ట్రంప్-కిమ్ భేటీ: రెండో దశ చర్చల కోసం వియత్నాం చేరుకున్న ఇద్దరు నేతలు

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తరకొరియా నేత కిమ్ జోంగ్ ఉన్‌తో మరోసారి భేటీ కావడానికి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇప్పటికే వియత్నాం చేరుకున్నారు.
కిమ్ జోంగ్ ఉన్ రైలులో వియత్నాం చేరుకున్న కొద్ది గంటలకే అక్కడి హనోయిలోని నోయిబాయి విమానాశ్రయంలో అమెరికా అధ్యక్షుడి ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం దిగింది.
కిమ్, ట్రంప్ మధ్య బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు భేటీ ఉంటుంది. ఇంతకుముందు వారిద్దరూ సింగపూర్‌లో సమావేశమయ్యారు.
కొరియా ద్వీపకల్పాన్ని అణ్వస్త్ర రహితంగా మార్చడంపై రెండు దేశాల నేతల మధ్య జరగనున్నాయి.

కిమ్ రైలులో ఎందుకొచ్చారు?
ఉత్తరకొరియాలోని పోంగ్యాంగ్ నుంచి వియత్నాంకు రైలులో రావాలంటే 4 వేల కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇందుకు రెండు రోజుల సమయం పడుతుంది. అదే విమానంలో అయితే కొద్ది గంటల్లోనే చేరుకోవచ్చు.
కానీ, కిమ్ మాత్రం రైలులో ప్రయాణించి వియత్నాం చేరుకున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో చైనాలో కిమ్ ప్రయాణం సందర్భంగా కొన్ని రహదారులు, రైల్వే స్టేషన్లు మూసివేశారు. రైళ్ల రాకపోకల వేళలు మార్చారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
దీంతో అక్కడ సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు కురిపించారు.
వియత్నాంలోని డోంగ్ డాంగ్ రైల్వే స్టేషన్‌లో కూడా కిమ్ రాక సందర్భంగా సాధారణ ప్రయాణికుల సేవలు నిలిపివేశారు.
డోంగ్ డాంగ్ రైల్వే స్టేషన్లో దిగిన కిమ్ అక్కడి నుంచి 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న హనోయికి కారులో వెళ్లారు.

ఫొటో సోర్స్, Getty Images
వియత్నాంలో ఏం చేయబోతున్నారు?
బుధవారం సాయంత్రం ఇద్దరు నేతలూ భేటీ కానున్నారు. అనంతరం ఇద్దరూ కలిసి భోంచేస్తారు. మరునాడు గురువారం రెండో విడత చర్చలున్నాయి.
గత ఏడాది జూన్‌లో సింగపూర్‌లో జరిగిన సమావేశం తరువాత పరిణామాలను సమీక్షించకుని ఇకపై ఏం చేయాలనే విషయంలో రెండు దేశాల నేతల మధ్య చర్చ జరుగుతుంది.
సింగపూర్‌లో ఇద్దరి మధ్యా తొలి భేటీలో అణు నిరాయుధీకరణపై ఒప్పందం జరిగినా విధివిధానాలేమీ స్పష్టంగా ఖరారు కాలేదు.
అయితే, దౌత్యపరంగా రెండు దేశాల మధ్య ఆ సమావేశం కొత్త శకానికి నాంది పలికిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ నేపథ్యంలో తాజా సమావేశంపై భారీ అంచనాలున్నాయి. కానీ, ట్రంప్ మాత్రం తనకేమీ ఈ విషయంలో తొందరలేదన్నట్లుగానే మాట్లాడుతున్నారు.
''ఎవరినీ తొందరపెట్టాలని అనుకోవడం లేదు. అటువైపు నుంచి అణు పరీక్షలు లేనంతవరకు సంతోషమే'' అని ట్రంప్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వియత్నాంలోనే భేటీ ఎందుకు?
అనేక కారణాల వల్ల ఇది రెండు దేశాలకూ ఒక సరైన ప్రదేశం. ఉత్తరకొరియా, అమెరికా రెండింటితోనూ వియత్నాంకు దౌత్యపరంగా మంచి సంబంధాలే ఉన్నాయి. ఒకప్పడు అమెరికా, వియత్నాంల మధ్య యుద్ధం జరిగినప్పటికీ ప్రస్తుతం మంచి సంబంధాలే ఉన్నాయి.
పైగా శత్రుత్వం వీడడం వల్ల కలిగిన ఫలితాలకు ఉదాహరణగా వియత్నాంను ఉత్తరకొరియాకు చూపించడానికి అమెరికా ఈ దేశాన్ని ఎంచుకుని ఉండొచ్చు.
వియత్నాం, ఉత్తరకొరియాలు రెండూ కమ్యూనిస్టు దేశాలే. మరోవైపు వియత్నాం ఆసియాలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అవతరిస్తోంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








