బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు డిసెంబర్ 12న.. 96 ఏళ్ల తర్వాత డిసెంబర్ నెలలో ఎన్నికలు ఇదే మొదటిసారి

ఫొటో సోర్స్, Getty Images
డిసెంబర్ 12న సాధారణ ఎన్నికలు జరగాలనే పక్షాన బ్రిటన్ ఎంపీలు ఓటు వేశారు.
బ్రిటన్ పార్లమెంటు దిగువ సభ 'హౌస్ ఆఫ్ కామన్స్'లో డిసెంబర్ 12న ఎన్నికలు నిర్వహించడానికి అనుకూలంగా 438 మంది, వ్యతిరేకంగా 20 మంది ఎంపీలు ఓట్లు వేశారని బీబీసీ ప్రతినిధి గగన్ సబర్వాల్ చెప్పారు.
బ్రిటన్‌లో ఇక డిసెంబర్ 12న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 13న ఫలితాలు వెల్లడిస్తారు.
డిసెంబర్ 12న ఎన్నికలు నిర్వహించాలనే ప్రణాళికలో బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ 418 ఓట్ల మెజారిటీతో విజయవంతం అయ్యారు.
దీనితో కలిసి గత ఐదేళ్లలో బ్రిటన్‌లో ఇది ఐదో సార్వత్రిక ఎన్నిక అవుతుంది. అంతే కాదు, 1923 తర్వాత మొదటిసారి డిసెంబర్‌లో బ్రిటన్ ఎన్నికలు జరగబోతున్నాయి.

మంగళవారం అధికారిక ఓటింగ్ ద్వారా ఎంపీలు ఎన్నికల ప్రతిపాదనను సమర్థించడంతో జాన్సన్ తన ప్రణాళికకు మరో అడుగు దగ్గరయ్యారు.
లేబర్ పార్టీ ఎంపీలు మాత్రం నవంబర్ 9న ఎన్నికలు జరగాలని కోరుకున్నారు. అప్పటికి అకడమిక్ సెషన్ నడుస్తుంటుందని, యూనివర్సిటీ విద్యార్థులకు కూడా ఓట్లు వేయడం సులభం అవుతుందని చెప్పారు.
"త్వరలో జరిగే ఎన్నికలకు మేం సిద్ధంగా ఉన్నామని నేను చెబుతూనే వచ్చాను" అని లేబర్ పార్టీ నేత జెరేమీ కార్బిన్ అన్నారు. అంతకు ముందు, ఎంపీలు మూడు సార్లు ఆయన ప్రతిపాదనను వ్యతిరేకించారు.
త్వరగా ఎన్నికల వల్ల బ్రెగ్జిట్‌పై ప్రభావం
బ్రెగ్జిట్ విషయంలో తర్వాత ఏం జరుగుతుందనేది, డిసెంబర్ 12న జరిగే ఎన్నికలు, దాని ఫలితాలపైనే ఆధారపడి ఉంటుందని బీబీసీ ప్రతినిధి గగన్ సబర్వాల్ చెప్పారు.
ఎన్నికల తర్వాత రెండు, మూడు పరిస్థితులు ఏర్పడవచ్చు
- రాబోవు ఎన్నికల్లో ప్రస్తుత ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ మెజారిటీ సాధించగలిగితే, ఆయన తన షరతులపై యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోతారు.
- వేరే పార్టీ గెలిచినా, లేదా వేరే ఎవరైనా ప్రధానమంత్రి అయినా బ్రెగ్జిట్ అంశంపై మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేయడం సాధ్యం అవుతుంది.
- 'నో డీల్ బ్రెగ్జిట్' అంటే ఎలాంటి ఒప్పందం లేకుండానే ఈయూ నుంచి బ్రిటన్ బయటికి వచ్చే అవకాశం కూడా ఉంది. కానీ వచ్చే ఏడాది బ్రిటన్ ఎలాంటి ఒప్పందం లేకుండా యూరోపియన్ యూనియన్ నుంచి బయటికి వస్తే, దానివల్ల బ్రిటన్ ఆర్థికవ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని చాలా మంది ప్రజలు, వ్యాపారులు, ఎంపీలు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
డిసెంబర్‌లో ఎన్నికల నిర్వహణలో సవాళ్లు
బ్రిటన్‌లో సాధారణంగా చలికాలంలో ఎన్నికలు జరగవు. ప్రతికూల వాతావరణమే కారణం, డిసెంబర్‌లో ఇక్కడ చలి తీవ్రంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతాయి. అలాంటప్పుడు ఎన్నికలు నిర్వహించడం చాలా కష్టం అవుతుంది.
చలికాలం బ్రిటన్‌లో పగలు తక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత నుంచే చీకట్లు అలుముకుంటాయి. అలాంటప్పుడు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడం సవాలుగా మారుతుంది.
ఆ సమయంలో ఇంకో పెద్ద సమస్య కూడా ఉంది. క్రిస్మస్, పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిసెంబర్ 12న పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చోటు దొరకడం కూడా కష్టం అవుతుంది. పెద్ద పెద్ద వేదికలన్నీ క్రిస్మస్, పెళ్లిళ్లు, పార్టీలకు ముందు నుంచే బుక్ అయిపోతాయి.
అలాంటప్పుడు, పోలింగ్ కేంద్రాలు సుదూర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సుంటుంది. ప్రజలను అక్కడి వరకూ తరలించడం కష్టం అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఓటింగ్ శాతం తగ్గిపోవచ్చని కూడా అనుకుంటున్నారు.
అంతే కాదు, ఆ సీజన్లో ఎన్నికలు ఎంపీలకు కూడా కష్టాలు తీసుకొస్తాయి. ఎందుకంటే తీవ్రమైన చలికాలంలో ప్రజల దగ్గరకు వెళ్లి ఎన్నికల ప్రచారం చేయడం చాలా కష్టం.

ఫొటో సోర్స్, Getty Images
జనవరి 31 నాటికి గడువు
బ్రిటన్ విడిపోవడానికి అంటే బ్రెగ్జిట్ గడువును యూరోపియన్ యూనియన్ వచ్చే ఏడాది జనవరి 31 వరకూ పొడిగించింది.
జనవరి 31కి ముందు బ్రిటన్ పార్లమెంట్ ఏదైనా ఒప్పందాన్ని ఆమోదిస్తే బ్రిటన్ ఈయూ నుంచి విడిపోవచ్చని చెప్పింది.
బ్రిటన్‌లో బ్రెగ్జిట్‌ను కొందరు సమర్థిస్తే, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకులు ఇది దీనిని ఒక విపత్తుగా చెబుతున్నారు. పార్లమెంటును సస్పెండ్ చేయడం వల్ల బ్రిటిష్ ప్రజాస్వామ్యం దెబ్బతింటుందని అంటున్నారు.
ఇక యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు రావాలనుకునేవారు 'నో బ్రెగ్జిట్ డీల్' ద్వారా బ్రిటిష్ పౌరుల అభిప్రాయాన్ని ఎంపీలు నిర్లక్ష్యం చేస్తున్నారని భావిస్తున్నారు.
2016లో బ్రిటన్‌లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో 52 శాతం మంది బ్రెగ్జిట్‌ను సమర్థించారు. 48 శాతం మంది దానిని వ్యతిరేకించారు.
ఇవి కూడా చదవండి:
- బ్రెగ్జిట్: ‘విడాకుల’ ఒప్పందంలో ఏముందంటే..
- బ్రెగ్జిట్ ప్రభావం భారత్‌పై ఉంటుందా?
- కాస్మటిక్ సర్జరీ ఫెయిల్... 97 లక్షల పరిహారం చెల్లించకుండా డాక్టర్ పరార్
- స్టాకర్వేర్: భార్యలు, భాగస్వాములపై నిఘా కోసం పెరుగుతున్న స్పైవేర్ వినియోగం.. రెండో స్థానంలో భారత్
- 346 మంది ప్రాణాలు తీసిన ఆ విమానం కూలడానికి వరుస వైఫల్యాలే కారణం
- నీళ్లు, టాయిలెట్ పేపర్, మొక్కజొన్న పొత్తు... బాత్రూమ్లో ఒక్కో దేశానిది ఒక్కో అలవాటు
- ఎడమ చేతి అలవాటుకు కారణమేంటి?
- డేటింగ్ యాప్స్ వాడే వాళ్లు అందం కోసం ఏం చేస్తున్నారో ఊహించగలరా
- అబూ బకర్ అల్ బగ్దాదీ ఎవరు? ఖురాన్ బోధించే ‘భక్తుడు’ ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ మ్యాన్ ఎలా అయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








