TGPSC: పదేళ్ల కిందటి గ్రూప్-2 ఎగ్జామ్, దాదాపు 20 లక్షల ఆన్సర్ షీట్లు...మళ్లీ దిద్దాల్సిందేనా? ఉద్యోగాలు పొందినవారు ఏమంటున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘ఆరేళ్లైపోయింది.. మా ఉద్యోగాలు మేం చేసుకుంటున్నాం. ఇప్పుడు మళ్లీ రీవాల్యుయేషన్, కొత్త సెలక్షన్ లిస్టు అంటే ఎలా?'' అని ప్రశ్నించారు ఈ గ్రూప్-2 ద్వారా ఎంపికై, హైదరాబాద్ శివారులో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దారు ఒకరు. తన పేరు, వివరాలు రాసేందుకు ఆయన ఇష్టపడలేదు.
తెలంగాణలో 2015-16లో ఇచ్చిన గ్రూప్–2 నోటిఫికేషన్‌పై సుమారు పదేళ్ల తర్వాత మళ్లీ వివాదం మొదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాత పరీక్ష నిర్వహించి, విడుదల చేసిన ఫలితాలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది.
''జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయాలి. దాని ప్రకారం అర్హులైన అభ్యర్థులను గుర్తించి ఎనిమిది వారాల్లోగా సెలక్షన్ ప్రక్రియ పూర్తి చేయాలి'' అని స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు.
అయితే, ఈ గ్రూప్-2 పరీక్ష ఫలితాలను ఆరేళ్ల కిందటే టీజీపీఎస్సీ (అప్పటి టీఎస్‌పీఎస్సీ) ప్రకటించగా, ఎంపికైన వారు అప్పటి నుంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు.
ఈ వివాదంపై టీజీపీఎస్సీ నుంచి అధికారికంగా ఇంతవరకూ ఎలాంటి స్పందనా రాలేదు.

గ్రూప్ – 2 పరీక్ష జరిగి తొమ్మిదేళ్లు
తెలంగాణ ఏర్పాటు తర్వాత 439 పోస్టులకు 2015 డిసెంబరు 30న మొదటిసారి గ్రూప్-2 నోటిఫికేషన్ వచ్చింది.
ఆ తర్వాత దానికి సప్లిమెంటరీగా 2016 సెప్టెంబరు 1న మరో నోటిఫికేషన్ ఇచ్చి, మొత్తం పోస్టులను 1,032కు పెంచుతున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ప్రకటించింది.
మొత్తం 7,89,985 దరఖాస్తులు రాగా, 5.2 లక్షల మంది పరీక్ష రాశారని అప్పట్లో సర్వీస్ కమీషన్ ప్రకటించింది.
రాత పరీక్ష 2016 నవంబరులో జరిగింది. పరీక్ష నిర్వహణ, జవాబు పత్రాలు దిద్దే విషయంలో అప్పట్లోనే వివాదం రేగింది.

ఫొటో సోర్స్, Getty Images
అసలు ఏమిటీ వివాదం?
గ్రూపు-2 జవాబు పత్రాల (ఓఎంఆర్ షీట్లు)లో మూడు పార్టులున్నాయి.
- పార్ట్–ఏ లో అభ్యర్థుల వ్యక్తిగత వివరాలు రాయాలి.
- పార్ట్-బీ లో 150 ప్రశ్నలకు జవాబులు బబ్లింగ్ చేయాలి.
- పార్ట్–సీ లో అభ్యర్థి పేరు, సంతకం నమోదు చేయాలి.
వైట్నర్స్, ఎరేజర్స్, బ్లేడ్స్ వంటివి వాడకూడదని, జవాబు పత్రాలను ట్యాంపర్ చేయకూడదని ఓఎంఆర్ షీట్లలో ఉండే సూచనలలో స్పష్టంగా ఉంటుంది. అలా చేసిన పేపర్లు దిద్దేందుకు అనర్హమైనవిగా పరిగణిస్తామని కూడా అందులో ఉంటుంది.
అయితే, పరీక్షలో పేపర్–1కు సంబంధించి బుక్‌లెట్ కోడ్స్, ఓఎంఆర్ ఆన్సర్ షీట్ల మధ్య తేడాలు ఉన్నట్లు పరీక్ష ముగిసిన తర్వాత సర్వీస్ కమీషన్ గుర్తించింది. దీనిపై విచారణకు 2016 డిసెంబరు 6న టెక్నికల్ కమిటీని నియమించింది కమీషన్. ఆ కమిటీ 2017 మార్చిలో నివేదిక ఇచ్చింది.
పరీక్ష సమయంలో ఇన్విజిలేటర్లు, అభ్యర్థుల మధ్య బుక్‌లెట్ నంబర్లు రాసే విషయంలో కొంత గందరగోళం ఏర్పడిందని వివరించింది. బుక్‌లెట్ నంబరు, ఓఎంఆర్ షీట్ నంబరు ఒకటే ఉండాలని అభ్యర్థులు, ఇన్విజిలేటర్లు భావించడం వల్లనే ఈ పొరపాటు జరిగిందని, దానివల్ల కొందరు అభ్యర్థులు పార్ట్-ఏలో వాటిని తుడిచేందుకు వైట్నర్ వంటివి వాడారని పేర్కొంది.
''పార్ట్–ఏ లో జరిగిన పొరపాట్లకు వైట్నర్, ఎరేజర్ వంటివి వాడి ఉంటే మన్నించవచ్చు. కానీ పార్ట్–బీలో వైట్నర్, ఎరేజర్ వంటివి వాడి ఉంటే మూల్యాంకనం చేయవద్దు'' అని టెక్నికల్ కమిటీ స్పష్టం చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆరేళ్ల కిందటే నియామకాలు పూర్తి
అప్పట్లో కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా, జవాబు పత్రాలను మాన్యువల్‌గా మూల్యాంకనం చేయాలని సింగిల్ జడ్జి బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుపై డివిజన్ బెంచ్‌కు అప్పీలుకు వెళ్లింది టీజీపీఎస్సీ. టెక్నికల్ కమిటీ సిఫార్సుల ప్రకారమే ముందుకు వెళ్లాలని 2019 జూన్ 3న స్పష్టం చేసింది డివిజన్ బెంచ్.
దీనిపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, వారి పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో 2019 అక్టోబరు 24న ఫలితాలను ప్రకటించింది టీజీపీఎస్సీ.
అనంతరం వారికి 13 ప్రభుత్వ శాఖల పరిధిలో ఉద్యోగాలు ఇచ్చింది ప్రభుత్వం.

ఫొటో సోర్స్, Getty Images
మళ్లీ వివాదం ఎందుకు?
పార్ట్-బీలో జవాబులను ట్యాంపర్ చేయడం లేదా వైట్నర్ వాడకం, తుడిచివేతలు ఉంటే పక్కన పెట్టాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ, అలాంటి ఆన్సర్ షీట్లను పరిగణనలోకి తీసుకున్నారని ఆరుగురు అభ్యర్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసులో సుదీర్ఘంగా వాదనలు సాగాయి.
''దాదాపు 45 మందికి అన్యాయం జరిగిందని భావిస్తున్నాం. దీనిపై ఆరేళ్లుగా పొరాడుతున్నాం. వైట్నర్, తుడిచివేతలున్న ఓఎంఆర్ షీట్లు దిద్దకూడదని టెక్నికల్ కమిటీ స్పష్టంగా చెప్పినా, టీజీపీఎస్సీ వాటిని వాల్యుయేషన్ చేయించింది. దానివల్ల మేం నష్టపోయాం'' అని పిటిషనర్లలో ఒకరైన సీహెచ్ బాలాజీ చెప్పారు.
''కమిటీ సూచనలు, కోర్టు ఆదేశాలకు అనుగుణంగా వాల్యుయేషన్ చేయించి ఫలితాలు ప్రకటించాం. ఇప్పటికే ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఈ సమయంలో వారిని కదపడం లేదా సెలక్షన్ ప్రాసెస్ రద్దు చేయడం చాలా క్లిష్టమైనది'' అని టీజీపీఎస్సీ హైకోర్టుకు తెలిపింది.
ఆప్టికల్ స్కానింగ్ విధానంలో మూల్యాంకనం చేసినందున, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అలాంటి పేపర్లను ఆటోమేటిక్‌గా పక్కన పెట్టేందుకు వీలుంటుందని కమిషన్ వాదించింది.
టెక్నికల్ కమిటీ ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకుండా పార్ట్–బీలో వైట్నర్, తుడిచివేతలు వంటివి ఉన్నప్పటికీ మూల్యంకనం చేసినట్లు స్పష్టమవుతోందని, అలాంటి జవాబు పత్రాలను మూల్యాంకనం చేయడం పూర్తిగా చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అని హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది.
జవాబు పత్రాలను మరోసారి మూల్యాంకనం చేసి ఫలితాలు ప్రకటించాలని తీర్పు చెప్పింది.
అయితే, అభ్యర్థులు లేవనెత్తిన సందేహాలపై టీజీపీఎస్సీని బీబీసీ సంప్రదించింది. కానీ వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.
''హైకోర్టు తీర్పుపై డివిజన్ బెంచ్‌కు వెళ్లే యోచనలో కమిషన్ ఉంది'' అని కమిషన్ సభ్యుడొకరు బీబీసీతో చెప్పారు.
మరోవైపు, గ్రూప్–2 పరీక్ష సమయంలో టీజీపీఎస్సీ చైర్మన్‌గా ఉన్న ఘంటా చక్రపాణిని బీబీసీ సంప్రదించింది.
''ఈ విషయంలో ఎలాంటి కామెంట్ చేయదలచుకోలేదు'' అని ఆయన అన్నారు.
'రీవాల్యుయేషన్ పెద్ద సవాలే'
ఆరేళ్ల కిందట నియామక పత్రాలు పొందిన అభ్యర్థుల భవితవ్యంపై కోర్టు తీర్పుతో అయోమయం నెలకొంది.
''కష్టపడి చదివి ర్యాంకులు తెచ్చుకుంటే, ఎక్కడో పొరపాటు జరిగిందని పరీక్ష ఫలితాలను తిరిగి ప్రకటించాలని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది'' అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ డిప్యూటీ తహసీల్దారు అన్నారు.
''ఎవరైతే వైట్నర్ వాడి, తుడిచివేతలు చేసి పార్ట్-బీలో జవాబులు నమోదు చేశారో.. వారి పత్రాల వరకే తీసుకోవాలి. అలాంటివేమీ చేయకుండా మార్కులు తెచ్చుకుని, ర్యాంకులు తెచ్చుకున్న వారివి రీవాల్యుయేషన్ చేయాల్సిన అవసరం ఏముంది?'' అని ఆయన బీబీసీతో అన్నారు.
మరోవైపు కోర్టు ఆదేశాల మేరకు జవాబు పత్రాలు రీవాల్యుయేషన్ చేయడం టీజీపీఎస్సీకి కూడా సవాలే.
దాదాపు తొమ్మిదేళ్ల నాటి ఆన్సర్ షీట్లను బయటకు తీసి స్కాన్ చేసి రీవాల్యుయేషన్ చేయడం పెద్ద ప్రక్రియే అవుతుంది. నాలుగు సబ్జెక్టులకు కలిపి సుమారు 20 లక్షల ఓఎంఆర్ షీట్లు ఉంటాయి.
''ఆ పేపర్ల ప్రస్తుత పరిస్థితి ఏంటనేది చూడాలి. కోర్టు ఎనిమిది వారాల గడువు ఇచ్చింది. ఆ లోపు లక్షలాది పేపర్లు దిద్దడం కూడా కష్టమే. అందరి పేపర్లూ దిద్దాలా లేదా వైట్నర్, తుడిచివేతలు ఉన్న వారివే దిద్దాలా? ఇలాంటి సందేహాలు కూడా ఇప్పుడు మాకు వస్తున్నాయి'' అని కమిషన్ సభ్యుడొకరు బీబీసీతో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














