అఫ్గానిస్తాన్: 'మూడు రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు, మహిళలకూ ప్రాతినిధ్యం' - అబ్బాస్ స్టానిక్‌జాయ్

తాలిబాన్

ఫొటో సోర్స్, EPA

అఫ్గానిస్తాన్ రెండవ అతిపెద్ద నగరం కాందహార్‌లో తాలిబాన్లు విజయోత్సవ పరేడ్ నిర్వహించారని ఏఎఫ్‌పీ జర్నలిస్ట్ ఒకరు చెప్పారు.

కాందహార్‌లో హమ్వీ జీపులు, వివిధ రకాల ట్రక్కులను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఇలా స్వాధీనం చేసుకున్న అమెరికా మిలిటరీ వాహనాలు, పరికరాలతో కవాతు జరిగిందని ఏఎఫ్పీ జర్నలిస్ట్ తెలిపారు.

ఓ బ్లాక్ హాక్ హెలికాప్టర్ నగరం మీద ఎగురుతూ కనిపించిందని వివరించారు.

కాందహార్ క్రికెట్ గ్రౌండ్‌లో తాలిబాన్ నాయకులు కుర్చీల్లో కూర్చొని ఉన్నారు. టెర్రస్‌లలో వందలాది మంది మద్దతుదారులు ఉన్నారు.

ఒక నగరం తరువాత మరో నగరానికి చెందిన అఫ్గాన్ నేషనల్ డిఫెన్స్,సెక్యూరిటీ ఫోర్సెస్ నుంచి సైనికులు లొంగిపోయారు. అనంతరం వీరి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

తాలిబాన్ల అగ్ర నాయకుడు హీబాతుల్లా అఖండ్ జాదా కవాతుకు హాజరవుతారని ప్రచారం జరిగింది.

కానీ సమావేశం ముగిసే వరకు కూడా ఆయన రాలేదు.

షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టానిక్‌జాయ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టానిక్‌జాయ్

'మూడు రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు, మహిళలకూ ప్రాతినిధ్యం' - అబ్బాస్ స్టానిక్‌జాయ్

అఫ్గానిస్తాన్‌లో మూడు రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఖతర్‌లోని అఫ్గాన్ తాలిబాన్ రాజకీయ కార్యాలయంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టానిక్‌జాయ్ తెలిపారు.

బీబీసీ పష్తో రేడియోకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన, "కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంలో గత 20 ఏళ్ల కాలంలో ప్రభుత్వంలో పని చేసిన వారెవరూ ఉండరు" అని స్టానిక్‌జాయ్ అన్నారు.

ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ అఫ్గానిస్తాన్ ప్రభుత్వం ఏర్పడుతుందనండలో ఎలాంటి సందేహం లేదని చెప్పిన ఈ నాయకుడు, "దేశంలోని అన్ని ప్రాంతాల వారు ప్రభుత్వంలో ఉంటారు. గత 20 ఏళ్లలో ఏ రూపంలోనైనా అధికారం వ్యవస్థలో పని చేసిన వారెవరికీ ఇకపై స్థానం ఉండదు" అని చెప్పారు.

అంతకుముందు, తాలిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్, ప్రభుత్వ ఏర్పాటు గురించి కాందహార్‌లో తమ నాయకుడు ముల్లా హబీబుల్లా అఖుంద్‌జాదా నాయకత్వంలో మూడు రోజులుగా జరిగిన సమావేశం ముగిసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

ప్రభుత్వంలో మహిళలు

తమ ప్రభుత్వంలో మహిళలు కూడా ఉంటారని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టానిక్‌జాయ్, "అయితే, వారిని మంత్రుల స్థాయిలో, కీలక స్థానాల్లోకి తీసుకోవాలా వద్దా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు" అని అన్నారు.

ప్రభుత్వంలో మహిళలు అధిక సంఖ్యలో ఉంటారనే విషయంలో ఎలాంటి సందేహం లేదని స్టానిక్‌జాయ్ చెప్పారు. అయితే, కీలక పదవుల్లో ఉంటారా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు. ప్రభుత్వంలో మహిళలు ఉండడం తమకు సమస్య కాదని, వారు అధికార వ్యవస్థల్లో కూడా పని చేస్తారని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, అఫ్గానిస్తాన్: తుపాకులు పేల్చి సంబరాలు చేసుకున్న తాలిబాన్లు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)