పాక్ ఎన్నికలు: లష్కర్-ఏ-తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ పార్టీకి ఒక్క సీటు కూడా ఎందుకు రాలేదు?

ఫొటో సోర్స్, AFP
- రచయిత, మానసి దాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పాకిస్తాన్ సాధారణ ఎన్నికల్లో ఛాందసవాద ధోరణి చూపించిన పార్టీలకు ఓటర్ల నుంచి ఎక్కువ మద్దతు లభించకుండా పోయింది.
పాకిస్తాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ తహ్రీక్-ఎ-ఇన్సాఫ్‌కు ఎక్కువ సీట్లు లభించాయి. కాబోయే ప్రధాని ఆయనేనని భావిస్తున్నారు.
పాకిస్తాన్ ప్రజలు ఇమ్రాన్ ఖాన్ అవినీతి వ్యతిరేక ప్రచారాన్ని స్వాగతించారు. అయితే ఇమ్రాన్‌పై ఇస్లాం రాజకీయాలు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. కానీ పాకిస్తాన్ ప్రజలు హఫీజ్ సయీద్ లాంటి ఇస్లాం ఛాందసవాద శక్తులను స్పష్టంగా తిరస్కరించారు.
దేశ ప్రజలు ఇప్పుడు శాంతిని కోరుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈసారి సుమారు 40 శాతం యువత, కొత్త ఓటర్లు ఒక కొత్త ఆలోచనకు అండగా నిలిచారు. అవినీతికి వ్యతిరేకంగా, దేశాభివృద్ధి కోసం ఓటు వేశారు.

ఫొటో సోర్స్, AFP
లష్కర్-ఏ-తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కొత్త పార్టీ అల్లా హు అక్బర్ తహ్రీక్.. నేషనల్ అసెంబ్లీలోని 272 సీట్లలో 79 స్థానాల్లో తమ అభ్యర్థులను (4 రాష్ట్ర అసెంబ్లీల కోసం 181 మంది అభ్యర్థులను) నిలబెట్టింది. కానీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.
జమాత్-ఉద్-దవా రాజకీయ శాఖగా హఫీజ్ సయీద్ మిలీ ముస్లిం లీగ్ ఏర్పాటు చేశారు. కానీ ఎన్నికల కమిషన్ దాన్ని నమోదు చేయడానికి ఒప్పుకోలేదు. దాంతో హఫీజ్ అభ్యర్థులు అల్లా హు అక్బర్ తహ్రీక్ పార్టీ తరఫున పోటీ చేశారు.
హఫీజ్ సయీద్ కొడుకు హఫీజ్ తల్హా సయీద్, అల్లుడు ఖాలిద్ వలీద్ కూడా ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు. దైవదూషణ చట్టం పైరవీలు చేసిన తహ్రీక్ లబైక్ పాకిస్తాన్ పార్టీ మొత్తం 180 మంది అభ్యర్థులను పోటీకి నిలిపినా, వారిలో ఎవరూ గెలవలేకపోయారు.
పార్లమెంటు వైపు సాగని ప్రయాణం
"పాకిస్తాన్ పార్లమెంటు చరిత్రను తిరగేస్తే మతతత్వ పార్టీలు ప్రజలను తమవైపు ఆకర్షించగలుగుతున్నాయి. కానీ ఎన్నికల విషయానికి వస్తే ఓటర్లు అలాంటి పార్టీలను ఎప్పుడూ సమర్థించడం లేదు" అని ఇస్లామాబాద్‌లోని బీబీసీ ప్రతినిధి హరూన్ రషీద్ చెప్పారు.
2002లో అమెరికా అఫ్గానిస్తాన్‌పై దాడి చేసినప్పుడు, అప్పటి ఎన్నికల్లో మతపరమైన ధోరణులు ఉన్న రాజకీయ పార్టీల కూటమి ముత్తాహిదా మజ్లిసే అమల్ గెలిచింది.
"వాళ్లు ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ప్రాంతీయ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. కానీ ఆ తర్వాత ఇప్పటివరకూ అలాంటి పార్టీ ఏదీ ఎన్నికల్లో గెలవడం అనేది జరగలేదు" అని హరూన్ రషీద్ తెలిపారు.
జులై 25న జరిగిన ఎన్నికలకు ముందు కూడా పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ఇలాంటి పార్టీల ఉనికి పెద్దగా లేదు.

ఫొటో సోర్స్, Reuters
"పాకిస్తాన్‌లో మతధోరణులు ఉన్న పార్టీలకు లభిస్తున్న మద్దతు తగ్గిపోతూ వస్తోంది. పాకిస్తాన్ రాజకీయాల్లో మతతత్వ పార్టీలకు పొరుగు దేశాల్లో ఉన్నంత చోటు లేదని ఈసారి ఎన్నికల ఫలితాలు నిరూపించాయి" అని సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు జాహిద్ హుస్సేన్ అన్నారు.
"పాకిస్తాన్ గురించి తెలియని వాళ్లు, అలాంటి పార్టీలకు ఇక్కడ చాలా మద్దతు లభిస్తుంటుందని అనుకుంటారు. కానీ అది జరగదు. ఈ దేశం శాంతి కోరుకుంటోంది."
ఈ పార్టీలు హింసకు సంబంధించిన అంశాలను లేవనెత్తుతాయి. భయపెట్టేలా, షాక్ అయ్యేలా మాట్లాడుతాయి. అందుకే ఆ పార్టీలు చాలా బలమైనవేమో అనిపిస్తుంది. కానీ అది నిజం కాదు.
"హఫీజ్ సయీద్ కొత్త పార్టీ పెట్టినా, పెట్టకపోయినా.. ఆయన పాకిస్తాన్ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం దాదాపు కుదరదనే చెప్పాలి. కానీ బయటి దేశాలకు అలా అనిపించదు. ఇక్కడ పాత మెయిన్‌స్ట్రీమ్ పార్టీలు(జమాత్ ఉలేమా ఇస్లామ్ లాంటి పార్టీ) ఉండేవి. అవి ఎప్పటి నుంచో ఇక్కడ రాజకీయాల్లో ఉండేవి. అవే తుడిచిపెట్టుకుపోయాయి. ఇక కొత్త పార్టీలను ఎవరు పట్టించుకుంటారు" అని జాహిద్ అన్నారు.
ఇవికూడా చదవండి:
- ఇమ్రాన్ ఖాన్: పాకిస్తాన్ కొత్త ‘కెప్టెన్’ ఈయనేనా
- పాక్ ఎన్నికల్లో పదనిసలు: బిర్యానీ తినండి.. ఓటేయండి
- పాకిస్తాన్ అణుకేంద్రం గుట్టు ‘రా’ ఎలా కనిపెట్టింది?
- కొలంబియా: డ్రగ్ ముఠాల భరతం పట్టిన కుక్క.. చంపేందుకు పంతం పట్టిన గ్యాంగులు
- తెలుగు రాష్ట్రాల్లో 91 శాతం ఇళ్లలో టీవీ
- అబ్దుల్ కలాం ఆఖరి రోజు అసలేం జరిగింది?
- కేరళ: 'కూర్చునే హక్కు' సాధించుకున్న సేల్స్ గర్ల్స్
- శానిటరీ న్యాప్కిన్లపై జీఎస్టీ రద్దు వెనకున్నది ఈ అమ్మాయే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








