కరోనావైరస్: తూర్పు గోదావరిలో మొదలైన రక్షణ సూట్ల తయారీ - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్ బాధితులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించే ప్రత్యేక సూట్ల తయారీ ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో మొదలైనట్లు 'ఈనాడు' దినపత్రిక ఓ వార్త రాసింది.
వైద్యులకు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) సూట్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల పీపీఈ సూట్లు అవసరం కావడంతో ఆ మేరకు ప్రణాళిక సిద్ధం చేసింది.
సూట్ల తయారీ బాధ్యతను తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం మూలపేటలో ఉన్న పాల్స్‌ప్లస్ బొమ్మల పరిశ్రమ యాజమాన్యానికి అప్పగించింది. ఇక్కడ పరిశ్రమలో రోజుకు నాలుగు వేల సూట్లు తయారయ్యే సామర్థ్యం ఉండడంతో ఈ పరిశ్రమను ఎంపిక చేశారు.
వినైల్ క్లాత్‌తో తయారు చేసే ఈ సూట్ల తయారీకి సంబంధించి నాలుగు రోజులపాటు శిక్షణ ఇచ్చారు. అవసరమైన సామగ్రిని ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించారు.
సోమవారం నుంచి సూట్లు తయారీ ప్రారంభమైంది. తల నుంచి కాళ్లు వరకు పూర్తిగా మూసివేస్తూ కేవలం కళ్లు మాత్రమే కనిపించేలా ఇవి ఉంటాయి.
ప్రస్తుతం పరిశ్రమలో పనిచేస్తున్న వారిని బట్టి రోజుకు రెండు వేల సూట్లు వరకు తయారవుతాయని జిల్లా అధికారులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, twitter/ministerktr
ప్రైవేటు ల్యాబ్‌లను అనుమతించకపోవడానికి కారణం ఇదే: కేటీఆర్
కరోనా పరీక్షల కోసం విచ్చలవిడిగా అనుమతులు ఇస్తే ప్రైవేట్ డయాగ్నొస్టిక్ సెంటర్లు ప్రజలను భయాందోళనకు గు చేసే అవకాశముందని, అందుకే అలా ఇవ్వలేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించినట్లు 'సాక్షి' దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రణాళికాబద్ధంగా రాష్ట్రం వ్యవహరిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. వైరస్ వ్యాప్తిని అదుపు చేసేందుకు లాక్‌డౌన్ కొనసాగింపే సరైన విధానమని అన్నారు.
లాక్‌డౌన్‌లో పేదలు, వలస కార్మికుల సంక్షేమం విషయంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.
లాక్‌డౌన్ పరిస్థితులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని, ఆకలి చావులు ఉండకూడదనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.
అవసరమైన వైద్య సామగ్రిని సమకూర్చుకోవడంతో పాటు, 15 వేల పడకలను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.

ఫొటో సోర్స్, ap bhavan
క్వారంటీన్ ముగిసినా దిల్లీలో చిక్కుకుపోయిన తెలుగువాళ్లు
ఇటలీ నుంచి స్వదేశానికి వచ్చిన తెలుగు విద్యార్థులు 24 రోజులుగా దేశ రాజధాని దిల్లీలోనే చిక్కుకుపోయి ఉన్నట్లు 'ఆంధ్రజ్యోతి' దినపత్రిక ఓ వార్త రాసింది.
ఉన్నత చదువుల కోసం ఇటలీకి వెళ్లిన భారత విద్యార్థులు 214 మంది ప్రత్యేక విమానంలో మార్చి 14న దిల్లీకి చేరుకున్నారు. వారిలో 82 మంది తెలుగువాళ్లు కాగా, అందులో 33 మంది ఆంధప్రదేశ్‌కు చెందిన వారు ఉన్నారు.
వారిని దిల్లీలోనే క్వారంటీన్‌లో ఉంచి వివిధ దశల్లో పరీక్షలు నిర్వహించగా.. రిపోర్టులన్నీ నెగెటివ్ వచ్చాయి. అయినప్పటికీ వారిని స్వస్థలాలకు తరలించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపడం లేదు.
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్నా... పంజాబ్, హరియాణా, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ప్రత్యేక బస్సుల్లో తమ విద్యార్థులను తరలించాయి. తమను కూడా పంపాలని తెలుగు విద్యార్థులు ఆర్మీ అధికారులను కోరితే.. క్లియరెన్స్ లెటర్ ఇస్తే పంపిస్తామని వారు స్పష్టం చేశారు. ఏపీ భవన్ అధికారులను సంప్రదిస్తే స్పందన లేదు.
వీరి ఇబ్బందులపై వచ్చిన మీడియా కథనాలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. వారందరినీ ప్రత్యేక విమానం.. లేదంటే బస్సుల ద్వారా తరలిస్తామని ప్రకటించింది. ఏపీ మాత్రం స్పందించడం లేదని.. ఈనెల 16 వరకు అక్కడే ఉండాలంటూ ఏపీ భవన్ అధికారులు చెబుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు.
ఇవి కూడా చదవండి.
- కరోనాపై ప్రభుత్వం ఎలా ‘యుద్ధం’ చేయబోతోంది? కంటైన్మెంట్ ఆపరేషన్ ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడు ముగుస్తుంది?
- కరోనావైరస్: ప్రాణాలు కాపాడుకోవడానికి డస్ట్ బిన్ కవర్లు వేసుకుంటున్న బ్రిటన్ వైద్య సిబ్బంది
- ప్రజల కదలికలను స్మార్ట్ ఫోన్ల ద్వారా కనిపెడుతున్న గూగుల్.. భారతదేశంలో లాక్‌డౌన్ ప్రకటించాక పరిస్థితిపై రిపోర్ట్
- కరోనావైరస్: ఈ మహమ్మారికి ముంబయి కేంద్రంగా ఎలా మారింది?
- లాక్‌డౌన్ ఎఫెక్ట్: మహారాష్ట్ర నుంచి తమిళనాడు - 1,200 కిలోమీటర్లు కాలినడకన ఇళ్లకు చేరిన యువకులు
- ఇండియా లాక్‌డౌన్: ‘‘కరోనా సోకకపోయినా ఇంత శోకాన్ని మిగులుస్తుందని నేను అనుకోలేదు’’
- కరోనావైరస్: కొన్ని దేశాల ప్రజలు మాస్క్‌లు వాడతారు, మరికొన్ని దేశాల ప్రజలు వాడరు, ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








