ట్రంప్, కిమ్ భేటీ: చర్చలు విఫలం.. అర్ధంతరంగా ముగిసిన సమావేశం

కిమ్, ట్రంప్

ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా నేత కిమ్ జోంగ్ ఉన్న మధ్య భేటీ ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసింది.

వియత్నాంలోని హనోయ్‌లో గురువారం వీరిద్దరి మధ్య జరిగిన సమావేశం ఎలాంటి ఒప్పందం కుదరకుండానే అర్ధంతరంగా ముగిసింది.

ఇద్దరు నేతలూ నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం ఉన్న కార్యక్రమాల్లో పాల్గొనకుండానే భేటీ జరిగిన హోటల్ నుంచి వెళ్లిపోయారు.

అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఆంక్షలన్నీ ఎత్తివేయాలని ఉత్తరకొరియా కోరిందని.. తాము అలా చేయలేమని, అందుకే ఎలాంటి ఒప్పందం లేకుండానే ఈ చర్చలు ముగిశాయని వెల్లడించారు.

యాంగ్‌బియాన్ అణు కేంద్రం
ఫొటో క్యాప్షన్, యాంగ్‌బియాన్ అణు కేంద్రం

ఉత్తర కొరియాలోని యాంగ్‌బియాన్ అణు కేంద్రాన్ని ధ్వంసం చేయటానికి కిమ్ సంసిద్ధంగా ఉన్నారని.. దానికి బదులుగా తమ దేశంపై ఆంక్షలన్నిటినీ పూర్తిగా ఎత్తివేయాలని ఆయన కోరారని ట్రంప్ తెలిపారు.

కానీ.. ఉత్తర కొరియాలో రెండో యురేనియం శుద్ధి కర్మాగారం గురించి తాము ప్రస్తావించామని, అమెరికాకు తెలిసిన సమాచారం విని ఉత్తర కొరియా ఆశ్చర్యానికి లోనైందని ఆయన వివరించారు.

అయితే.. అణ్వాయుధాలు, క్షిపణులను పరీక్షించబోమన్న హామీకి కిమ్ కట్టుబడి ఉంటారని తాను నమ్ముతున్నట్లు చెప్పారు.

కిమ్‌తో మూడోసారి భేటీకి సంబంధించి ఏ నిర్ణయమూ తీసుకోలేదని చెప్పారు. కిమ్‌తో తన సత్సంబంధాలు కొనసాగుతాయని, త్వరలోనే ఆయనతో ఫోన్‌లో మాట్లాడతానని చెప్పారు.

ట్రంప్, కిమ్

ఫొటో సోర్స్, AFP

ఇద్దరు నేతల మధ్య హనోయ్‌లో నిర్మాణాత్మక సమావేశాలు జరిగాయని.. కానీ, కీలక అంశమైన అణు నిరాయుధీకరణపై ఎలాంటి ఒప్పందం జరగలేదని వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.

భారత్, పాక్ ఘర్షణకు ముగింపు రానుంది: ట్రంప్

భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఘర్షణ ముగియాలని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.

హనోయ్‌లో ట్రంప్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్‌ల నుంచి ''కాస్త మంచి వార్త నాకు వచ్చింది'' అన్నారు. అంతకుమించి ఆయనింకేమీ చెప్పలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)