ర విధ్వంసం" సృష్టిస్తుంది.
ఈ వారాంతంలో గాలులు లెవల్ 11 నుంచి 13 వరకు ఉండొచ్చని భావిస్తున్నారు.
వారాంతంలో జరగాల్సిన అనేక స్పోర్ట్స్ఈవెంట్స్‌ని నిలిపివేశారు.
ప్రపంచంలోని మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబోట్ హాఫ్ మారథాన్ కూడా రద్దు చేశారు.
స్థానికులు బయటకు వెళ్లొద్దని సూచించారు. పార్కులు, పర్యటక ప్రాంతాలను మూసివేశారు. అలాగే నిర్మాణ పనులు, రైలు సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు.

ఫొటో సోర్స్, Reuters
నగరం అంతటా ఉన్న వేలాది చెట్లు ఈ గాలులకు పడిపోకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. కొన్నిటి కొమ్మలు కత్తిరించారు. అయినప్పటికీ శనివారం నాటికి 300కి పైగా చెట్లు కూలిపోాయాయి.
పర్వతాలు, అడవుల్లోకి వెళ్లొద్దని అధికారులు ప్రజలను హెచ్చరించారు.
మరోవైపు వీకెండ్ ప్లాన్స్ కాన్సిల్ అవడంపై సోషల్ మీడియా యూజర్లు ఫన్నీ పోస్టులు చేస్తున్నారు.
"ఈ గాలి దుమారం చాలా తెలివైంది, ఎందుకంటే శుక్రవారం సాయంత్రం మొదలై ఆదివారం ముగుస్తుంది. సోమవారం పనికివెళ్లాల్సిన వారికి ఎటువంటి అంతరాయం కలిగించదు" అని వీబోలో ఓ యూజర్ కామెంట్ చేశారు.
బలమైన గాలుల గురించిన హ్యాష్‌ట్యాగ్‌లు, 50 కిలోల కంటే తక్కువ బరువున్న వారు కొట్టుకుపోతారనే హెచ్చరిక చైనీస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
ఒక వీబో యూజర్.. "ఇలాంటి రోజు ఒకటి వస్తుందనే నేను బాగా తింటాను" అని రాశారు.
మరోవైపు కార్చిచ్చుల గురించి కూడా అధికారులు హెచ్చరిక జారీ చేశారు. ప్రజలు ఆరుబయట మంట వేయడాన్ని నిషేధించారు. ఆదివారం రాత్రికి గాలులు బలహీనపడే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














