కాళ్లు పనిచేయని వ్యక్తిని జుట్టు పట్టుకుని కారులోంచి బయటకు లాగేసిన పోలీసులు

''నేను దివ్యాంగుడిని'' అంటూ అరుస్తోన్న ఒక నల్లజాతీయుడిని పోలీస్ అధికారులు కారులో నుంచి లాగేశారు

ఫొటో సోర్స్, Dayton Police Department

ఫొటో క్యాప్షన్, ''నేను దివ్యాంగుడిని'' అంటూ అరుస్తోన్న ఒక నల్లజాతీయుడిని పోలీస్ అధికారులు కారులో నుంచి బయటకు లాగారు.

''నేను దివ్యాంగుడిని'' అంటూ అరుస్తోన్న ఒక నల్లజాతీయుడిని పోలీస్ అధికారులు కారులో నుంచి బయటకు ఈడ్చిపడేస్తోన్న వీడియోపై అమెరికా పోలీస్ శాఖ దర్యాప్తు చేపట్టింది.

ఆ వీడియోలోని వ్యక్తి 'ఐ యామ్ పారాప్లెజిక్' అంటూ పదేపదే చెబుతున్నారు. పారాప్లెజిక్ అంటే పక్షవాతం కారణంగా కాళ్లు, నడుము కింది భాగం చచ్చుబడటం.

'బాడీ క్యామ్' ఫుటేజీ ప్రకారం, గత నెలలో ఓహియో రాష్ట్రంలోని డేటన్‌లో ప్రయాణిస్తోన్న క్లిఫోర్డ్ ఒవెన్స్‌బై అనే వ్యక్తి కారును పోలీసులు ఆపారు. డ్రగ్స్ నిమిత్తం కారును సోదా చేయాలని పేర్కొంటూ, ఆయన్ను కారు నుంచి దిగమని అడిగారు.

39 ఏళ్ల ఒవెన్స్‌బై, తాను కాళ్లను ఉపయోగించలేనని చెబుతూ కారు నుంచి దిగేందుకు తిరస్కరించారు.

అయితే, ఆయన కచ్చితంగా దిగాల్సిందేనని అధికారులు పట్టుబట్టారు. ఆపై ఆయన సహాయం కోసం అరవడంతో... అధికారులు జుట్టు, చేతులు పట్టుకొని ఆయన్ను కారు నుంచి బయటకు లాగారు.

సెప్టెంబర్ 30న జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు డేటన్ పోలీస్ విభాగం చెప్పింది.

మాదకద్రవ్యాలు ఉన్నట్లు అనుమానిస్తోన్న ఓ ఇంటి నుంచి ఒవెన్స్‌బై రావడంతో అధికారులు ఆయనను అడ్డగించారని పోలీసు అధికారులు తెలిపారు. కారులోని బ్యాగులో 22,450 డాలర్ల (రూ. 16.93 లక్షలు) నగదు పట్టుబడిందని చెప్పారు.

అయితే, ఒవెన్స్‌బై మీద ఎలాంటి డ్రగ్స్ సంబంధిత అభియోగాలు నమోదు కాలేదు.

వీడియో క్యాప్షన్, జార్జ్ ఫ్లాయిడ్‌ను ఎందుకు చంపేశారు? ట్రంప్ బంకర్‌లో ఎందుకు దాక్కున్నారు

ఆ ఘటన జరిగిన సమయంలో కారు నుంచి దిగమని పోలీసులు ఎన్నిసార్లు కోరినా, ఒవెన్స్‌బై పదేపదే విముఖత వ్యక్తం చేశారు. కారు నుంచి దిగేందుకు సహాయం చేస్తామని పోలీసులు చెప్పినప్పటికీ, ఆయన కారు దిగేందుకు ఇష్టపడలేదు.

మీ ఉన్నతాధికారిని పిలవండని ఒవెన్స్‌బై, ఓ అధికారితో అన్నారు.

''ఈ మాట చాలు. నేనిప్పుడు నిన్ను బయటకు లాగబోతున్నా. ఆ తర్వాత మా ఉన్నతాధికారిని పిలుస్తా'' అని వెంటనే ఆ అధికారి బదులిచ్చారు.

''నీ ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. అందులో ఒకటి, మాకు సహకరిస్తూ నీవు కారు నుంచి బయటకు రావడం... రెండోది నేనే, నిన్ను కారు నుంచి బయటకు లాగడం. నీకు ఈ రెండు ఆప్షన్స్ ఇస్తున్నాం'' అని ఆ అధికారి చెప్పారు.

ఆ ఫుటేజీ 'చాలా ఆందోళనకరంగా' ఉందని డేటన్ మేయర్ నాన్ వాలే అన్నారు.

ఆ ఘటనను తాము కూడా పరిశీలిస్తున్నామని పౌర హక్కుల సంఘాలు చెబుతున్నాయి.

''దివ్యాంగుడైన వ్యక్తిని, అలా జుట్టు పట్టుకొని కారు నుంచి బయటకు లాగడం ఆమోదించదగిన చర్య కాదు. అమానుషమైనది. ఈ ఘటన, డేటన్ నగర కీర్తిని మసకబారుస్తుంది'' అని లోకల్ నేషనల్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్ సంస్థకు చెందిన డెరిక్ ఫొవర్డ్, వాషింగ్టన్ పోస్ట్‌తో చెప్పారు.

పక్షవాతానికి గురైన వ్యక్తి, తన శరీరం కింది భాగంలోని అవయవాలను స్వయంగా కదపలేడు.

అయితే, పోలీసు అధికారి చర్యను కొంతమంది సమర్థిస్తున్నారు.

''వారు చట్టప్రకారం నడుచుకున్నారు. వారి ట్రెయినింగ్‌తో పాటు డిపార్ట్‌మెంట్ పాలసీలు అలాగే ఉంటాయి'' అని డేటన్ ఫ్రాటర్నల్ ఆర్డర్ ఆఫ్ పోలీస్ లాడ్జ్ 44 అధ్యక్షుడు జెరోమ్ డిక్స్ అన్నారు.

''కంప్లైంట్ లేకుండా వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం కొన్నిసార్లు తప్పదు. ఎందుకంటే ప్రజాభద్రతను కాపాడటానికి చట్టప్రకారం అలా చేయడం అవసరం'' అని డేటన్ డైలీ న్యూస్‌తో డిక్స్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)