బ్రెగ్జిట్: బ్రిటన్‌లో పార్లమెంటును ఎందుకు మూసివేశారు? రాజకీయ సంక్షోభానికి కారణాలేంటి?

ఫొటో సోర్స్, Getty Images
బ్రిటిష్ రాజకీయాలు మళ్లీ మలుపు తిరిగాయి.
బ్రెగ్జిట్ విషయంలో హౌస్ ఆఫ్ కామన్స్ (దిగువ సభ)లో బోరిస్ జాన్సన్ ప్రభుత్వాన్ని అధికార పార్టీకి చెందిన తిరుగుబాటు ఎంపీలు.. ప్రతిపక్ష సభ్యులు కలిసి ఓడించారు.
దిగువ సభలో జరిగిన ఓటింగ్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా 328 ఓట్లు పడగా, అనుకూలంగా 301 ఓట్లు వచ్చాయి.
ఈ పరిణామంతో... ఎలాంటి ఒప్పందాలు లేకుండా అక్టోబరు 31న ఐరోపా సమాఖ్య నుంచి యూకే బయటకొచ్చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని, అడ్డుకునేలా పార్లమెంటులో బిల్లును ఆమోదించేందుకు ఆ ఎంపీలకు అవకాశం లభించింది.
పార్లమెంటులో ప్రభుత్వం ఓడిపోయిన తరువాత, ముందస్తు సార్వత్రిక ఎన్నికలకు పిలుపునిస్తానంటూ ప్రధాని బోరిస్ జాన్సన్ హెచ్చరికలు చేశారు. అంతేకాదు, 21 మంది ఎంపీలను కన్జర్వేటివ్ పార్టీ నుంచి బహిష్కరించారు.
ఈ పరిస్థితుల్లో బ్రిటన్ రాజకీయాలు, బ్రెగ్జిట్ అంశం ఇంకా ఎలాంటి మలుపులు తీసుకునే అవకాశం ఉంది?

ఫొటో సోర్స్, AFP
ఆ ప్రకటన తర్వాత వారంలోనే
సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 14 వరకు పార్లమెంటును ప్రోరోగ్ (సస్పెండ్) చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన తరువాత వారం రోజుల్లోనే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఇప్పుడు ప్రభుత్వం పట్టు కోల్పోయింది. కాబట్టి వాణిజ్యం, సరిహద్దు నియంత్రణపై ఒప్పందం లేకుండా యూరోపియన్ యూనియన్ నుంచి యూకే వైదొలగడాన్ని అడ్డుకునేందుకు ఎంపీలు ప్రయత్నించేందుకు వీలుంటుంది.
అక్టోబర్ 31న యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వెళ్లాల్సి ఉంది. అయితే, ఆ తేదీలోగా ఈయూతో వాణిజ్యం, సరిహద్దు అంశాలపై ఒప్పందం కుదరని పక్షంలో ఆ గడువును పొడిగించాలని చాలామంది ఎంపీలు కోరుతున్నారు.
ఎలాంటి ఒప్పందాలు లేకుండా ఈయూ నుంచి బయటకు వస్తే మున్ముందు అనేక సమస్యలు ఎదురవుతాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ ఓటమి అంటే, ఇప్పుడు బ్రెగ్జిట్ విషయంలో ఈయూతో ఒప్పందాలు చేసుకోవాలంటూ ఎంపీలు ప్రతిపాదించిన బిల్లు మీద పార్లమెంటులో చర్చ జరిగే అవకాశం ఉంటుంది.
ఈ క్రమంలో ఒకవేళ మరికొన్ని వారాల్లో బ్రెగ్జిట్‌కు బ్రిటన్ అంగీకరించకపోతే, బ్రెగ్జిట్ తదుపరి గడువు 2020 జనవరి 31కి పొడిగిస్తారు.
అయితే, బోరిస్ జాన్సన్ మాత్రం ఈ గడువులోగా బ్రెగ్జిట్ పూర్తవ్వకపోతే అది మరింత ఆలస్యమవ్వడంతో పాటు అనవసరంగా ప్రజల్లో అనుమానాలు పెరుగుతాయని అంటున్నారు.

ఫొటో సోర్స్, AFP
సార్వత్రిక ఎన్నికలు వస్తాయా?
తమకు వీలు కుదిరినప్పుడల్లా సార్వత్రిక ఎన్నికలకు వెళ్లే అధికారం యూకేలోని ప్రధానమంత్రులు లేదు.
దానికి బదులుగా, ఒప్పందం లేని బ్రెగ్జిట్‌ను నిరోధించే బిల్లు ఆమోదం పొందితే, బ్రిటన్ ఎన్నికలకు వెళ్ళడంపై ప్రభుత్వం ప్రతినిధుల సభలో ఓటింగ్ నిర్వహించే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
చట్టబద్ధంగా, మొత్తం ఎంపీలలో మూడింట రెండొంతుల మంది ఎన్నికలకు వెళ్లేందుకు అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది.
అయితే, అధికార కన్జర్వేటివ్ పార్టీకి ఆ సంఖ్యా బలం పొందే అవకాశం లేదు. ఆ ఓటింగ్‌లో నెగ్గాలంటే ప్రధాన ప్రతిపక్షం లేబర్ పార్టీ నుంచి మద్దతు లభించాలి.
ఎన్నికలకు వెళ్తామన్న ప్రధాని వ్యాఖ్యలకు లేబర్ పార్టీ నాయకుడు జెరీమీ కార్బిన్ స్పందిస్తూ... ", ఎన్నికల విషయం సరే, ముందు మా బిల్లు పాస్ అవ్వనివ్వండి" అన్నారు.
బుధవారం ఆ బిల్లు మీద దిగువ సభలో చర్చ జరుగుతుంది. చర్చ అనంతరం వెంటనే ఎన్నికలకు వెళ్లడంపై కూడా ఓటింగ్ జరిగే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Jessica Taylor/UK Parliament/PA Wire
పార్లమెంటును ఎందుకు మూసివేశారు?
సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 14 వరకు ఐదు వారాల పాటు పార్లమెంటును మూసివేస్తామని ప్రభుత్వం తెలిపింది.
ప్రతిపక్ష సీనియర్ ఎంపీలు ఈ నిర్ణయాన్ని "కుట్ర" అని అభివర్ణించారు. ఒప్పందం లేని బ్రెగ్జిట్‌ను వ్యతిరేకిస్తున్న తమ గొంతును నొక్కేందుకే బోరిస్ ప్రభుత్వం పార్లమెంటును ప్రోరోగ్ చేసిందని ఆరోపించారు.
అయితే, కొత్త చట్టాలను తీసుకొచ్చేందుకు పార్లమెంటులో మహారాణి ప్రసంగ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని, ఆ కార్యక్రమానికి ముందు పార్లమెంటు ప్రోరోగ్ చేసి ఉండాలన్న ఆనవాయితీ ప్రకారం పార్లమెంటును మూసివేయాలని నిర్ణయం తీసుకున్నామని ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
తాజా పరిణామాలు చూస్తుంటే, ఈయూతో ఒప్పందం లేని బ్రెగ్జిట్ ముందుకు సాగే అవకాశం కనిపించడంలేదు.
ఈ సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకోవాలని ప్రధానమంత్రి సన్నిహితులు కొందరు నమ్ముతారు.
ఈ తాజా సంక్షోభం ఎన్నికలను ప్రేరేపిస్తే, బోరిస్ జాన్సన్ కన్జర్వేటివ్ పార్టీ మెజారిటీ సాధించే అవకాశం ఉంటుంది. అదే జరిగితే ఒప్పందం లేని బ్రెగ్జిట్ ఆయన చేతుల్లోనే ఉంటుంది.
ఏది ఏమైనా.. బ్రిటన్‌లో ఈ రాజకీయ సంక్షోభానికి ఇప్పుడే తెరపడే సూచనలు కనిపించడంలేదు.
ఇవి కూడా చదవండి:
- బ్రిటన్ ప్రధాని థెరెసా మే పతనానికి బ్రెగ్జిట్ ఎలా కారణమైంది?
- ఒప్పందంలేని 'బ్రెగ్జిట్' ప్రతిపాదనను తిరస్కరించిన ఎంపీలు
- బ్రెగ్జిట్: థెరెసా మే డీల్‌ను రెండోసారి తిరస్కరించిన ఎంపీలు - బ్రెగ్జిట్ వాయిదా పడుతుందా?
- బ్రెగ్జిట్ వివాదం: వీగిన అవిశ్వాసం.. నెగ్గిన థెరెసా
- బ్రెగ్జిట్: ఎందుకింత సంక్లిష్టం.. ఈయూ, బ్రిటన్ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి
- బ్రెగ్జిట్: థెరెసా మే ప్రభుత్వానికి ఆరు ప్రత్యామ్నాయాలు
- మోదీతో కలసి చంద్రయాన్-2 ల్యాండింగ్‌ను వీక్షించనున్న శ్రీకాకుళం విద్యార్థిని
- సర్వేపల్లి రాధాకృష్ణ: ‘మిస్టర్ మావో కంగారుపడకండి.. స్టాలిన్, పోప్‌లతో కూడా ఇలానే చేశా’
- అక్కడ వేల కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.. వజ్రాలు వర్షంలా కురుస్తాయి
- చాలా ఏళ్లుగా చిప్స్ మాత్రమే తింటున్నాడు.. చివరికి కంటి చూపు కోల్పోయాడు
- ఆర్థిక వ్యవస్థకు బ్రేకులు పడడానికి మోదీ ప్రభుత్వమే కారణమా
- ‘నా గర్ల్‌ఫ్రెండ్‌కు అందమైన ఆడవాళ్లను చూస్తే కోపమొచ్చేస్తుంది’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








