చెట్టు లేకుండానే కలప.. భవిష్యత్తులో అడవులు నరికే అవసరం తగ్గుతుందా

చెక్క

అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు సూర్యరశ్మి, మట్టి అవసరం లేకుండా ప్రయోగ శాలల్లో ఫర్నిచర్ తయారీ కోసం చెక్కను పెంచే ఆలోచన చేస్తున్నారు.

దీనికి సంబంధించి చేస్తున్న అధ్యయనానికి కేంబ్రిడ్జి లోని మసచూషెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పని చేస్తున్న యాష్లే బెక్విత్ నేతృత్వం వహిస్తున్నారు.

"ప్రయోగ శాలల్లో చెక్కను పెంచడం వల్ల కలప అవసరాలకు అడవులపై ఆధారపడడం తగ్గుతుంది" అని ఆమె అన్నారు.

ఆమె బృందంలోని సభ్యులు 3డి ప్రింటెడ్ జెల్ ద్వారా వృక్ష కణాలను నచ్చిన ఆకారంలోకి మలిచి చెక్కను పెంచుతున్నారు.

ఇదే విధమైన సాంకేతికతను చెక్క భాగాలు, పలకలు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. వీటితో అవసరమైన సామగ్రి తయారు చేసుకోవచ్చు.

బెక్విత్ బీబీసీ 5 లైవ్ కార్యక్రమంలో మాట్లాడారు.

"మనకు కావల్సిన ఆహారం మొదలుకొని మౌలిక సదుపాయాలకు కావల్సిన సామగ్రి, వినియోగ వస్తువులు, బయో ఇంధనానికి అవసరమైన పంటల కోసం కూడా ప్రస్తుతం ప్రపంచంలో వృక్ష ఆధారిత ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది" అని ఆమె అన్నారు.

"సాగు చేయగలిగే కొంత మేర భూమిలో మాత్రం మేం ఈ ప్రయోగం చేస్తున్నాం" అని చెప్పారు.

"వృక్షాలను పెంచడానికి చాలా వనరులను వెచ్చిస్తాం. కానీ, ఒక మొక్కలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే నిజానికి ఉపయోగిస్తాం. భూమి మీద పూర్తిగా ఆధారపడకుండా ఉత్పత్తులను తయారు చేసేందుకు ఒక వ్యూహాన్ని ఆలోచించాలి అని ఆమె అన్నారు.

ఆష్లే

ఫొటో సోర్స్, KATE BERRY

ఫొటో క్యాప్షన్, ఆష్లే

ఈ విధానాన్ని నిరూపించేందుకు తమ బృందం జిన్నియా మొక్కను వాడి చిన్నచిన్న నమూనాలను పెంచడం మొదలుపెట్టినట్లు ఆమె చెప్పారు. వీటి పరిమాణాలను నెమ్మదిగా పెంచే ఆలోచన కూడా ఉంది.

"ఒక కాఫీ టేబుల్ పరిమాణానికి కావల్సిన చెక్కను పెంచడం కాస్త నెమ్మదిగా చోటు చేసుకునే ప్రక్రియ. దీనికి కొన్ని నెలల సమయం పట్టవచ్చు. కానీ, సాధారణ చెట్టు పెరగడానికి 20 సంవత్సరాలు పడితే దీనికి అంత సమయం పట్టదు" అని ఆమె అన్నారు.

"ఒక పెద్ద టేబుల్‌కు కావల్సినంత చెక్కను పెంచగలనో లేదో నాకు తెలియదు. అలా పెంచడం వలన స్థలాన్ని సక్రమంగా వినియోగించలేం. కానీ, ఇక్కడ కూడా వీటిని పెంచేందుకు చాలా అవకాశమైతే ఉంది’’ అన్నారామె.

జిన్నియా మొక్కను వాడి చిన్న చిన్న నమూనాలను పెంచుతున్నారు.

ఫొటో సోర్స్, ARINA_BOGACHYOVA

ఫొటో క్యాప్షన్, జిన్నియా మొక్క

చెట్ల నుంచి వచ్చే చెక్కకు , ప్రయోగశాలల్లో పెంచిన చెక్కకు ఉండే తేడాను ఆమె వివరించారు.

"సంప్రదాయ తరహా చెక్క ఒక క్రమపద్దతిలో ఉంటుంది. అవి చెట్టు ఆకారానికి అనుగుణంగా పెరగడం వలన ఒక నిర్ణీత ఆకారంలో ఉంటాయి. కానీ, ప్రయోగశాలలో పెంచిన చెక్కకి ఈ విధమైన ఆకారం ఉండదు. ఇది ఒక బ్లాక్ లా ఉండి ఒక ప్రత్యేక ఆకారంతో ఉండదు" అని చెప్పారు.

ప్రస్తుతం దీని పై జరుగుతున్న పరిశోధన ప్రారంభ దశలోనే ఉంది. మరో 10 ఏళ్లలో ఈ అంశంపై పురోగతి కనిపించవచ్చని ఆమె ఆశిస్తున్నారు.

"ఇదొక గొప్ప దూర దృష్టితో కూడిన అంశం. దీని పట్ల చాలా మంది ఆసక్తి కూడా చూపించారు.

"ఈ సమస్య గురించి మనలో చాలా మందికి తెలుసు. దీనిని నివారించాలని కూడా అనుకుంటాం. అందుకే దీనిపై ఆసక్తిని కలిగించి ఈ ప్రయత్నంలో మరింత మందిని భాగస్వాములను చేయడం ద్వారా ఇది జరిగేలా చూడవచ్చు" అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)