కరోనా వైరస్: ‘భయమేస్తోంది.. దీనిపై అదుపు లేదు, మాస్కులు దొరకడం లేదు’

కరోనా వైరస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వుహాన్ నగర ప్రజలు
    • రచయిత, సెలెస్టినా ఓలులోడే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇది లెలె తన కుటుంబంతో కలిసి సరదాగా, సంతోషంగా గడపాల్సిన సమయం. పనుల నుంచి హాయిగా విశ్రాంతి తీసుకోవాల్సిన సందర్భం.

అసలు పేరు చెప్పడానికి ఇష్టపడని ఈ 23 ఏళ్ల ఈ యువతి, ఈ ఏడాది చైనా కొత్త సంవత్సరం వేడుకలకు ఇంట్లో నుంచి కాలు కూడా బయటపెట్టాలనుకోవడం లేదు.

సొంత నగరం వుహాన్‌లో ఇప్పటికే 17 మందిని పొట్టనపెట్టుకున్న కరోనా వైరస్.. తనకూ సోకుతుందేమో అని లెలె వణికిపోతున్నారు. బ్రిటన్‌లో చదువుకుంటున్న ఆమె ఇటీవలే ఇంటికి వచ్చారు.

కానీ, ఆమె తన తల్లిదండ్రుల కోరికను కాదనలేకపోయారు.

నేను వాళ్లను గౌరవించాలి. అందుకే, మేం భోజనానికి మా తాతయ్య వాళ్ల ఇంటికి వెళ్లాం. అక్కడ చాలా భయంకరంగా ఉంది. నేను బయటికెళ్లగానే మాస్క్ తీసుకుని వేసుకున్నా. వీలైనంత త్వరగా కొత్త సంవత్సరం విందు ముగించి ఇంటికి వచ్చేయాలనుకున్నా" అన్నారు.

వీడియో క్యాప్షన్, వీడియో: చైనాలో శరవేగంగా వ్యాపిస్తున్న కొత్త వైరస్

వైరస్ గురించి భయపడుతున్న ఆమె, డైనింగ్ టేబుల్ దగ్గర కూడా ఒకరికొకరు తగలకుండా దూరంగా కూచోవాలని తన కుటుంబ సభ్యులకు సూచించారు.

"నేను వాళ్లతో మీ సెల్ ఫోన్లమీద ఆల్కహాల్ వేసి తుడవమని చెప్పాను. భోజనానికి వెళ్లే ముందు మీ చేతులు శుభ్రంగా కడుక్కోవాలని కోరాను".

తర్వాత రోజు ఆమె అంకుల్ తనకు తీవ్ర జ్వరం వచ్చిందని చెప్పాడు. "అది కాకుండా ఆయనకు వేరే లక్షణాలేవీ లేవు. ఆయన్ను హాస్పిటల్‌కు తీసుకెళ్లి మరింత ఇబ్బందుల్లో పడాలని ఆయన కుటుంబం అనుకుని ఉండదు" అన్నారు లెలె.

"వైరస్ ఇప్పుడు ప్రమాదకర స్థాయిలో వ్యాపిస్తోంది. ఆస్పత్రులకు వేలాది రోగులు వస్తున్నారు. వైద్యం కోసం గంటలతరబడి వేచిచూస్తున్నారు".

కరోనా వైరస్

ఫొటో సోర్స్, Getty Images

"డాక్టర్లు, నర్సుల దగ్గర తగిన సౌకర్యాలు కూడా లేవు. నేను కూడా భయపడిపోయా. అందరూ పానిక్ అవుతున్నారు. నగరంలోని షాపుల్లో మాస్కుల కొరత తీవ్రంగా ఉంది" అని లెలె చెప్పారు.

గురువారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా రవాణాను నిలిపివేయడంతో, ఎప్పుడూ కిటకిటలాడే రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలూ ఖాళీగా కనిపించాయి. నగరం వదిలి బయటకు వెళ్లద్దని ప్రభుత్వం వుహాన్ నగర ప్రజలకు సూచించింది.

కానీ ప్రభుత్వం త్వరగా స్పందించి ఉంటే బాగుండేదని లెలె భావిస్తున్నారు. "దీని గురించి తగినంత సమాచారం ఉందని నాకైతే అనిపించడం లేదు. ఈ సలహాలు కాస్త త్వరగా ఇచ్చుంటే బాగుండేది" అన్నారు.

ఇటీవల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె తన స్నేహితుల్లో కొందరికి స్కానింగ్, ఇతర పరీక్షలు చేశారని, వారిలో పాజిటివ్ లక్షణాలు కనిపించాయని చెప్పారు.

"కానీ ఆస్పత్రుల్లో తగినంత స్థలం లేకపోవడంతో, డాక్టర్లు వారిని ఇంటికి పంపించేశారు" అన్నారు.

కరోనా వైరస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రజా రవాణా రద్దుతో రైల్వే స్టేషన్లు ఖాళీగా కనిపించాయి

వృద్ధులకు ఈ వైరస్ గురించి కీలక సమాచారం తెలీకపోవడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

"యువతీ యువకులు ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా సమాచారం షేర్ చేసుకుంటూ ఉండడంతో, దాని తీవ్రత మాకు తెలుస్తోంది. మధ్య వయసువారు, వృద్ధులకు ఈ వైరస్ ఎంత ప్రమాదకరమో ఇప్పటికీ తెలీడం లేదు" అని లెలె అన్నారు.

సురక్షితంగా ఉండడానికి ఆమె పనికి వెళ్లడం కూడా మానుకున్నారు. "మా అమ్మ, నేను ఇంట్లోనే ఉండిపోయాం. ఎందుకంటే, మా ఇంటికి దగ్గరే ఆస్పత్రి ఉంది" అన్నారు.

మిగతా ప్రావిన్సులలో ఉంటున్న స్నేహితుల గురించి ఆమె ఆందోళన చెందుతున్నారు. తమను తాము కాపాడుకోవాలని మిగతావారికి సూచిస్తున్నారు.

"మీకు ఎన్ని వీలైతే అన్ని మాస్కులు కొని ఉంచుకోండి. ఎక్కువమంది గుమిగూడిన చోట ఉండకండి" అని లెలె చెప్పారు.

ఈ కొత్త వైరస్ వేగంగా వ్యాపిస్తున్నా, దీనిని 'ప్రపంచ అత్యవసర స్థితి'గా ప్రకటించకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర కమిటీ ఆలస్యం చేస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)