అఫ్గానిస్తాన్ ఎన్నికలు: తాలిబన్ల హెచ్చరికలను లెక్కచేయని ఓటర్లు

ఓటు వేస్తున్న మహిళ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మజర్ ఎ షరీఫ్ ప్రాంతంలో ఓటు వేస్తున్న మహిళా ఓటరు

అఫ్గానిస్తాన్‌లో 2015 నుంచీ పెండింగులో ఉన్న పార్లమెంటరీ ఎన్నికలు శనివారం జరిగాయి. పోలింగ్ అడ్డుకుంటామన్న తాలిబన్ల హెచ్చరికలను పట్టించుకోకుండా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు పోలింగ్ కేంద్రాలు లక్ష్యంగా అనేక చోట్ల దాడులు జరిగాయి. పదుల సంఖ్యలో ప్రజలు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు.

కొన్ని చోట్ల ఓటింగ్ ప్రక్రియ బాగా ఆలస్యమైంది. మరికొన్ని చోట్ల ఆదివారం కూడా పోలింగ్ నిర్వహించనున్నారు.

అఫ్గానిస్తాన్‌లోని 250 స్థానాలకు కొందరు మహిళల సహా 2500 మందికి పైగా అభ్యర్థులు పోటీపడుతున్నారు.

కానీ, 30 శాతానికి పైగా పోలింగ్ కేంద్రాలను భద్రతాపరమైన కారణాలతో మూసివేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న పది మంది అభ్యర్థులు ఇప్పటికే హత్యకు గురయ్యారు. ఒక పోలీసు ఉన్నతాధికారి హత్యతో కాందహార్ ప్రావిన్స్‌లో వారం ఆలస్యంగా ఎన్నికలు నిర్వహించనున్నారు.

గురువారం జనరల్ అబ్దుల్ రజిక్‌ను ఆయన అంగరక్షకుడే కాల్చి చంపారు. ఈ దాడికి తామే కారణమని తాలిబన్లు ప్రకటించారు. అత్యున్నత స్థాయి రక్షణ సమావేశం తర్వాత ఈ ఘటన జరిగింది. అమెరికా కమాండర్ జెన్ స్కాట్ ఈ దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు.

అప్ఘాన్ ఎన్నికలు

ఫొటో సోర్స్, Reuters

హింస ఎక్కడ జరిగింది?

పోలింగ్ రోజున అనేక ప్రాంతాల్లో హింస చోటు చేసుకుంది.

  • కాబుల్‌లో ఆత్మాహుతి దాడిలో 15 మంది మృతి చెందినట్లు టోలో న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
  • కాబుల్‌లోనే జరిగిన మరో ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో 30 మంది గాయపడినట్లు ఏఎఫ్‌పీ న్యూస్ తెలిపింది.

పోలింగ్ రోజు-కీలక గణాంకాలు

స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఓటింగ్ జరిగింది. సుమారు 90 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది..

కానీ, మొదట 7 వేల పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించాలని భావించినా భద్రతా కారణాలతో దాదాపు 5 వేల పోలింగ్ కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేశారు.

వీటిని బూటకపు ఎన్నికలుగా వర్ణిస్తున్న తాలిబన్లు పోలింగ్ బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అప్గానిస్తాన్‌లోని ఇస్లామిక్ మిలిటెంట్లు కూడా ఎన్నికలను వ్యతిరేకిస్తున్నారు.

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా, దాదాపు 54 వేల మంది భద్రతా బలగాలను విధుల్లో మోహరించారు.

మొదటి ఎన్నికల ఫలితాలు ఎన్నికలు జరిగిన 20 రోజుల తర్వాత, నవంబర్ 10న వెల్లడిస్తారని అంచనా వేస్తున్నారు.

అప్ఘాన్ ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

అప్ఘాన్ ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

ఎన్నికలు ఎందుకంత ముఖ్యం

అఫ్గానిస్తాన్ ప్రజలు చాలామంది మెరుగైన జీవితం, ఉద్యోగాలు, విద్య కోసం తపించిపోతున్నారు. తాలిబన్లతో జరుగుతున్న యుద్ధానికి తెరపడాలని కోరుకుంటున్నారు.

దశాబ్దానికి పైగా జరిగిన పోరాటంలో వేల మరణాలు, లక్షల డాలర్ల వ్యయం, ఎన్నో ఏళ్ల పెట్టుబడుల తర్వాత అఫ్గానిస్తాన్‌లో మళ్లీ ప్రజాస్వామ్యం వికసిస్తుందని మిత్ర దేశాలు ఎదురుచూస్తున్నాయి.

ఎన్నికల్లో ఉన్నత విద్యావంతులైన చాలా మంది యువతీయువకులు పోటీ చేస్తున్నారు. యుద్ధంలో నలిగిపోతున్న దేశంలో మార్పు తీసుకొచ్చేందుకు సహకరిస్తామని చెబుతున్నారు.

కానీ చాలామంది అఫ్గానిస్తాన్ ప్రజలు రాజకీయ నాయకులు అవినీతిపరులని, దేశంపై ఎలాంటి ప్రభావం చూపలేకపోతున్నారని బీబీసీ ప్రతినిధులకు తెలిపారు.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది

ఈ ఎన్నికలు ప్రస్తుత అసెంబ్లీ ఐదేళ్ల పదవీకాలం ముగిసినప్పుడు 2015లో జరిగుండాలి. కానీ 2014లో జరిగిన వివాదాస్పద అధ్యక్ష ఎన్నికల తర్వాత అంతా మారిపోయింది. ఆ ఎన్నికలు అప్గానిస్తాన్‌ను అంతర్యుద్ధం అంచులదాకా తీసుకొచ్చాయి.

2019లో జరిగే అధ్యక్ష ఎన్నికలకు ముందు జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలను వాటికి పరీక్షగా కూడా భావిస్తున్నారు.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)