హరికేన్ మైకేల్: శిథిలాల కుప్పలుగా మారిన ఫ్లోరిడా నగరాలు

ఫొటో సోర్స్, Reuters
బుధవారం మైకేల్ తుపాను విధ్వంసంతో అమెరికా ఆగ్నేయ రాష్ట్రం ఫ్లోరిడాలో భారీ ఆస్తి నష్టం జరిగింది. తుపాను వల్ల చాలా మంది తమ సర్వస్వం పోగొట్టుకున్నారని రాష్ట్ర గవర్నర్ రిక్ స్టాక్ తెలిపారు.
తుపాను వల్ల వాయవ్య ఫ్లోరిడా తీవ్రంగా దెబ్బతింది. చాలా ఇళ్లు కుప్పకూలగా, విద్యుత్ లైన్లు తెగి రహదారులపై పడ్డాయి. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి.
ఈశాన్యం దిశగా కదులుతున్న తుపాను ప్రభావం ప్రస్తుతం కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. మైకేల్ విధ్వంసం వల్ల ఇప్పటివరకూ ఫ్లోరిడాలో ఆరుగురు మృతి చెందారు. 3 లక్షల 70 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించారు. కానీ కొంతమంది ఈ హెచ్చరికలను నిర్లక్ష్యం చేశారని అధికారులు చెబుతున్నారు.
అమెరికా తీరరక్షక దళం సహాయ కార్యక్రమాలు చేపడుతోందని, 27 మందిని కాపాడిందని గవర్నర్ స్కాట్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
తీవ్ర నష్టం
బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు( అమెరికా కాలమానం ప్రకారం) మైకేల్ తుపాను మొదట ఫ్లోరిడా, మెక్సికో మధ్య ఉన్న పాన్‌హాండిల్ తీరానికి చేరింది.
అమెరికాను కుదిపేసిన భయంకరమైన తుపానుల్లో దీన్ని కూడా చేర్చారు. నాలుగు దశల్లో దీని తీవ్రత, సఫిర్-సింప్సన్ స్కేలుపై నాలుగుగా నమోదైంది.
చాలా ప్రాంతాల్లో ఎన్నో ఇళ్లు పునాదులతో సహా పెకలించుకుపోవడం మైకేల్ తుపాను తీవ్రతను చెబుతోంది.
తుపాను వల్ల మధ్య మెక్సికో ఎక్కువ ప్రభావితమైందని, భవనాలు కూలి, విద్యుత్ తీగలు తెగిపడడంతో నగరమంతా శిథిలాలు పేరుకుపోయాయని ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ అధికారులు తెలిపారు.
ఫ్లోరిడాలోని అపలాచికోలా నగరం తుఫాను వల్ల తీవ్రంగా ధ్వంసమైంది. నగరం మధ్యలో విద్యుత్ తీగలు తెగిపడడంతో సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోందని మేయర్ ప్రకటించారు. దానితోపాటు చాలా ప్రాంతాల్లో శిథిలాలు, నీళ్లు నిలవడంతో పరిస్థితి ఘోరంగా మారింది.
శిథిలాలను పూర్తిగా తొలగించి, సాధారణ పరిస్థితి నెలకొనేవరకూ ఎవరూ నగరాలకు తిరిగి రావద్దని గవర్నర్ స్కాట్ పౌరులను కోరారు.
ఫ్లోరిడాలోని చాలా నగరాల్లో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ధ్వంసమైన ఇళ్లలోని సామాన్లన్నీ రోడ్లపై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పటివరకూ ఆరుగురి మృతి
ఈ తుఫాను వల్ల ఇప్పటివరకూ ఆరుగురు చనిపోయారు. వీరిలో నలుగురు ఫ్లోరిడాలో, ఒకరు జార్జియాలో మరణించారు. ఒకరు ఉత్తర కెరోలినాలో మృతి చెందారు.
తుపాను గాలులతో ఫ్లోరిడా, అలబామా, కెరోలినాస్, జార్జియాలో 9 లక్షలకు పైగా ఇళ్లు, పరిశ్రమలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఫ్లోరిడా షెల్టర్లో దాదాపు 6 వేల మందికి ఆశ్రయం పొందుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
తుపాను ప్రస్తుత స్థితి
ప్రస్తుతం తుపాను వేగం గంటకు 50 మైళ్లతో కదులుతోంది. మైకేల్ ఇప్పుడు జార్జియా దాటి ఈశాన్య దిశగా వెళ్తున్నట్టు అమెరికా జాతీయ తుపాను కేంద్రం తెలిపింది. ఇది ఉత్తర కెరోలినాకు చేరుకుంటుందని భావిస్తున్నారు.
కెరోలినా నగరం ఫ్లోరెన్స్ తుపాను విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. ఫ్లోరిడా, అలబామా, జార్జియా, నార్త్ కరోలినాలో పరిస్థితి తీవ్రంగా ఉండడంతో రాష్ట్ర స్థాయిలో అత్యవసర స్థితి ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
- గంగా ప్రక్షాళన కోసం దీక్ష చేస్తూ ప్రొ. జీడీ అగర్వాల్ కన్నుమూత
- అభిప్రాయం: పండగ సీజన్లో ఆన్లైన్ దుకాణాల జోరు... వీధి మార్కెట్లు బేజారు
- #MeToo: ‘గుళ్లో దేవతలను పూజిస్తారు, ఇంట్లో మహిళలను వేధిస్తారు’ - మహేష్ భట్
- యమునా నదిలో ఈ విషపూరిత నురగ ఎందుకొస్తోంది?
- పూజకు ముందు.. పీరియడ్లను వాయిదా వేసే పిల్ తీసుకుంటున్నారా?
- సోయజ్ రాకెట్లో సాంకేతిక లోపం.. వ్యోమగాములకు తప్పిన ప్రమాదం
- అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంతో మరింత పేదరికంలోకి ప్రపంచం: ఐఎంఎఫ్
- జన్యుపరీక్ష: ‘రూ.4వేలతో మీకు ‘గుండెపోటు’ వస్తుందా లేదా ముందే తెలుసుకోవచ్చు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








