కాలిఫోర్నియా కార్చిచ్చు: 25కు పెరిగిన మృతుల సంఖ్య

కాలిఫోర్నియా కార్చిచ్చులో మృతి చెందిన వారి సంఖ్య 25కు చేరిందని అధికారులు తెలిపారు.
ఉత్తర కాలిఫోర్నియాలో మంటల్లో బూడిదైన పారడైజ్ పట్టణానికి సమీపంలో మరో 14 మృతదేహాలు గుర్తించినట్టు చెప్పారు. దీంతో ఈ ప్రాంతంలో మొత్తం 23 మంది చనిపోయారని అధికారులు ధ్రువీకరించారు.
దక్షిణ కాలిఫోర్నియా మలిబులో మరో ఇద్దరు మృతి చెందారు.
రాష్ట్రంలో ఒకేసారి మూడు కార్చిచ్చులు వేగంగా వ్యాపించడంతో ఆయా ప్రాంతాల్లో దాదాపు రెండున్నర లక్షల మందిని ఇళ్ల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఈ మూడు కార్చిచ్చులను క్యాంప్ ఫైర్, వూస్లీ ఫైర్, హిల్ ఫైర్ అని చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఈ మంటలు గురువారం బుట్టె కౌంటీ నుంచి వ్యాపించడం మొదలయ్యాయి. అవి వేగంగా పారడైజ్‌ను బూడిద చేస్తుంటే ఫైర్ ఫైటర్లు వాటిని అడ్డుకోలేకపోయారు.
శుక్రవారం దక్షిణ తీరంలో ఉన్న మలిబులో వ్యాపించిన మంటలు ఇప్పుడు మరింత తీవ్రంగా మారాయి.
ఈ కార్చిచ్చు ప్రస్తుతం 70 వేల ఎకరాల్లో వ్యాపించి ఉంది.
ఈ ప్రమాదకర పరిస్థితి వచ్చే వారం కూడా కనసాగవచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. కానీ ఫైర్ ఫైటర్స్ మాత్రం గాలులు తగ్గి మంటలు తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు వాటిని ఆర్పే ప్రయత్నం చేయచ్చని ఆశిస్తున్నారు.

ఈ మంటలు ఎలా వ్యాపిస్తున్నాయి?
శుక్రవారం రాత్రంతా వ్యాపించిన మంటలు పశ్చిమ లాస్ ఏంజిల్స్‌లో ప్రధాన మార్గం 101 హైవేను దాటాయి. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నానికి మంటలు 14 వేల ఎకరాల్లో వ్యాపించాయి.
బుధవారం మాజీ సైనికుడి కాల్పుల్లో 12 మంది మృతి చెందిన థౌజండ్ ఓక్స్‌లో మంటలు వ్యాపించడంతో పట్టణంలోని 75 వేల నివాసాలను ఖాళీ చేయించారు.
థౌజండ్ ఓక్స్‌తోపాటు, 101 హైవే పక్కనే ఉన్న కలబాసస్, తీరంలోని మలిబు పట్టణాల నుంచి ప్రజలను వెంటనే ఖాళీ చేయించారు.
ఈ పట్టణాల్లో ఉంటున్న ప్రముఖులు తమ ప్రాంతంలో వ్యాపించిన మంటల గురించి తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు. తాము సురక్షితంగా ఉన్నట్టు అభిమానులకు తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
గాయని లేడీ గాగా మలిబులో ఉన్న తన ఇంటిని ఖాళీ చేశానని చెప్పారు. దట్టంగా పొగలు వస్తున్న ఒక వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
ఆస్కార్ డైరెక్టర్ గుల్లిర్మో డెల్ టోరో తన ఇల్లు ఖాళీ చేశానని, తన ఎన్నో జ్ఞాపకాలతో కట్టుకున్న మ్యూజియం బ్లీక్ హౌస్ వదిలి వెళ్లిపోతున్నానని చెప్పారు. ఈ మంటల్లో కొన్ని టీవీ సిరీస్‌కు సంబంధించిన సెట్స్ కూడా కాలిపోయాయి.

ఉత్తర కాలిఫోర్నియాకు ఏమైంది?
గురువారం క్యాంప్ క్రీక్ దగ్గర 20 వేల ఎకరాల్లో వ్యాపించిన కార్చిచ్చు పారడైజ్ పట్టణాన్ని బూడిద చేసింది. ఈ మంటల్లో చిక్కుకుపోయిన ఐదుగురు తమ కార్లలోనే మృతి చెందారని పోలీసులు తెలిపారు.
గాలులు బలంగా వీస్తుండడంతో మంటలు గంటకు 56 కిలోమీటర్ల వేగంతో పశ్చిమంగా వెళ్తున్నాయని అధికారులు తెలిపారు. చికో పట్టణంలో ఉన్న వారు ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

ఫొటో సోర్స్, AFP
ఈ మంటలు నిమిషానికి 80 ఫుట్ బాల్ మైదానాలతో సమానమైన భూభాగాన్ని బూడిద చేస్తున్నాయి.
మంటల్లో చిక్కుకున్న పారడైజ్ పట్టణం లోంచి వాహనాలన్నీ ఒకేసారి రోడ్డుపైకి వచ్చాయి. దాదాపు 27 వేల మంది ప్రాణాలు కాపాడుకోడానికి వాహనాలతోనే మంటలను చీల్చుకుంటూ వెళ్లారు.
కొందరు తమ వాహనాలు వదిలి పిల్లలు, పెంపుడు జంతువులతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. తప్పిపోయిన స్నేహితులను, కుటుంబ సభ్యులను వెతకడానికి చాలా మంది సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు.

ఫొటో సోర్స్, AFP/GETTY
పారడైజ్ పట్టణంలో గాయపడ్డవారిని ఆస్పత్రికి తీసుకెళ్లే అంబులెన్సులకు దారి కోసం రోడ్డుపై ఉన్న కార్లను బుల్‌డోజర్‌తో నెట్టాల్సి వచ్చింది.

ఒకేసారి రెండు ప్రాంతాల్లో చెలరేగిన మంటలతో అధికారులు 24 గంటల్లో పెను ప్రమాదం రావచ్చని సంకేతాలు ఇచ్చే రెడ్ ఫ్లాగ్ వార్నింగ్ జారీ చేశారు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణలో ‘ఆమె’కు ఎందుకు అంత అప్రాధాన్యం?
- శ్రీలంక పార్లమెంటు రద్దుకు అధ్యక్షుడు అర్ధరాత్రి ఆదేశాలు
- వినాయకి మాత ఎవరు? ఆమె ఎక్కడి నుంచి వచ్చారు?
- దీపావళి ప్రత్యేకం: లక్ష్మీదేవి బొమ్మలో ముఖం ఎవరిది?
- తెలంగాణ ఎన్నికలు: ‘పాతబస్తీ అభివృద్ధి గాలిబ్ ప్రేయసి వాగ్దానంలా ఉంది’
- కాలిఫోర్నియా బార్లో కాల్పులు: ‘నిందితుడు మానసిక రోగి’
- భారీగా పతనమవుతున్న చైనా కరెన్సీ యువాన్.. కారణాలివే
- చరిత్రలో అత్యంత ధనికుడు ఇతనేనా!!
- తెలంగాణ ఎన్నికలు: 'మేం ఎన్నికలను బహిష్కరిస్తున్నాం'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








