అఫ్గానిస్తాన్: ‘టాయిలెట్‌కు కూడా వెళ్లకుండా ఆరు రోజులు ఎయిర్‌పోర్ట్ బయటే ఉన్నాను, అయినా విమానం ఎక్కలేకపోయాను, తాలిబాన్లు నన్ను చంపేస్తారేమో’

Taliban militant with a rifle

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, స్వామినాథన్ నటరాజన్
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్

గత రెండు వారాలుగా వేలాది మంది అఫ్గాన్ ప్రజలు కాబుల్ విమానాశ్రయానికి చేరుకుని ఎలాగైనా దేశం విడిచి వెళ్లిపోవాలని తీవ్రంగా ప్రయత్నించారు.

వారిలో కొందరు తమ ప్రయత్నాలలో సఫలం కాగా మరికొందరు మాత్రం అఫ్గానిస్తాన్‌లోనే నిస్సహాయంగా మిగిలిపోయారు.

తిండి, నీరు లేకుండా కనీసం కాలకృత్యాలు కూడా తీర్చుకోవడానికి కూడా వీలు లేని పరిస్థితులలో పగలూరాత్రి నిరీక్షించారు.

ఐఎస్-కే ఆత్మాహుతి బాంబ్ దాడి నుంచి, ఆ తరువాత అమెరికా డ్రోన్ దాడుల నుంచి ఎంతో మంది త్రుటిలో తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు.

అమెరికా, మిత్ర దేశాలు కలిపి ఆగస్ట్ 31లోగా 1,23,000 మందిని తరలించినట్లు యూఎస్ అధికారులు చెప్పారు.

అయినప్పటికీ అఫ్గాన్ ప్రభుత్వంలో పనిచేసినవారు, మహిళా కార్యకర్తలు, జర్నలిస్టులు, లైంగిక అల్పసంఖ్యాకులు, మతపరంగా అల్పసంఖ్యాకులు చాలామంది అఫ్గానిస్తాన్ నుంచి బయటపడలేకపోయారు.

ఇలా అఫ్గానిస్తాన్ నుంచి బయటపడేందుకు ప్రయత్నించి దేశం నుంచి వెళ్లలేకపోయిన ముగ్గురితో బీబీసీ మాట్లాడింది.

వారు ముగ్గురూ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. వారి ఉనికి బయటపెట్టకుండా ఉండేందుకు ఈ కథనంలో వారి పేర్లు మార్చాం.

అమెరికాలోని వర్జీనియా ఎయిర్‌పోర్టులో దిగిన ఓ అఫ్గాన్ కుటుంబం

ఫొటో సోర్స్, Getty Images

తాలిబాన్లు కాబుల్‌ను స్వాధీనం చేసుకున్న తరువాత నజీఫ్ తన భార్యాబిడ్డలతో కలిసి ఇల్లొదిలి వచ్చారు.

''దురదృష్టవశాత్తు నేను నా ఇంట్లో ఉండలేని పరిస్థితి. ఇంటి నుంచి బయటకు వచ్చేశాక తాలిబాన్లకు దొరకకుండా రోజుకో చోటికి మారాం. ప్రస్తుతం మా బంధువుల ఇంట్లో దాక్కున్నాను'' అని చెప్పారు నజీఫ్.

అఫ్గాన్ ప్రభుత్వంలో మేనేజరుగా పనిచేసిన నజీఫ్‌కు తాలిబాన్లతో చాలాకాలంగా సమస్య ఉంది. తాలిబాన్ ప్రాబల్య గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఇచ్చిన రుణాలను ఆడిట్ చేయడానికి ఆయన్ను పంపించేటప్పుడు సమస్యలు మొదలయ్యాయి.

''ఈ పని కోసం నేను రైతులతో మాట్లాడడానికి రెండేళ్లలో 18 ప్రావిన్సులలో తిరిగాను. విదేశీ నిధులతో చేపట్టిన ఈ ఆడిట్ ప్రాజెక్ట్ తాలిబాన్లకు అస్సలు ఇష్టం లేదు. ఈ ప్రాజెక్టులో భాగంగా నేను తిరుగుతున్న సమయంలో తాలిబాన్ల కార్యకలాపాలు చూస్తుండేవాడిని. ఆ విషయాలు మీడియాలో ఉన్న నా స్నేహితులకు చెప్పేవాడిని''

''దాంతో మీడియాలో వచ్చే కథనాలకు సోర్స్ నేనేనని తెలుసుకున్న తాలిబాన్లు నా సోదరుడి ద్వారా నాకు హెచ్చరిక పంపించారు. వాళ్ల వార్నింగులు పట్టించుకోకపోవడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా వాళ్లకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడంతో వాళ్లకు లక్షమయ్యాను'' అన్నారు నజీఫ్.

''నేను ప్రభుత్వంలో చాలామంది ఉద్యోగుల సర్వీస్ రికార్డుల వ్యవహారాలు చూసే శాఖలో ఉన్నాను. కాబట్టి నన్ను పట్టుకుంటే తాలిబాన్లు లక్ష్యంగా చేసుకోవాలనుకునే అనేక మంది ఇతరుల వివరాలు కూడా తెలుస్తాయనే ఉద్దేశంతో నాకోసం వెతుకుతున్నారు'' అని నజీఫ్ చెప్పారు.

గత రెండు వారాలుగా తాలిబాన్లు మూడుసార్లు తన ఇంటివి వచ్చి తన ఇరుగుపొరుగు వారిని తన కోసం అడిగారని, గత ప్రభుత్వంలో పనిచేసిన ఏడుగురిని రెండు రోజుల కిందట తాలిబాన్లు చంపేశారని నజీఫ్ చెప్పారు.

తాను విదేశీ సేనల కోసం పనిచేయకపోవడం వల్ల తనను అఫ్గానిస్తాన్ నుంచి తీసుకెళ్లేందుకు ఈ పాశ్చాత్య దేశమూ పిలవలేదని.. అయినా, ఏదైనా అవకాశం దొరుకుతుందేమోనని భార్యబిడ్డలను తీసుకుని ఎయిర్‌పోర్టుకు బయలుదేరానని నజీఫ్ తెలిపారు.

''నాలుగుసార్లు ప్రయత్నించినా బయటపడలేకపోయాను. తాలిబాన్ల నుంచి ప్రమాదం ఉందనడానికి సంబంధించిన ఆధారాలు ఉన్నా ఎంబసీ అధికారులను సంప్రదించడానికే వీలులేకపోయింది. కనీసం ఎయిర్‌పోర్టు గేటు వరకు కూడా వెళ్లనివ్వలేదు'' అన్నారాయన.

తాలిబాన్లు ఇప్పుడు మరింత పట్టు పెంచుకున్న తరువాత తాను ఎక్కడికీ వెళ్లలేకపోవచ్చని నజీఫ్ ఆందోళన చెందుతున్నారు. అందుకే స్మగ్లర్లకు డబ్బు చెల్లించి భార్యబిడ్డలతో కలిసి ప్రమాదకర ప్రయాణం చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారు.

ఇది చాలా కష్టమైన ప్రయాణమని నజీఫ్‌కు తెలుసు. ఇలాంటి ప్రయత్నాలలో ఒక్కోసారి ప్రాణాలు పోతాయని, మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవుతాయనీ నజీఫ్‌కు తెలుసు.

తాలిబాన్లు పొరుగుదేశాలతో సరిహద్దులన్నీ మూసివేయడంతో ఈ ప్రయాణం కూడా చాలా రిస్కుతో కూడుకున్నదని, తాను కాబుల్‌లో ఉంటే కచ్చితంగా చంపేస్తారని తెలుసు కాబట్టి ఈ రిస్క్ తీసుకుంటున్నట్లు నజీఫ్ చెప్పారు.

తాలిబాన్లు

ఫొటో సోర్స్, Getty Images

'ఇక్కడ నాకు రక్షణ లేదు'

''ఇక్కడ నా జీవితం ఏమాత్రం భద్రంగా లేదు. అందుకే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నాను'' అన్నారు అహ్మద్.

అహ్మద్ ఒక జర్నలిస్ట్. చాలాకాలం పాత్రికేయ వృత్తిలో ఉన్న తరువాత అఫ్గాన్ ప్రభుత్వ విభాగంలో మీడియా సలహాదారుగా పనిచేశారు.

అహ్మద్‌‌కు ఇంతవరకు ప్రత్యక్షంగా ఎలాంటి బెదిరింపులు రానప్పటికీ ఆయన పనిచేసిన ఆఫీసు నుంచి అన్ని డాక్యుమెంట్లూ తాలిబాన్లు ఎత్తుకెళ్లడం, అందులో తన పేరు సహా మొత్తం సిబ్బంది పేర్లు ఉండడంతో తనకూ ముప్పు ఉంటుందని ఆయన భయపడుతున్నారు.

''ప్రస్తుతం తాలిబాన్లు ఇప్పుడు అసాధారణంగా వ్యవహరించడం లేదు. కానీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత వారు ఎలా మారుతారనేది తెలియదు'' అన్నారు అహ్మద్.

తాలిబాన్లు మరింత పట్టు పెంచుకుని సమయం చూసి తాము శత్రువులుగా భావించే అందరినీ ఏరిపడేస్తారని అహ్మద్ అనుమానిస్తున్నారు.

అందరికీ క్షమాభిక్ష పెడుతున్నట్లుగా తాలిబాన్లు చేసిన ప్రకటనను ఆయన నమ్మడం లేదు.

అహ్మద్‌కు యూకే వీసా ఉన్నందున దేశం విడిచివెళ్లిపోవడం నయమని భార్య, సోదరుడు ఆయనకు సూచించారు. దాంతో అహ్మద్ గురువారం కాబుల్ విమానాశ్రయానికి వెళ్లారు. కానీ, అప్పటికే ఎయిర్‌పోర్టు బయట రహదారి మొత్తం ప్రజలతో నిండిపోయింది. వారందరినీ దాటుకుని ముందుకు వెళ్లే అవకాశం లేదని గుర్తించిన ఆయన రోడ్డు పక్కనున్న ఓపెన్ డ్రైనేజ్‌లో దిగి మోకాలి లోతు మురుగు నీటిలో నడుస్తూ ముందుకు సాగారు.

''అప్పుడు చెవులు దద్దరిల్లిపోయే శబ్దం వినిపించింది. భారీ ప్రకంపనలు వచ్చినట్లయ్యాయి. నాకు 150 మీటర్ల దూరంలోనే బాంబు పేలింది. ఆ పేలుడు ధాటికి కాలువలోంచి బయటకు విసిరేసినట్లుగా పడ్డాను. నా చేతులు, ముఖం అంతా గాయాలయ్యాయి. ఆ బాంబు దాడిలో 13 మంది అమెరికా సైనికులు సహా 170 మంది మరణించారు'' అన్నారు అహ్మద్.

అప్పుడు అహ్మద్ తన ఫోన్లో తీసిన వీడియో ఆ పేలుడు సృష్టించిన బీభత్సాన్ని ప్రపంచానికి చూపించింది. విసిరేసినట్లుగా ఉన్న బ్యాగులు, బూట్లపై మృతదేహాలు, మాంసపు ముద్దలు పడి కనిపించాయి.

ఎలాగైనా వీలైనంత త్వరగా అఫ్గానిస్తాన్ నుంచి బయటపడాలని అహ్మద్ భావిస్తున్నారు. కమర్షియల్ ఫ్లైట్స్ ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియదని.. అందుకే ఏదో రకంగా పాకిస్తాన్ చేరుకుని అక్కడి నుంచి బ్రిటన్ వెళ్లాలనుకుంటున్నానని చెప్పారు.

తాలిబాన్లు ఎక్కడికక్కడ కార్లను ఆపి, గుర్తింపు కార్డులు తనిఖీ చేస్తుండడంతో తన ప్రయాణం అంత ఈజీగా సాగకపోవచ్చని అహ్మద్ భయపడుతున్నారు.

అఫ్గాన్ శరణార్థులు

ఫొటో సోర్స్, Getty Images

'నాకూ తాలిబాన్ల నుంచి ముప్పు ఉంది'

యూకే ప్రభుత్వం నుంచి పిలుపు రావడంతో పర్వానా కాబుల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు.

''నా భర్త విదేశీ సేనల కోసం పనిచేసేవారు. అందుకే నాకూ తాలిబాన్ల నుంచి ముప్పు ఉంది'' అని చెప్పారు పర్వానా.

అయితే, ఆమె ఎయిర్‌పోర్టు వరకు వెళ్లలేక అఫ్గానిస్తాన్‌లోనే చిక్కుకుపోయారు.

అఫ్గానిస్తాన్‌లో బ్రిటిష్ సేనల కోసం పనిచేసిన ఒక ఇంటర్‌ప్రెటర్‌ను పర్వానా పెళ్లాడారు. ఆయన కొన్నేళ్ల కిందటే బ్రిటన్ వెళ్లిపోయారు. ఒకవేళ తాలిబాన్లు కాబుల్‌ను స్వాధీనం చేసుకుంటే భార్యను కూడా బ్రిటన్ తీసుకొచ్చేలా యూకే నుంచి ఆమోదం పొందారు.

కానీ ఆమె పాస్‌పోర్టుపై వీసా స్టాంప్ చేసి లేకపోవడంతో అఫ్గానిస్తాన్ నుంచి బయటపడలేకపోయారు.

''అఫ్గాన్‌లో యూకే రాయబార కార్యాలయాలు మూసివేశారు. వేరే దేశం నుంచి నాలాంటివారిని తరలించేందుకు ఎలాంటి విధానం అనుసరిస్తారో తెలియదు. నా పరిస్థితి ఘోరంగా ఉంది'' అన్నారు పర్వానా.

ఆగస్ట్ 14 నుంచి బ్రిటన్ 15 వేల మందిని అఫ్గాన్ నుంచి తరలించింది. కానీ, పర్వానాకు మాత్రం అవకాశం రాలేదు.

''కాబుల్ విమానాశ్రయం బయట నేను ఆరు రోజులు రాత్రీపగలు పడిగాపులు కాశాను. చాలా రద్దీగా ఉంది. అక్కడే దుమ్ముధూళిలో కూర్చున్నాను. ఏమాత్రం సురక్షితంగా లేదక్కడ. నేను లోపలికి వెళ్లేందుకు ఎంత ప్రయత్నించినా కొంచెం కూడా ముందుకు వెళ్లలేకపోయాను'' అని చెప్పారు పర్వానా.

అఫ్గానిస్తాన్ మ్యాప్

ఫొటో సోర్స్, Getty Images

విమానాశ్రయం బయట నిరీక్షించిన సమయంలో మరుగుదొడ్లు లేకపోవడంతో తిండి తినకుండా ఉండేందుకు కూడా ఆమె ప్రయత్నించారు.

కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఒక రోజు ఆమె ఎయిర్‌పోర్టు సమీపంలోని తన బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి జనం మరింత ఎక్కువై అప్పటి వరకు ఆమె ఉన్న చోటి నుంచి క్యూలో ఇంకా వెనక్కు ఉండాల్సి వచ్చింది. ఎయిర్‌పోర్టు గేటు నుంచి ఆ ప్రాంతం చాలా దూరం ఉండడం.. ఎంత నిరీక్షించినా ముందుకు వెళ్లలేకపోవడంతో చివరకు ఆమె ఇంటికి తిరిగి వచ్చేశారు.

మళ్లీ విమానాల రాకపోకలు మొదలైతే కాబుల్ ఎయిర్‌పోర్ట్ దగ్గర పరిస్థితి ఇప్పటి కంటే కూడా ఇంకా ఘోరంగా ఉంటుందని పర్వానా భావిస్తున్నారు.

ప్రస్తుతం కాబుల్ వీధుల్లో తాలిబాన్ సాయుధులు తిరుగుతుండడంతో ఆమె భయంతో ఎక్కడికీ వెళ్లడం లేదు. ఇంటి పట్టునే ఉంటున్నారు. వీధులన్నీ ఖాళీగా ఉంటున్నాయని పర్వానా చెప్పారు.

అఫ్గాన్ ప్రజలను తరలించే చివరి విమానం కూడా వెళ్లిపోయిన తరువాత ఆమె ఆశలు వదిలేసుకున్నారు. అఫ్గాన్ నుంచి బయటకు వెళ్లాలనుకునే వారిని సురక్షితంగా తీసుకెళ్లేలా పాశ్చాత్య దేశాలు తాలిబాన్లపై ఒత్తిడి తేవాలని ఆమె కోరుతున్నారు.

''అంతర్జాతీయ సమాజం మమ్మల్ని మరచిపోకుండా మాకు సహాయం చేయాలి. వారు సమయం వృథా చేస్తే నాలాంటి వారు బతకడం కష్టమవుతుంది'' అని అన్నారు పర్వానా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)