'ఆ 19 మందిని నేనే చంపాను. కానీ, అందులో నా తప్పేమీ లేదు'

ఫొటో సోర్స్, AFP
ఒకరూ ఇద్దరూ కాదు... ఏకంగా 19 మంది దివ్యాంగులను ఓ వ్యక్తి చంపిన కేసు జపాన్‌లో సంచలనంగా మారింది. వాళ్లందరినీ తానే చంపానని ఆ వ్యక్తి ఒప్పుకున్నాడు. కానీ, తాను ఎలాంటి తప్పూ చేయలేదని కూడా అంటున్నాడు. తన మానసిక స్థితి సరిగ్గా లేదని అతడు చెబుతున్నాడు.
ఈ వరుస హత్యలు 2016లో టోక్యోలోని సగమిహర అనే ఓ సంరక్షణ గృహంలో జరిగాయి. గతంలో ఆ గృహంలో పని చేసిన సటోషీ విమాట్సుపై ఈ హత్య కేసులు నమోదయ్యాయి.
ఆ తరువాత ఇంటర్వ్యూల్లో సటోషీ మాట్లాడుతూ, తీవ్రమైన వైకల్యంతో బాధపడే మనుషులు సమాజానికి హానికరమని, వారిని చంపేయాలని చెప్పాడు.
జపాన్‌లో అత్యంత తీవ్రమైన సామూహిక హత్య కేసుల్లో ఇది ఒకటి. అక్కడ ఇంత తీవ్రమైన నేరాలు చాలా అరుదు. అందుకే ఈ కేసు అక్కడి ప్రజల్ని విస్మయపరిచింది.
దివ్యాంగులతో జపనీయులు ఎలా వ్యవహరిస్తారనే అంశంపైన కూడా ఈ ఘటన చర్చను లేవనెత్తింది. ఈ కేసుపై జనవరి 8న కోర్టులో విచారణ జరిగింది.
బాధితులను తాను కత్తితో పొడిచి చంపినట్లు ఎదురైన ఆరోపణలను సటోషి తిరస్కరించలేదు.

ఫొటో సోర్స్, AFP
అతడిపైన నమోదైన ఆరోపణల వివరాలను కోర్టులో చదివి వినిపించారు. 'వాస్తవాలకు ఆ ఆరోపణలకు మధ్య ఏమైనా వ్యత్యాసం ఉందా?' అని సటోషిని అడిగారు. దానికి అతడు 'లేదు' అని బదులిచ్చాడు.
ఆరోపణలను అతడు అంగీకరించినప్పటికీ తమ క్లయింట్ నేరం చేయలేదని, ఆ సమయంలో అతడి మానసిక స్థితి సరిగా లేదని నిందితుడి తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. ఆ సమయంలో అతడు మాదక ద్రవ్యాల ప్రభావానికి లోనయ్యాడని అన్నారు.
'అతడు మారిజువానా తీసుకున్నాడు. అతడి మానసిక పరిస్థితి కూడా బాగాలేదు. తాను చేసిన పనులకు బాధ్యత వహించే పరిస్థితుల్లో అతడు లేడు' అని న్యాయవాదులు వాదించారు.
దాడి జరిగిన అనంతరం సటోషి రక్తంలో మారిజువానా అవశేషాలు లభించాయి.
ఈ కేసుపై బుధవారం విచారణ జరుగుతున్న సమయంలో సటోషి తన నోట్లో ఏదో పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. భద్రతా సిబ్బంది గమనించి అతడిని అడ్డుకోవడంతో విచారణకు ఆటంకం ఏర్పడింది.
ఈ కేసులో సటోషి దోషిగా తేలితే అతడికి మరణ శిక్ష విధిస్తారు. మార్చిలో తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, AFP
చిక్కుముడి ఎలా వీడింది?
2016 జులై 26 తెల్లవారుజామున టోక్యోకు 50 కి.మీ.ల దూరంలో ఉన్న సంరక్షణ కేంద్రానికి సటోషి వచ్చాడు. అతడు చాలా కత్తులు కూడా తెచ్చుకున్నాడు.
కిటికీ అద్దాలు పగలగొట్టి భవనంలోకి ప్రవేశించి లోపల నిద్రపోతున్న ఒక్కొక్కరిపై కత్తితో దాడి చేసినట్లు ఫిర్యాదుదార్ల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు.
ఆ దాడిలో చనిపోయిన 19 మందిలో 19 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్కులు ఉన్నారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.
దాడి జరిగిన తరువాత సటోషి స్వయంగా పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.
ఆ సమయంలో అతడి దగ్గర రక్తం మరకలతో ఉన్న అనేక కత్తులు లభించాయని పోలీసు అధికారులు చెప్పారు.
దాడి జరిగిన సమయంలో లోపల 150 మంది దివ్యాంగులు, 9 మంది పనివాళ్లు ఉన్నారు.
ఆ ఘటన జరిగిన కొన్నాళ్ల తరువాత ఓ ఆశ్చర్యకర విషయం వెలుగులోకి వచ్చింది. తనకు అవకాశం ఇస్తే తీవ్రమైన వైకల్యంతో బాధపడుతున్న 470 మందిని చంపేస్తానని, దివ్యాంగులకు మరణభిక్ష పెట్టే నిబంధన జపాన్‌లో రావాలని తాను కోరుకుంటున్నట్లు చెబుతూ ఓ లేఖను గతంలో ఏకంగా ఆ దేశ పార్లమెంటుకే సటోషి రాసినట్లు తెలిసింది.
ఆ తరువాత అతడిని ఆస్పత్రిలో చేర్చి రెండు వారాల తరువాత విడిచిపెట్టారు. సామూహిక హత్యల కేసులో అరెస్టయ్యాక కూడా అతడిలో ఎలాంటి అపరాధ భావం కనిపించలేదు.
''మానసిక వికలాంగులు జీవించడం వృథా. నేను సమాజం కోసమే ఆ పని చేయాలి. దివ్యాంగులు హానికరం. వారు దురదృష్టాన్ని తీసుకొస్తారు'' లాంటి వ్యాఖ్యలను అతడు ఇటీవల చేశాడు.
జపాన్ ఎలా స్పందించింది?
అత్యంత సురక్షితమైన దేశాల్లో ఒకటిగా జపాన్‌కు పేరుంది. అక్కడ ఆయుధ నియంత్రణ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అందుకే ఆ సంరక్షణ గృహంలో హత్యల ఘటన జపనీయులను దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఇప్పటికీ ఆ దాడిలో చనిపోయిన కొందరి వివరాలను వారి కుటుంబ సభ్యులు బయటపెట్టలేదు. తమ కుటుంబంలో దివ్యాంగులు ఉన్నారనే విషయం బయటి ప్రపంచానికి తెలియకూడదనే వారు అలా చేశారని భావిస్తున్నారు.
కానీ, ఇటీవలే ఓ మహిళ తన 19 ఏళ్ల కూతురు కూడా ఆ దాడిలో చనిపోయిందని, ఆమె ఆటిజంతో బాధపడేదని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఈ భవనాలు హిరోషిమా అణు బాంబును తట్టుకున్నాయి..
- జపాన్: బడి మానేస్తున్న చిన్నారుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది... ఎందుకు?
- అత్యాచారం కేసులో జర్నలిస్టుకు రూ. 21.5 లక్షల పరిహారం
- ఫూమీ: ఏసుక్రీస్తు విగ్రహాలను బలవంతంగా కాలితో తొక్కించే ఈ ఆచారం ఏంటి?
- కాసిం సులేమానీ: ఇరాన్లో అంత్యక్రియల్లో తొక్కిసలాట.. 50 మంది మృతి
- ఇస్రో: 'గగన్‌యాన్' వ్యోమగాముల ఎంపిక ఎలా జరుగుతుంది?
- ఉదయించే సూర్యుడు ఉన్న ఈ జెండాపై వివాదమెందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









