కోవిడ్: తల స్నానాలు ఎక్కువైతే జలుబు చేస్తుందా

జలుపు, దగ్గు

ఫొటో సోర్స్, Thinkstock

ఫొటో క్యాప్షన్, తల మీద నీళ్లు పడితే జలుబు చేస్తుందా ?
    • రచయిత, క్లాడియా హమాండ్
    • హోదా, బీబీసీ ఫీచర్ కరస్పాండెంట్

తల తడిస్తే నిజంగా జలుబు చేస్తుందా ? ఈ కరోనా కాలంలో ఒక తుమ్ము వచ్చినా పక్కనున్నవారు హడలి పోతున్నారు. మరి అంతగా భయపెట్టే ఈ జలుబు ఎందుకు వస్తుంది ? కారణమేంటి ?

నీళ్లలో తల తడిస్తే జలుబు చేస్తుందన్న నమ్మకం ఇప్పటికీ అనేక సమాజాల్లో బలంగా ఉంది. అయితే ఈ నమ్మకం ఎంత వరకు నిజమన్నది కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నించారు.

'నీకు జలుబు చేస్తుంది'- నేను తలస్నానం చేసి సరిగా ఆరకుండానే బయట అడుగు పెడుతుంటే మా నాన్నమ్మ తరచూ ఇచ్చే వార్నింగ్ ఇది.

అయితే ఈ నమ్మకం ఇవాళ్టిది కాదు...శతాబ్దాలుగా ఉంది. చల్లదనంలో తిరిగినా, తడిచిన తలను వెంటనే ఆరబెట్టక పోయినా జలుబు చేస్తుందంటారు.

అసలు జలుబు అనే మాట చల్లదనానికి పర్యాయ పదంగా మారింది. జలుబు చేస్తే ముక్కు కారడంతో మొదలై గొంతు నొప్పి, దగ్గుతో ముగుస్తుంది.

డాక్టర్లు మాత్రం జలుబుకు కారణం వైరస్ అని చెబుతారు. కానీ మరి నేను తలస్నానం చేసి సరిగ్గా ఆరబెట్టకుకోకుండా బయటకు వెళుతుంటే మా నాన్నమ్మ ఎందుకు తిడుతుంది ? ఆమె వార్నింగ్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదా ?

జలుపు, దగ్గు

ఫొటో సోర్స్, BRICE PORTOLANO

ఫొటో క్యాప్షన్, చల్లదనం కారణంగా ముక్కు, గొంతులలోని రక్తనాళాలు బిగుసుకు పోతాయి.

సీజనల్ సమస్య...

నేను బ్రిటన్‌లో ఉంటాను కాబట్టి...సహజంగానే వాతావరణం మీద అధ్యయనం చేయడం మొదలు పెట్టాను. జర్మనీ, అర్జెంటీనాలలో చలికాలంలో ఎక్కువమంది జలుబు బారిన పడుతుంటారు.

అలాగే గినియా, మలేషియా, గాంబియాలాంటి దేశాలలో వర్షాకాలంలో జలుబు సమస్య ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించారు.

ఈ పరిశోధనలను బట్టి తేలింది ఏంటంటే, తడి, చల్లదనాలకు జలుబుతో సంబంధం ఉంది అని. అయితే దీన్ని నిరూపించడం ఎలా? బాగా చలిలో, వర్షంలో జనం సాధారణంగా ఇళ్లలో ఉండిపోతారు. ఆ సమయంలో ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుందా ?

అసలు చలి, తేమ వాతావరణం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? కొందరు వలంటీర్లను జలుబు వైరస్‌కు చేరువగా, అలాగే తక్కువ ఉష్ణోగ్రతలు అంటే చల్లదనం ఎక్కువ ఉండే ప్రదేశాలలో ఉంచి ప్రయోగం చేసి చూశారు.

కానీ దీనివల్ల ఎలాంటి ఫలితాన్ని రాబట్టలేక పోయారు. కొన్ని పరిశీలనల్లో చల్లదనంలో ఎక్కువ సేపు ఉన్న వారికి జలుబు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

అయితే మరో పద్ధతిలో చేసిన ప్రయోగంలో నీటిలో తల తడిస్తే జలుబు చేస్తుందన్న వాదనకు కొన్ని ఆధారాలు లభించాయి.

చలి, తేమలాంటివి వైరస్‌ను ఎలా యాక్టివేట్ చేస్తాయో తెలుసుకోవడానికి బ్రిటన్‌లోని కామన్ కోల్డ్ సెంటర్ డైరక్టర్‌గా పని చేస్తున్న రాన్ ఎక్లెస్ ప్రయత్నించారు.

ఈ క్రమంలో కొందరిని ప్రయోగశాల పరిస్థితులలో చల్లని వాతావరణంలో కొంతసేపు ఉంచారు. తర్వాత వారిని సామాన్య జనంలో తిరిగేలా చూశారు. అయితే ఆ సామాన్య జనంలో అనారోగ్యం లేకపోయినా, జలుబు, దగ్గు లక్షణాలున్న వారు కూడా ఉన్నారు.

ఎక్లెస్ ఎంపిక చేసిన వలంటీర్లు చల్లటి నీటిలో 20 నిమిషాల పాటు కూర్చున్నారు. మిగిలిన వారు తమ షూ, సాక్స్ సగం వరకు మాత్రమే మునిగే స్థాయి నీటిలో కూర్చున్నారు.

రెండు గ్రూపులను పరిశీలించినప్పుడు మొదటి కొన్ని రోజులు వారిలో జలుబు లాంటి లక్షణాలు కనిపించ లేదు. అయితే నాలుగైదు రోజుల తర్వాత చల్లటి నీటిలో కూర్చున్న వ్యక్తులలో జలుబు లక్షణాలు కనిపించాయి.

జలుపు, దగ్గు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జలుబుకు చల్లదనం నేరుగా కారణంగా కాకపోవచ్చు.

తక్కువ వ్యాధి నిరోధకత

కాళ్లు చల్లటి నీటిలో పెట్టినా, తల తడిసి ఉన్నా, జలుబు తెప్పించే మెకానిజం ఒకటుందని మనం ఈజీగా అర్ధం చేసుకోవచ్చు.

శరీరం చల్లదనానికి లోనయినప్పుడు, ముక్కు, గొంతులలో ఉండే రక్తనాళాలు బిగుసుకుపోతాయి. ఇన్‌ఫెక్షన్లపై యుద్ధం చేసే తెల్ల రక్త కణాలను సరఫరా చేసేది ఈ రక్త నాళాలే.

అంటే చల్లదనం కారణంగా రక్తనాళాలు బిగుసుకుపోయి, వైరస్‌లపై పోరాడే కణాలు అందుబాటులో లేకుండా పోతాయి.

ఇక తల తుడుచుకున్నప్పుడు, లేదంటే వెచ్చని ప్రదేశాలకు వెళ్లినప్పుడు రక్తనాళాలు మళ్లీ తెరుచుకుంటాయి. అయితే ఈ వెచ్చదనం త్వరగా లభించకపోతే, వైరస్ పెరిగిపోయి, లక్షణాలు తీవ్రమయ్యే అవకాశం ఉంది.

దీనిని బట్టి అర్థమయ్యే విషయం ఏంటంటే, చల్లదనంతో కలిసి జలుబు వైరస్ మనలోకి చేరదు. కానీ, చేరడానికి అవకాశాలు పెరుగుతాయి. లేదంటే తెల్ల రక్త కణాలు ప్రభావం లేకపోవడం వల్ల అవి యాక్టివేట్ అవుతాయి.

అయితే ఈ ప్రయోగంపై ఇప్పటికీ వివాదం ఉంది. ఎక్లెస్ చేసిన ప్రయోగంలో చాలామందికి జలుబు లక్షణాలు బయట పడ్డాయి. అయితే అవి వైరస్ కారణంగానే వచ్చాయా లేదా అన్న విషయం వైద్యపరంగా నిరూపణ కాలేదు.

ఇక్కడ మరో విషయం ఏంటంటే, నార్వేలో ఆరోగ్యానికి సంబంధించిన అనేక నమ్మకాలలో వైరస్ ఇన్‌ఫెక్షన్‌కు సంబంధించిన నమ్మకం కూడా ఒకటి ఉంది.

మహిళల కాళ్లు తడిసేలా చల్లదనంలో పని చేసినప్పుడు, వారికి మూత్ర కోశానికి ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని నార్వేలో చాలామంది భావిస్తారు.

ముక్కు, గొంతుల రక్త నాళాలలో జరిగినట్లుగానే, మూత్ర నాళంలో కూడా ఇదే ప్రక్రియ జరుగుతుందని చెబుతారు. కాబట్టి తడి జుత్తుతో బయటకు వెళ్లవద్దని మా నాన్నమ్మ ఇచ్చే వార్నింగ్‌లో కొంత వాస్తవం ఉంది.

అయితే చల్లదనం మీకు డైరెక్ట్‌గా జలుబును కలిగించదు. జలుబుకు కారణయ్యే వైరస్‌ను యాక్టివేట్ చేస్తుంది. కాబట్టి, మరిన్ని పరిశోధనలు జరిగే వరకు నేను బయటకు వెళ్లే ముందు నా జుత్తు ఆరబెట్టుకోవాలని అనుకుంటున్నాను.

(గమనిక: ఈ కాలమ్‌లో ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసమే. వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ కథనానికి సంబంధించిన శాస్త్రీయత విషయంలో బీబీసీ ఎలాంటి బాధ్యతా వహించదు.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)