IND vs Bangladesh U19: అండర్-19 వరల్డ్ చాంపియన్ బంగ్లాదేశ్... పైనల్లో భారత్‌పై విజయం

బంగ్లాదేశ్

ఫొటో సోర్స్, Getty Images

అండర్ 19 క్రికెట్ వరల్డ్‌కప్ బంగ్లాదేశ్ సొంతమైంది.

ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్‌పై బంగ్లాదేశ్ డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో విజయం సాధించింది.

భారత్ విధించిన 178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, వర్షం కారణంగా మ్యాచ్ ఆగే సమయానికి బంగ్లాదేశ్ 41 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది.

దీంతో డక్‌వర్త్ లూయీస్ పద్ధతిలో లక్ష్యాన్ని 170 పరుగులుగా సవరించారు. 42.1 ఓవర్లలో బంగ్లాదేశ్ ఈ లక్ష్యాన్ని చేరింది.

ఇన్నింగ్స్ ఆరంభంలో బంగ్లాదేశ్‌ టాప్, మిడిల్ ఆర్డర్‌‌ను బిష్ణోయ్ గట్టి దెబ్బే కొట్టాడు. తొలి నలుగురు బ్యాట్స్‌మెన్‌ను అతడు ఔట్ చేశాడు. సుశాంత్ మిశ్ర మరో రెండు వికెట్లు తీశాడు.

దీంతో 25 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ ఆరు వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. ఆ దశలో భారత్‌లో ఆశలు చిగురించాయి.

అడ్డగీత
News image
అడ్డగీత

రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన బంగ్లా ఓపెనర్ పర్వేజ్ (47) మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చి జట్టును ఆదుకున్నాడు. అక్బర్ అలీ (43 నాటౌట్)తో కలిసి ఏడో వికెట్‌కు 41 పరుగులు జోడించాడు.

దీంతో ఓ దశలో 102 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన బంగ్లా.. అతడు ఔటయ్యే సమయానికి 143 పరుగులకు చేరుకుంది. అప్పటికి 32 ఓవర్లు పూర్తయ్యాయి.

ఆ తర్వాత బంగ్లా బ్యాట్స్‌మెన్ అక్బర్ అలీ, రకిబుల్ హసన్ (9) వికెట్లు ఏమీ పడకుండా చూసుకున్నారు. చాలా ఓవర్లు మిగిలుండటంతో నింపాదిగా ఆడి బంగ్లాను విజయానికి చేరువ చేశారు.

బిష్ణోయ్

ఫొటో సోర్స్, Getty Images

బ్యాటింగ్‌లో తడబడిన భారత్

దక్షిణాఫ్రికాలోని పోచెస్‌ట్రూమ్‌లో ఫైనల్ జరిగింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ బ్యాటింగ్‌లో తడబడింది.

పూర్తి ఓవర్లు కూడా ఆడకుండానే 177 పరుగులకు ఆలౌటైంది.

భారత బ్యాట్స్‌మెన్‌లో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (121 బంతుల్లో 88) టాప్ స్కోరర్.

భారత్ బ్యాటింగ్ ఆరంభం నుంచి నత్తనడకన సాగింది.

ఓపెనర్ దివ్యాంశ్ సక్సేనా(17 బంతుల్లో 2) ఏడో ఓవర్‌లో ఔటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 9 పరుగులు మాత్రమే.

25 ఓవర్లు ముగిసేసరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 80 పరుగులు మాత్రమే చేయగలిగింది.

అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్

ఫొటో సోర్స్, FACEBOOK/YASHASVI JAISWAL

ఫొటో క్యాప్షన్, యశస్వి జైశ్వాల్

ఆ తర్వాత యశస్వి ఇన్నింగ్స్ వేగం పెంచేందుకు ప్రయత్నించినా, వికెట్లు కూడా త్వరత్వరగా పడ్డాయి.

వన్‌డౌన్‌లో వచ్చిన తిలక్ వర్మ (65 బంతుల్లో 38).. 29వ ఓవర్ చివరి బంతికి క్యాచౌట్ అయ్యాడు. అతడి స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గార్గ్ (7) కూడా 32వ ఓవర్‌లో ఔటయ్యాడు. 32 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 114-3.

40వ ఓవర్ చివరి రెండు బంతులకూ వికెట్లు పడ్డాయి. యశస్వి జైశ్వాల్ (121 బంతుల్లో 88), వీర్ (0) వెంటవెంటనే ఔటయ్యారు. దీంతో జట్టు స్కోరు 156-5గా మారింది.

ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌లో జురెల్ (38 బంతుల్లో 22) మినహా ఎవరూ మూడు పరుగులకు మించి చేయలేకపోయారు.

బంగ్లాదేశ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. అవిషేక్ దాస్ మూడు వికెట్లు తీయగా.. షోరిఫుల్ ఇస్లాం, హసన్ షకీబ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్

ఫొటో సోర్స్, Getty Images

బంగ్లాదేశ్‌కు తొలి కప్..

అండర్-19 వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకోవడం బంగ్లాదేశ్‌కు ఇదే తొలిసారి. ఏ మాత్రం అంచనాల్లేని బంగ్లాదేశ్ యువ జట్టు తొలిసారిగా వరల్డ్ కప్ ఆసాంతం అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఫైనల్స్‌‌కు చేరుకుంది.

భారత్ ఇదివరకు నాలుగు సార్లు ఈ కప్‌ను గెలుచుకుంది.

ఈసారి లీగ్ దశలో రెండు జట్లు అజేయంగా నిలిచాయి. నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్.. ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌లను ఓడించగా; బంగ్లాదేశ్.. దక్షిణాఫ్రికా, న్యూజీలాండ్ జట్లను చిత్తు చేసింది.

భారత్ తరపున యశస్వి జైశ్వాల్ పరుగుల వరద పారించాడు. బంగ్లాదేశ్ జట్టు నుంచి తన్‌జీద్‌ హసన్ బ్యాటింగ్‌లో చెలరేగి ఆడుతూ వచ్చాడు.

బౌలింగ్‌ విషయానికొస్తే కార్తీక్ త్యాగి, సుశాంత్ మిశ్రలతో భారత్ పేస్ దళం బలంగా కనిపించింది. వారికి తోడు లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా మారాడు.

బంగ్లాదేశ్‌ కూడా బౌలింగ్ విభాగంలో బలం చూపించింది. తన్‌జీమ్ హసన్, షరీపుల్ ఇస్లామ్ పేస్ బౌలింగ్‌తోనూ, రకీబుల్ హాసన్ స్పిన్ బౌలింగ్‌తోనూ ప్రత్యర్థులను హడలెత్తించారు.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)