ఐపీఎల్ 2019: క్రిస్ గేల్ బాదుడు.. సిక్సర్లు, ఫోర్లు

ఫొటో సోర్స్, facebook/Kings XI Punjab
ఐపీఎల్ 2019లో కరీబియన్ క్రికెటర్లు తమ సిక్సర్లతో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు. కాస్త నిలదొక్కుకుంటే చాలు బంతిని స్టాండ్స్‌లోకి పంపిస్తూ భారీ సిక్సర్లతో విరుచుకుపడుతున్నారు.
శనివారం రాత్రి జరిగిన కింగ్స్ లెవన్ పంజాబ్, దిల్లీ కేపిటల్స్ జట్ల మధ్య దిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన మ్యాచ్‌లో విజయం దిల్లీ కేపిటల్స్‌ను వరించినప్పటికీ కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టు ఆటగాడు క్రిస్ గేల్ ఆటతీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ లెవన్ పంజాబ్ వరుసగా వికెట్లు కోల్పోతున్నప్పటికీ గేల్ మాత్రం తన దూకుడు తగ్గించలేదు.
పడుతూ లేస్తూ సాగుతున్న పంజాబ్ స్కోరు బోర్డును పరుగులు తీయించాడు. గేల్ కేవలం 37 బంతుల్లో 5 సిక్సర్లు, 6 ఫోర్లతో 69 పరుగులు చేయడంతో పంజాబ్ జట్టు 163 పరుగులు చేయగలిగింది.

ఫొటో సోర్స్, facebook/chrisgayle
సందీప్ లమిచానె వేసిన ఒక ఓవర్లో గేల్ నాలుగు ఫోర్లు కొట్టాడు. అమిత్ మిశ్రా బౌలింగ్‌లోనూ మూడు సిక్సర్లు కొట్టాడు. కేవలం 25 బంతుల్లోనే హాప్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ పూర్తి కాగానే గేల్ బ్యాట్‌ను అడ్డంగా పట్టుకుని దానిపై రాసి ఉన్న యూనివర్సల్ బాస్ అనేది కనిపించేలా ప్రేక్షకులకు అభివాదం చేశాడు.
అయితే, గేల్ జోరుకు 13వ ఓవర్లో కళ్లెం పడింది. జట్టు స్కోర్ 106 పరుగుల వద్ద ఆ ఓవర్లో గేల్ అవుటయ్యాడు.
గేల్ ఉన్నంత సేపు పంజాబ్ భారీ స్కోరు చేయడం ఖాయమని అనిపించినా ఆయన అవుట్ తరువాత పంజాబ్ వరుసగా వికెట్లు కోల్పోవడంతో 163 పరుగులకే పరిమితమైంది.

ఫొటో సోర్స్, facebook/Delhi Capitals
అది కూడా సిక్సయ్యేదే కానీ, ఇన్‌గ్రామ్ పట్టిన క్యాచ్ మలుపు తిప్పేసింది
గేల్ అవుట్‌కు కారణమైన క్యాచ్ కూడా ఆటలో కీలకంగా మారింది. 13వ ఓవర్లో సందీప్ లమిచానె బౌలింగ్‌లో తొలి బంతికి సిక్సర్ కొట్టిన గేల్ ఆ తరువాత బంతికీ భారీ షాట్ కొట్టాడు.
అది డీప్ మిడ్ వికెట్ మీదుగా బౌండరీ లైన్ అవతల పడుతుండగా ఇన్‌గ్రామ్ బౌండరీ లైన్ వద్ద ఎగిరి దాన్ని అందుకున్నాడు.
ఆ క్రమంలో బ్యాలన్స్ కోల్పోయిన ఇన్‌గ్రామ్ బౌండరీ లైన్‌ను తాకబోతున్న ప్రమాదాన్ని గ్రహించి చేతిలో బంతిని మైదానంలోకి విసిరేసి తాను బౌండరీ లైన్ అవతల పడ్డాడు.
ఇన్‌గ్రామ్ విసిరిన బంతిని అక్షర్ పటేల్ అందుకోవడంతో గేల్ సుడిగాలి ఇన్నింగ్స్‌కు తెరపడక తప్పలేదు.

ఫొటో సోర్స్, facebook/Delhi Capitals
అనంతరం 164 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన దిల్లీ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయం అందుకుంది.
పృథ్వీ షా (13) త్వరగా అవుటైనా శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్ క్రీజులో కుదురుకోవడంతో దిల్లీ విజయానికి అక్కడే పునాది పడింది.
చివరి 2 ఓవర్లలో 10 పరుగులే చేయాల్సి ఉండటంతో గెలుపు సులభమే అనిపించినా 19 ఓవర్లో షమీ జోరు మీదున్న ఇన్‌గ్రామ్‌ను అవుట్ చేయడం.. ఆ వెంటనే అక్షర్ రనౌట్ కావడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారిపోయింది.
చివరి ఓవర్లో 6 పరుగులు చేయాల్సి రాగా మొదటి మూడు బంతుల్లో నాలుగు పరుగులు చేశారు. నాలుగో బంతికి శ్రేయస్ అయ్యర్ ఫోర్ కొట్టి జట్టుకు హోంగ్రౌండ్‌లో విజయం అందించాడు.
ఇవి కూడా చదవండి:
- రియాలిటీ చెక్: అరవింద్ కేజ్రీవాల్ పోర్న్ వీడియో చూశారా, అసలు నిజమేంటి?
- ‘ప్రధాన మంత్రి ఉజ్వల యోజన’ విజయవంతమా కాదా: రియాలిటీ చెక్
- మరణ శిక్ష 170 దేశాల్లో లేదా? ఐరాస మాటలో నిజమెంత?
- రియాలిటీ చెక్: నికితా వీరయ్య నిర్మలా సీతారామన్ కూతురేనా...
- రియాలిటీ చెక్: బుల్లెట్ రైలు గడువులోగా పట్టాలెక్కుతుందా?
- హరీశ్‌రావు: దేశంలో అత్యధిక మెజారిటీ ఈయనదేనా?: బీబీసీ రియాల్టీచెక్
- ప్రధాని మోదీ మాట నిజమేనా? మిగతా వారికన్నా ఎక్కువ విమానాశ్రయాలు కట్టించారా?
- గ్యాస్ కనెక్షన్ ఉన్నా వీళ్లు కట్టెల పొయ్యే వాడుతున్నారెందుకు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








