నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్ మళ్లీ ఎందుకు తిరస్కరించారు...

"ఎగవేసిన రుణం ఎక్కువ మొత్తంలో ఉంది. దీన్ని విస్మరించలేం. ఇదో పెద్ద మోసం. బెయిల్‌కు అవసరమైన సెక్యూరిటీ డిపాజిట్ విలువను రెట్టింపు చేసి 20లక్షల పౌండ్లు కట్టినా, ఆయన తిరిగి లొంగిపోకపోతే ఏంటనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి, బెయిల్ మంజూరు చేయడానికి అది సరిపోదు" అని జడ్జి ఎమ్మా అర్బత్నాట్ వ్యాఖ్యానించారు.
ఒకవేళ బెయిల్ ఇస్తే నీరవ్ తిరిగి లొంగిపోవడానికి నిరాకరిస్తారేమో అనే అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు.
ఈ కారణాల వల్లే బెయిల్ దరఖాస్తును తిరస్కరిస్తున్నానని జడ్జి ఎమ్మా తెలిపారు. భారత్‌కు అప్పగింత వ్యవహారంపై విచారణకు తిరిగి మే 30న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించారు.
నీట్‌గా గడ్డం చేసుకుని, లేత నీలం రంగు చొక్కా ధరించి కోర్టుకు వచ్చిన నీరవ్ మోదీ, కోర్టులో విచారణ జరుగుతున్నంత సేపూ ఆందోళనగా, విచారంగా కనిపించారు. బెయిల్ నిరాకరిస్తున్నట్లు జడ్జి ప్రకటించగానే అసంతృప్తికి లోనయ్యారు. ఈ విచారణకు భారత్‌కు చెందిన జర్నలిస్టులు చాలామంది హాజరయ్యారు. భారత్ నుంచి ప్రభుత్వ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులిద్దరు కూడా హాజరయ్యారు. బెయిల్ తిరస్కరించగానే వారు ఆనందంగా కనిపించారు. అయితే వారు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు.

ఫొటో సోర్స్, Getty Images
లాయర్ల వాదనలేంటి?
సెంట్రల్ లండన్‌లోని ఓ బ్యాంకులో అకౌంట్ తెరిచేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు నీరవ్ మోదీని అరెస్ట్ చేశారు. అప్పటినుంచి ఆయనను హెచ్ఎంపీ వాండ్స్‌వర్త్ జైలులో ఉంచారు.
ఆ తర్వాత మార్చి 20న జిల్లా జడ్జి మేరీ మాలన్.. నీరవ్ పెట్టుకున్న మొదటి బెయిట్ పిటిషన్‌ను తిరస్కరించారు.
మార్చి 29న రెండోసారి జడ్డి అర్బత్నాట్.. నీరవ్‌కు బెయిల్ మంజూరు చెయ్యడానికి నిరాకరించారు. "ఇదో అసాధారణ మోసానికి సంబంధించిన కేసు, సాక్షులను చంపుతామని బెదిరించినట్లు కూడా ఆరోపణలున్నాయి" అని జడ్జి వ్యాఖ్యానించారు. విడుదల చేస్తే తిరిగి లొంగిపోతారనే నమ్మకం కూడా లేదని ఆమె అన్నారు.
"వాండ్స్‌వర్త్ జైలులో పరిస్థితులు ఆయన ఉండటానికి అనుకూలంగా లేవు. మీరు ఎలాంటి షరతులు, నిబంధనలు విధించినా పాటించడానికి నీరవ్ సిద్ధంగా ఉన్నారు" అని నీరవ్ తరపు న్యాయవాది క్లారె మాంట్‌గోమెరీ కోర్టుకు తెలిపారు. సుదీర్ఘంగా సాగిన ఈ విచారణ పూర్తయ్యే సమయానికి జడ్జి ఈ వాదనలతో ఏకీభవించలేదు. దీంతో తన అనుమానాలను వ్యక్తం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేశారు.

ఫొటో సోర్స్, AFT/Getty Images
నీరవ్ మోదీకి బెయిల్ మంజూరు చెయ్యవద్దంటూ భారత అధికారుల తరపున క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సీపీఎస్) వాదనలు వినిపించింది. ఆయనను విడుదల చేస్తే సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదముందని తెలిపారు.
సీపీఎస్ వాదనలను నీరవ్ తరపు న్యాయవాది మాంట్‌గోమెరీ వ్యతిరేకించారు. అవసరమైతే బెయిల్ సెక్యూరిటీ డిపాజిట్‌ను రెట్టింపు చేస్తామని ప్రతిపాదించారు. నీరవ్ ఎక్కడికీ ప్రయాణం చేయకుండా, లండన్‌లోని తన ఇంట్లోనే ఉంటారని హామీ ఇచ్చారు. "నీరవ్ పేరుమీద ఇక్కడో ఇల్లు ఉంది. ఆయన పన్నులు కడుతున్నారు. ఇక్కడే ఉంటున్నారు. ఓటర్ లిస్టులో ఆయన పేరు ఉంది. ఆయనకు యూకేనే సురక్షిత ప్రదేశం" అని లాయర్ కోర్టుకు తెలిపారు. ఈయన గతంలో కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించే పిటిషన్‌పై కూడా వాదించారు.

ఫొటో సోర్స్, Getty Images
నీరవ్ మోదీ ఎవరు, ఆయనపై అభియోగాలేంటి?
నీరవ్ మోదీ ఒక వజ్రాల వ్యాపారి. ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు అతనిపై అభియోగాలు ఉన్నాయి.
2018లో పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత అతను భారత్ నుంచి లండన్ వెళ్లారు.
నీరవ్ మోదీని తమకు అప్పగించాలని గతంలో భారత్ బ్రిటన్‌కు విజ్ఞప్తి చేసింది.
ఇటీవల ది టెలిగ్రాఫ్ పత్రిక జర్నలిస్టులు లండన్ వీధుల్లో నీరవ్ మోదీని ఇంటర్వ్యూ చేశారు.
లండన్‌లో సుమారు 73కోట్ల ఖరీదైన త్రీ బెడ్‌రూం అపార్టుమెంట్‌లో ఉంటున్నారని, మళ్లీ కొత్తగా వజ్రాల వ్యాపారం చేస్తున్నారని ది టెలిగ్రాఫ్ కథనం వెల్లడించింది.
ఈ నేపథ్యంలో నీరవ్ మోదీని రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని భారత ప్రభుత్వం తెలిపింది. దీనిపై బ్రిటన్ ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
పీఎన్‌బీ కుంభకోణం ఎలా జరిగింది?
సీబీఐ చెబుతున్న వివరాల ప్రకారం.. నీరవ్ మోదీ ముంబయిలోని పంజాబ్ నేషనల్ బ్యాంకును సంప్రదించారు.
ముడి వజ్రాల దిగుమతి కోసం రుణం కావాలని అడిగారు. విదేశాల్లో చెల్లింపుల కోసం బ్యాంకు ఆయనకు లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ - ఎల్ఓయూ ఇచ్చింది. అంటే విదేశాల్లో ముడి వజ్రాలు సరఫరా చేసే వారికి డబ్బులు చెల్లించేందుకు బ్యాంకు అంగీకరించింది.

ఫొటో సోర్స్, Facebook/NiravModi
కానీ పీఎన్‌బీ అధికారులు నకిలీ ఎల్‌ఓయూలు జారీ చేశారు. విదేశాల్లో ఉన్న భారతీయ బ్యాంకులకు అనుమానం రాలేదు. దాంతో నిధులు విడుదల చేశాయి. ఆ తర్వాత పీఎన్‌బీ అధికారులు ఇంటర్ బ్యాంకింగ్ మెసేజింగ్ వ్యవస్థను దుర్వినియోగం చేశారు.
దీన్ని గుర్తించకుండా విదేశాల్లో ఉన్న భారతీయ బ్యాంకులు పీఎన్‌బీకి రుణం ఇచ్చేశాయి. ఆ తర్వాత ముడి వజ్రాలు సరఫరా చేసిన వారి అకౌంట్లలోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశారు. దాంతో నీరవ్ మోదీ ముడి వజ్రాలు పొందారు.
పాత రుణాలకు కూడా కొందరు పీఎన్‌బీ అధికారులు కొత్తగా ఎల్ఓయూలు ఇచ్చారు. కానీ ఏళ్లు గడుస్తున్న నీరవ్ మోదీ రుణాలు చెల్లించలేదు. కొత్తగా వచ్చిన అధికారులు భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఈ కుంభకోణం 2011 నుంచి 2018 మధ్య కాలంలో జరిగింది.
ఇవి కూడా చదవండి:
- ఎడిటర్స్ కామెంట్: ఆంధ్రలో ఏ పార్టీది పైచేయి?
- Fact Check: ముస్లింలు ఓటు వేయకుండా పోలీసులు లాఠీచార్జి చేశారనే ప్రచారంలో నిజమెంత...
- "సీజేఐ వేధించారంటున్న ఆ మహిళ మరి సుప్రీంకోర్టునే ఎందుకు నమ్మారు"
- పెళ్లి పేరుతో పాక్ అమ్మాయిలను వ్యభిచారంలో దించుతున్న చైనా అబ్బాయిలు
- ఒసామా బిన్ లాడెన్: ప్రపంచాన్ని వణికించిన అల్ ఖైదా ఇప్పుడు ఏ స్థితిలో ఉంది
- బ్రెస్ట్ కేన్సర్ వైద్యురాలికే... బ్రెస్ట్ కేన్సర్ వచ్చింది
- ప్రేమ వివాహం చేసుకున్నారని కొత్త జంటపై పెట్రోల్ పోసి సజీవ దహనం
- శిల్పినే కబళించబోయిన ఆల్చిప్పల ఆడమ్ శిల్పం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








