ట్రంప్-కిమ్ భేటీ: ‘అణునిరాయుధీకరణకు నేను సిద్ధమే’ - కిమ్... ‘ఒక విదేశీ పాత్రికేయుడికి కిమ్ ఇచ్చిన మొట్టమొదటి జవాబు ఇదే’

ట్రంప్, కిమ్

ఫొటో సోర్స్, Getty Images

అణునిరాయుధీకరణకు తాను సిద్ధంగా లేకపోయినట్లయితే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమై ఉండేవాడిని కాదని ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ విలేకరులతో పేర్కొన్నారు.

అణునిరాయుధీకరణపై చర్చించటం కోసం ఇరువురు నాయకులూ బుధవారం వియత్నాంలో సమావేశమయ్యారు. గురువారం కూడా ఈ భేటీ కొనసాగే అవకాశం ఉంది.

ట్రంప్, కిమ్‌లు గత ఏడాది తొలిసారి జరిపిన చరిత్రాత్మక భేటీ అనంతరం ఎటువంటి పురోగతి లేకపోవటంతో.. అణు నిరాయుధీకరణపై నిర్దిష్ట చర్యలు చేపట్టాలన్న ఒత్తిడి ఇరువురి మీదా ఉంది.

అయితే.. అణునిరాయుధీకరణకు కిమ్ చెప్తున్న భాష్యమేమిటనేది అస్పష్టంగానే ఉందని విశ్లేషకులు అంటున్నారు.

మరోవైపు.. ఒప్పందం చేసుకోవటానికి 'తొందర లేదు' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

మెట్రోపోల్ హోటల్

ఫొటో సోర్స్, Reuters

అణునిరాయుధీకరణకు తాను సిద్ధంగా లేకపోయినట్లయితే తాను ఈ భేటీకి వచ్చేవాడిని కాదని కిమ్ ఒక విలేకరితో చెప్పినపుడు.. ''మీరు విన్న అత్యుత్తమమైన జవాబు ఇదే కావచ్చు'' అని ట్రంప్ పేర్కొన్నారు.

ఒక విదేశీ పాత్రికేయుడికి కిమ్ ఇచ్చిన మొట్టమొదటి జవాబు ఇదేనని భావిస్తున్నారు.

వియత్నాం రాజధాని హనోయిలో మెట్రోపోలో హోటల్‌లో సమావేశమైన ట్రంప్, కిమ్‌లు తొలి విడత ఆంతరంగికంగా ముఖాముఖి చర్చలు జరిపిన తర్వాత.. తమ సహాయకులతో కలిసి, కెమెరాల ముందు మలివిడత చర్చలు ప్రారంభించారు.

కొరియా ద్వీపకల్పం నుంచి అణ్వాయుధాలను తొలగించటానికి ఒక మార్గదర్శక ప్రణాళికపై ఇరువురు నాయకులూ చర్చిస్తున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.

ట్రంప్, కిమ్

ఫొటో సోర్స్, AFP

ఈ చర్చలు ముగిసిన అనంతరం కొరియా యుద్ధం ముగిసినట్లు లాంఛన ప్రాయంగా ఒప్పందాన్ని ప్రకటించే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

అప్పటివరకూ పరస్పరం తీవ్రంగా విమర్శించుకున్న ట్రంప్, కిమ్‌లు మొదటిసారిగా గత ఏడాది జూలైలో సింగపూర్‌లో సమావేశమైన విషయం తెలిసిందే. అది చరిత్రాత్మక భేటీ అనటంలో సందేహం లేదు. అయితే.. ఇప్పుడు తమ విమర్శకులకు పటిష్టమైన పురోగతి సంకేతాలతో సమాధానం చెప్పాల్సిన అవసరముందని వీరిద్దరికీ బాగా తెలుసు.

ఉత్తర కొరియాకు ఆంక్షల నుంచి ఏదైనా ఉపశమనం కావాలంటే ఆ దేశం ముందు ఏకపక్షంగా అణ్వాయుధాలను విసర్జించాల్సి ఉంటుందని అమెరికా ఇంతకుముందు పేర్కొంది. అయితే ఉత్తర కొరియా ఆ షరతును వ్యతిరేకిస్తోంది.

ట్రంప్, కిమ్

ఫొటో సోర్స్, AFP

తాజా భేటీకి ముందు ట్రంప్ మాట్లాడుతూ.. తాను ''సరైన ఒప్పందం'' కోరుకున్నానని వ్యాఖ్యానించటం ద్వారా.. గత భేటీపై వచ్చిన విమర్శలకు సమాధానం ఇవ్వటానికి ప్రయత్నించినట్లు కనిపించింది.

''నేను మొదటి నుంచీ చెప్తున్నాను. వేగంగా ముందుకెళ్లటం నాకంత ముఖ్యం కాదు. అణు రాకెట్లు, క్షిపణులు వేటినీ పరీక్షించకపోవటాన్ని నేను చాలా అభినందిస్తున్నాను. కిమ్ మీద నాకు ఎంతో గౌరవం ఉంది'' అని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు.. కిమ్ ఒక విదేశీ విలేకరి ప్రశ్నకు జవాబిస్తూ.. ''ఇప్పుడే చెప్పలేం. అయితే మంచి ఫలితాలు వస్తాయని నేను బలంగా భావిస్తున్నాను'' అని చెప్పారు.

ట్రంప్‌ పక్కన తనను చూసిన జనం ఏదో 'ఫాంటసీ మూవీ' చూసినట్లు భావిస్తారని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

ట్రంప్, కిమ్

అయితే.. ఉత్తర కొరియాలో మానవ హక్కుల విషయం గురించి కూడా చర్చిస్తున్నారా అంటూ కిమ్‌ను ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు.. ట్రంప్ జోక్యం చేసుకుని తాము ''అన్ని విషయాలూ చర్చిస్తున్నాం'' అని చెప్పారు. కిమ్ బదులివ్వలేదు.

కిమ్‌తో గట్టి స్వరంతో మాట్లాడవద్దని విలేకరులను ట్రంప్ వేరుగా హెచ్చరించారు.

ట్రంప్, కిమ్‌లు తొలి విడత 30 నిమిషాల పాటు భేటీ అయిన అనంతరం కొద్దిసేపు బయటకు వచ్చి నడిచారు. వారితో పాటు వారి వారి ముఖ్య సలహాదారులు - కిమ్ తరఫున యాంగ్ చోల్, ట్రంప్ వైపు విదేశాంగ మంత్రి మైక్ పాంపేయో, దుబాసీలు కూడా ఉన్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)